ramachandrapuram mandal
-
సబ్-స్టేషన్ల ఏర్పాట్లు కలేనా!
రామచంద్రాపురం: పట్టణం, మండల పరిధిలో విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు రెండు సబ్స్టేషన్లు మంజూరై ఏళ్లు గడుస్తున్న నిర్మాణ పనులు మాత్రం జరగడంలేదు. రామచంద్రాపురం పట్టణంలో విద్యుత్ వాడకం, కొత్త కొత్త కాలనీలు రావడంతో ఉన్న సబ్‌స్టేషన్‌పై లోడ్ పడుతుంది. దాని కారణంగా ఏప్పుడు కరెంట్ వస్తుందో పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీనితో పాటు లోఓల్టెజీ సమస్య ఏర్పడుతుంది. గతంలో ఒవర్‌లోడ్ కారణంగా లక్షల విలువచేసే పరికరాలు, కాలిపోయిన సంఘటనలు రామచంద్రాపురం సబ్‌స్టేషన్‌లో నెలకొన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు మరొక్క 33 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు చేశారు. అందుకు రూ.రెండు కోట్ల నిధులు సైతం మంజూరై ఏళ్లు గడుస్తున్న నేటికి పనుల ప్రారంభోత్సవానికి నోచుకొలేదు. గత పాలకులు సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం చూపిస్తామంటూ కాలయాపన చేశారే తప్ప పూర్తి స్థాయిలో భూమిని కేటాయించడంలో విఫలం చెందారు. సుమారు ఏడేళ్లు గడుస్తున్న నేటికి భూమిని కేటాయించకపోవడతో ప్రజలకు మాత్రం విద్యుత్ సమస్యలు తప్పడంలేదు. మండల పరిధిలోని విద్యుత్‌నగర్ సబ్‌స్టేషన్ కింద అనేక గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల పరిధిలో కొత్త కొత్త కాలనీలు రావడంతో ఉన్న సబ్‌స్టేషన్‌పై లోడ్ ఏక్కువ పడుతుంది. ఇక్కడ కూడా 33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం సుమారు రూ.రెండు కోట్లు మంజూరయ్యాయి. స్థలాన్ని చూపిస్తే సబ్‌స్టేషన్ నిర్మాణం పనులు ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు, నేతలకు మొరపెట్టుకుంటున్నా వారు మాత్రం సబ్‌స్టేషన్ నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని మాత్రం చూపెట్టడంలేదు. దానితో ఈ రెండు ప్రాంతాల్లో సబ్‌స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరైన ఫలితం మాత్రం రావడంలేదు. ఇప్పటికైన నేతలు స్పందించి సబ్‌స్టేషన్ నిర్మాణానికి భూమిని కేటాయించకపోతే రానున్న రోజుల్లో విద్యుత్ సమస్య జఠిలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది. -
తూతూమంత్రంగా క్రీడా పోటీలు
రామచంద్రాపురం: మండలంలో తూతూ మంత్రంగా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా మండల స్థాయిలో జరిగే క్రీడాపోటీలను నామమాత్రంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావాల్సిన క్రీడాసామాగ్రిని కూడా లేకపొవడంతో కొంతమంది పీఈటీలే వాటిని కొని ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికితోడు విద్యార్థులలో క్రీడాస్ఫూర్తిని నింపడంలో పాలకులు పూర్తిగా విఫలం చెందుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మండల స్థాయి క్రీడాపోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది ఈ పోటీలను సరిగ్గా నిర్వహించలేదు. ఉపాధ్యాయులు వారి జేబుల్లో నుంచి పైసలను ఖర్చుచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో క్రీడాపోటీలంటే మొదట ఉపాధ్యాయులే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది కాదన్నట్లు రెండురోజులుగా మండల స్థాయి క్రీడాపోటీల కోసం భెల్‌టౌన్‌షిప్‌లోని జిల్లా పరిషత్ పాఠశాలలో క్రీడాకారుల ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో మండల పరిధిలోని ఆరు జిల్లా పరిషత్తు పాఠశాలకు చెందిన విద్యార్థులతో పాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. బాలికల విభాగంలో ఇప్పటికే క్రీడాకారుల ఎంపిక జరిగింది. బాలుర విభాగంలో ప్రస్తుతం ఎంపిక కార్యక్రమం జరుగుతుంది. ఇది పూర్తయిన వెంటనే మండల స్థాయి క్రీడాపోటీలను నిర్వహించాల్సి ఉంటుంది. కానీ అందుకు కావాల్సిన నిధులు మాత్రం నేటికి మంజూరు కాకపోవడంతో అవి తమనేత్తిన ఎక్కడపడతాయోనని పీఈటీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులలో విద్యతోపాటు క్రీడారంగంలో కూడా ముందుండేలా చూడాల్సిన పాలకుల నిర్లక్ష్యం వల్లే వారు క్రీడలకు దూరమవుతున్నరన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైన జిల్లా ఉన్నతాధికారులు, పాలుకులు స్పందించి వెంటనే క్రీడాపోటీలకు కావాల్సిన నిధులను మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.