రామచంద్రాపురంలోని సబ్‌స్టేషన్
రామచంద్రాపురం: పట్టణం, మండల పరిధిలో విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు రెండు సబ్‌స్టేషన్లు మంజూరై ఏళ్లు గడుస్తున్న నిర్మాణ పనులు మాత్రం జరగడంలేదు. రామచంద్రాపురం పట్టణంలో విద్యుత్ వాడకం, కొత్త కొత్త కాలనీలు రావడంతో ఉన్న సబ్‌స్టేషన్‌పై లోడ్ పడుతుంది. దాని కారణంగా ఏప్పుడు కరెంట్ వస్తుందో పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
దీనితో పాటు లోఓల్టెజీ సమస్య ఏర్పడుతుంది. గతంలో ఒవర్‌లోడ్ కారణంగా లక్షల విలువచేసే పరికరాలు, కాలిపోయిన సంఘటనలు రామచంద్రాపురం సబ్‌స్టేషన్‌లో నెలకొన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు మరొక్క 33 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు చేశారు. అందుకు రూ.రెండు కోట్ల నిధులు సైతం మంజూరై ఏళ్లు గడుస్తున్న నేటికి పనుల ప్రారంభోత్సవానికి నోచుకొలేదు.
గత పాలకులు సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం చూపిస్తామంటూ కాలయాపన చేశారే తప్ప పూర్తి స్థాయిలో భూమిని కేటాయించడంలో విఫలం చెందారు. సుమారు ఏడేళ్లు గడుస్తున్న నేటికి భూమిని కేటాయించకపోవడతో ప్రజలకు మాత్రం విద్యుత్ సమస్యలు తప్పడంలేదు. మండల పరిధిలోని విద్యుత్‌నగర్ సబ్‌స్టేషన్ కింద అనేక గ్రామాలు ఉన్నాయి.
ఆయా గ్రామాల పరిధిలో కొత్త కొత్త కాలనీలు రావడంతో ఉన్న సబ్‌స్టేషన్‌పై లోడ్ ఏక్కువ పడుతుంది. ఇక్కడ కూడా 33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం సుమారు రూ.రెండు కోట్లు మంజూరయ్యాయి. స్థలాన్ని చూపిస్తే సబ్‌స్టేషన్ నిర్మాణం పనులు ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు, నేతలకు మొరపెట్టుకుంటున్నా వారు మాత్రం సబ్‌స్టేషన్ నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని మాత్రం చూపెట్టడంలేదు.
దానితో ఈ రెండు ప్రాంతాల్లో సబ్‌స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరైన ఫలితం మాత్రం రావడంలేదు. ఇప్పటికైన నేతలు స్పందించి సబ్‌స్టేషన్ నిర్మాణానికి భూమిని కేటాయించకపోతే రానున్న రోజుల్లో విద్యుత్ సమస్య జఠిలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంది.