ముగిసిన అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలు
ముగిసిన అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలు
Published Thu, Oct 20 2016 3:07 AM | Last Updated on Fri, Jul 12 2019 3:37 PM
ఆచంట : ఆచంటలో మూడు రోజులపాటు జరిగిన 62వ అంతర్‌జిల్లాల స్కూల్‌గేమ్స్ అండర్–19 బాలుర, బాలికల కబడ్డీ పోటీలు బుధవారం ముగిశాయి. బాలుర విభాగంలో ప్రకాశం జట్టు, బాలికల విభాగంలో విజయనగరం జట్టు విజేతలుగా నిలిచాయి. రెండోస్థానాన్ని బాలుర విభాగంలో కృష్ణా, బాలికల విభాగంలో విశాఖ జట్లు సాధించాయి. మూడో స్థానంలో బాలుర విభాగంలో పశ్చిమగోదావరి జట్టు, బాలికల విభాగంలో ప్రకాశం జట్టు నిలిచాయి. నరసాపురం సబ్‌కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ విజేతలకు బహుమతులు అందించారు.
బాలికల మధ్య హోరాహోరీ
బాలికల విభాగంలో ఫైనల్స్ హోరాహోరీగా జరిగింది. విజయనగరం, విశాఖ జట్లు నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. మ్యాచ్ టై కావడంతో అంపైర్లు మరో ఐదు రైడ్స్‌తో ఆట కొనసాగించారు. చివరకు విజయనగరం జట్టు 29–28 పాయింట్లతో విశాఖను ఓడించింది.
బాలుర మధ్య నువ్వానేనా..
బాలుర ఫైనల్స్ నువ్వానేనా అన్నట్టు సాగింది. కృష్ణా జట్టుపై ప్రకాశం జట్టు 30–27తో విజయకేతనం ఎగురవేసింది. మూడో స్థానం కోసం బాలుర విభాగంలో పశ్చిమగోదావరి, విశాఖ జట్లు తలపడగా పశ్చిమగోదావరి, బాలికల విభాగంలో ప్రకాశం, శ్రీకాకుళం జట్లు తలపడగా ప్రకాశం జట్లు గెలుపొందాయి.
క్రీడలకు స్ఫూర్తినిచ్చేది కబడ్డీ
క్రీడలకు స్పూర్తినిచ్చే ఆట కబడ్డీ అని, ఇటువంటి క్రీడలను మారుమూల గ్రామమైన ఆచంటలో అంతర్‌జిల్లాల స్థాయిలో నిర్వహించడం అభినందనీయమని నరసాపురం సబ్‌కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అన్నారు. కబడ్డీని ప్రొఫెషనల్‌గా తీసుకుని ఆడాలని సూచించారు. తహసిల్దార్ కె.రాజేంద్రప్రసాదరావు, ఎస్సై ఏజీఎస్ మూర్తి సర్పంచ్ బీరా తిరుతపమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు, సిద్దాంతం వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ తమ్మినీడి ప్రసాదు, ఓల్డ్ స్టూడెంట్స్ ఆసోసియేషన్ అధ్యక్షుడు బలుసు శ్రీరామమూర్తి పాల్గొన్నారు.
Advertisement
Advertisement