సీఎం కప్పు..చేయించింది అప్పు..! | School Games Are Named As The CM Cup | Sakshi
Sakshi News home page

సీఎం కప్పు..చేయించింది అప్పు..!

Published Wed, Mar 6 2019 5:10 PM | Last Updated on Wed, Mar 6 2019 5:10 PM

School Games Are Named As The CM Cup - Sakshi

సాక్షి, రాయవరం (మండపేట): స్కూల్‌ గేమ్స్‌ను సీఎం కప్‌గా నామకరణం చేసి క్రీడా పోటీలు నిర్వహించారు. పేరు మారినా..తీరు మారలేదు. నిధులు మంజూరు చేస్తాం..క్రీడలు ఆడించండంటూ అధికారులు చెప్పడంతో పాఠశాలల్లో పనిచేసే పీఈటీలు, ఫిజికల్‌ డైరెక్టర్లు (పీడీ) జేబులో డబ్బులు తీసి ఖర్చు పెట్టారు. స్కూల్‌ గేమ్స్‌ను పూర్తి చేసి నెలలు గడుస్తున్నా..నేటికీ పైసా విడుదల కాకపోవడంతో అప్పులు చేసి తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టాల్సి వస్తోందని తలలు పట్టుకుంటున్నారు.

డిసెంబరుతో ముగిసిన పోటీలు...
విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం సీఎం కప్‌ పేరుతో క్రీడా పోటీలను నిర్వహించింది. సెప్టెంబరు 24వ తేదీ నుంచి జిల్లాలో ఎస్‌జీఎఫ్‌ పోటీలు ప్రారంభించారు. తొలుత మండల స్థాయి, అనంతరం నియోజకవర్గ స్థాయి, తదనంతరం జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించారు. జిల్లా స్థాయి పోటీలు నవంబరులో జరిగాయి. జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి, రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని జాతీయ స్థాయిలో ఆడించారు. జాతీయ స్థాయి పోటీలు డిసెంబర్‌లో ముగిశాయి.

బాలురు, బాలికలకు వేర్వేరుగా
సీఎం కప్‌ క్రీడా పోటీలు అండర్‌–14, అండర్‌–17 విభాగాల్లో  మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలను నిర్వహించారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి అండర్‌–14, అండర్‌–17 పోటీలు నిర్వహించారు. ఇంటర్‌ విద్యార్థులకు అండర్‌–19 పోటీలు నిర్వహించారు.

ఆడించే ఆటలివే
మండల స్థాయిలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, హ్యాండ్‌బాల్, త్రోబాల్, బాల్‌బాడ్మింటన్, టెన్నికాయిట్, అథ్లెటిక్స్, యోగా పోటీలను నిర్వహించగా, జిల్లా స్థాయిలో ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్, సాఫ్ట్‌బాల్, బేస్‌బాల్, బాస్కెట్‌బాల్, నెట్‌బాల్, టేబుల్‌ టెన్నిస్, లాన్‌ టెన్నిస్, షటిల్‌ బ్యాడ్మింటన్, బాక్సింగ్, కత్తి సాము, వెయిట్‌ లిఫ్టింగ్, స్విమ్మింగ్‌ తదితర 41 క్రీడలను ఆడించారు.

తలకు మించిన భారంగా
మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలు పూర్తయి ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా విడుదల  చేయలేదు. క్రీడల్లో పాల్గొనే ప్రతి విద్యార్థికీ టీఏ రూ.30, డీఏ రూ.30ల వంతున మంజూరు చేయాల్సి ఉంది. దీని ప్రకారం మండలానికి రూ.50 వేలు, నియోజకవర్గ స్థాయి పోటీలకు రూ.50 వేలు విడుదల  చేయాల్సి ఉంది. జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలకు ఒక్కో విద్యార్థికి టీఏ రూ.50, డీఏ రూ.50ల వంతున మంజూరు చేయాల్సి ఉంది.

మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి పోటీల నిమిత్తం జిల్లాకు రూ.40.5 లక్షలు, జిల్లా స్థాయి పోటీలకు రూ.2 లక్షలు విడుదల కావాల్సి ఉంది. జిల్లాలోని జి.మామిడాడలో వెయిట్‌లిఫ్టింగ్, కాకినాడలో జిమ్నాస్టిక్స్, అనపర్తిలో రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీల నిర్వహణ, జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థులను సన్నద్ధం చేయడం, వారిని జాతీయ స్థాయి పోటీలకు గౌహతి, అగర్తల, జామ్‌నగర్‌కు పంపించారు. కోసం దాదాపు రూ.15 లక్షలు మంజూరు కావాల్సి ఉంది. ఈ విధంగా జిల్లాకు రూ.60 లక్షలు విడుదల కావాల్సి ఉండగా, నేటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.

ఇచ్చేదే అరకొర...
క్రీడా పోటీల నిర్వహణకు ప్రభుత్వం కంటితుడుపు చర్యగా, అరకొరగా నిధులు కేటాయిస్తోంది. ఆ అరకొర నిధులు కూడా క్రీడాపోటీలు ముగిసి మూడు నెలలవుతున్నా నేటికీ ఒక్క రూ పాయి విడుదల కాలేదు. చాలా మంది పీఈటీలు, పీడీలు వడ్డీ కి అప్పులు తీసుకుని వచ్చి, పెట్టుబడి పెట్టారు. ఓ వైపు తెచ్చి న డబ్బులకు రోజు రోజుకూ వడ్డీలు పెరుగుతుంటే, వీరికి తలకు మించిన భారంగా మారుతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్‌జీఎఫ్‌ నిధులు విడుదల చేయాలని పీఈటీలు, పీడీలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇలా అయితే మెరుగైన క్రీడాకారులను ఎలా తయారు చేయగలమని పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిధులు విడుదల కాకపోవడం వాస్తవమే...
సీఎం కప్‌ క్రీడా పోటీలకు ఇప్పటి వరకు నిధులు విడుదల కాని విషయం వాస్తవమే. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పోటీలు పూర్తి చేసినా డబ్బులు విడుదల కాలేదు. పెట్టుబడి పెట్టిన డబ్బులకు వడ్డీలు పెరగడంతో పీఈటీలు, పీడీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
– రాజశేఖర్, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు, పీఈటీ, పీడీ అసోసియేషన్, కాకినాడ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement