సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిర్వహించాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లకు సీఎస్ జవహర్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
పురుషులు, మహిళలకు అన్ని స్థాయిల్లో కలిపి మొత్తం 2.99 లక్షల మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. వీటితోపాటు సంప్రదాయ క్రీడల్లో కూడా పోటీలు నిర్వహించాలని సూచించారు. వీటి నిర్వహణకు అవసరమైన అన్ని క్రీడా మైదానాలను గుర్తించి సిద్ధం చేయాలని ఆదేశించారు. పోటీల నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, ఇంజినీర్లు, పంచాయతీరాజ్ ఈవోలకు తగిన ఆదేశాలివ్వాలని సూచించారు.
పోటీల సమయంలో క్రీడాకారులకు రవాణా, ఆహారం, వసతి ఏర్పాటు చేయాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులను ఆహా్వనించాలని పేర్కొన్నారు. అన్ని స్థాయిల్లో పోటీల నిర్వహణకు మొత్తం 46 రోజులు పడుతుందన్నారు. అన్ని మ్యాచ్‌లు సంబంధిత చీఫ్ కోచ్ రూపొందించిన ప్రణాళిక ప్రకారమే నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి స్థాయిలో పోటీల నిర్వహణకు ఆర్గనైజింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment