జిల్లా పరిషత్తు పాఠశాలలో క్రీడాకారుల ఎంపిక
రామచంద్రాపురం: మండలంలో తూతూ మంత్రంగా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా మండల స్థాయిలో జరిగే క్రీడాపోటీలను నామమాత్రంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన క్రీడాసామాగ్రిని కూడా లేకపొవడంతో కొంతమంది పీఈటీలే వాటిని కొని ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.
దీనికితోడు విద్యార్థులలో క్రీడాస్ఫూర్తిని నింపడంలో పాలకులు పూర్తిగా విఫలం చెందుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మండల స్థాయి క్రీడాపోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది ఈ పోటీలను సరిగ్గా నిర్వహించలేదు. ఉపాధ్యాయులు వారి జేబుల్లో నుంచి పైసలను ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో క్రీడాపోటీలంటే మొదట ఉపాధ్యాయులే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది కాదన్నట్లు రెండురోజులుగా మండల స్థాయి క్రీడాపోటీల కోసం భెల్‌టౌన్‌షిప్‌లోని జిల్లా పరిషత్ పాఠశాలలో క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో మండల పరిధిలోని ఆరు జిల్లా పరిషత్తు పాఠశాలకు చెందిన విద్యార్థులతో పాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
బాలికల విభాగంలో ఇప్పటికే క్రీడాకారుల ఎంపిక జరిగింది. బాలుర విభాగంలో ప్రస్తుతం ఎంపిక కార్యక్రమం జరుగుతుంది. ఇది పూర్తయిన వెంటనే మండల స్థాయి క్రీడాపోటీలను నిర్వహించాల్సి ఉంటుంది. కానీ అందుకు కావాల్సిన నిధులు మాత్రం నేటికి మంజూరు కాకపోవడంతో అవి తమనేత్తిన ఎక్కడపడతాయోనని పీఈటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులలో విద్యతోపాటు క్రీడారంగంలో కూడా ముందుండేలా చూడాల్సిన పాలకుల నిర్లక్ష్యం వల్లే వారు క్రీడలకు దూరమవుతున్నరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైన జిల్లా ఉన్నతాధికారులు, పాలుకులు స్పందించి వెంటనే క్రీడాపోటీలకు కావాల్సిన నిధులను మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.