జహీరాబాద్, న్యూస్‌లైన్: విద్యార్థినులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జే గీతారెడ్డి సూచించారు. శనివారం మండలంలోని రంజోల్ గ్రామ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 9వ జోనల్ స్థాయి గురుకుల పాఠశాలల క్రీడలు ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ప్రారంభ వేడుకల్లో కలెక్టర్ దినకర్‌బాబు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ ఎం జైపాల్‌రెడ్డి, అదనపు జేసీ మూర్తి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమన్నారు. ఈ పోటీల్లో మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇలాం టి వేదికల్లో విద్యార్థులు వారి సత్తాను చాటుకోవాలన్నారు. వ్యక్తిగత ప్రతిభ చూపేందుకు కృషి చేయాలన్నారు. గురుకుల పాఠశాలల్లో ఉత్తమ బోధన అందుతోందన్నారు. అందుకే మంచి ఫలితాలను వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఉన్నత చదువులు చదువుకుని కుటుంబానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినులకు సూచించారు. విదేశాల్లో ఉన్నత చదువులు కొనసాగించుకోవాలనుకునే గురుకుల పాఠశాలల విద్యార్థులను ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందన్నారు. అనంతరం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు.
గురుకులాల్లో నాణ్యమైన విద్య, క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆపరేషన్ మౌంట్ ఎవరెస్ట్ అనే కార్యక్రమం తీసుకున్నట్లు తెలిపారు. ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కేందుకు వీలుగా ఒక బృందాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. కలెక్టర్ దినకర్‌బాబు మాట్లాడుతూ కష్టపడితేనే ఆశించిన ఫలితం పొందవచ్చని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యం చాటుకోవాలన్నారు. డీసీసీబీ చైర్మన్ ఎం జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సురేష్‌కుమార్, గురుకుల పాఠశాలల కన్వీనర్ సుదర్శన్, పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, గ్రామ సర్పంచ్ అనసూజమ్మ, విద్యార్థులు, ఉపాధ్యాయులు నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి: గీతారెడ్డి
Published Sun, Oct 6 2013 2:57 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
Advertisement
Advertisement