వాషింగ్టన్: చిన్నారులను లైంగికంగా వేధించిన కేసులో కాలిఫోర్నియా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రాధమిక పాఠశాలలో ఏడుగురు చిన్నారి బాలికలను లైంగిక వేధింపులకు గురిచేసిన కోచ్ రోనీ లీ రోమన్‌కు (44) కు ఏకంగా 105 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
జిన్హువా వార్తా సంస్థ అందించిన సమాచారం ప్రకారం లాస్ఏంజిల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టు మంగళవారం ఈ తీర్పు వెలువరించింది. రోమన్‌పై మైనర్ బాలికలను వేధించిన ఘటనలకు సంబంధించి మొత్తం 7కేసుల్లో కోర్టు దోషిగా నిర్ధారించింది. పాఠశాల ఆవరణలో ఆరుగురికిపైనా, ఏడవది బాధిత బాలిక ఇంట్లో జరిగిందని విచారణలో తేలింది. 8నుంచి 11సంవత్సరాల వయసున్న బాలికలపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
జిల్లా అటార్నీ కార్యాలయం ప్రకారం కొలరావులోని కాహువేన్ ఎలిమెంటరీ స్కూల్‌లో, హాలీవుడ్లోని వైన్ ఎలిమెంటరీ పాఠశాలల్లో పనిచేసిన కాలంలో రోమన్ ఈ దారుణాలకు పాల్పడ్డాడు. ఈ ఏడాది జూన్ 7న ప్రాసిక్యూషన్ అతణ్ని దోషిగా నిర్ధారించడంతోకోర్టు కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.