అధీనంలో ఉంచుకున్న స్థలంలో స్కేటింగ్ రింక్
ఒంగోలు టౌన్: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను ఎంచక్కా అనుసరిస్తున్నారు అధికార పార్టీ నేతలు. జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలో కోట్లాది రూపాయల విలువైన స్థలంపై కన్నేసిన టీడీపీ నాయకుడు అధికారం ఉండగానే దానిని సొంతం చేసుకోవాలకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా దానికొక క్రీడా శిక్షణ పేరు పెట్టారు. క్రీడల కోసం ఆ స్థలాన్ని కేటాయించాలంటూ నగర పాలక సంస్థకు ‘అధికార’పార్టీ హోదాలో దరఖాస్తు చేసుకున్నాడు. దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ రాకమునుపే ఏకంగా ‘క్రీడా’క్రమణకు పాల్పడ్డాడు.
నగరంలో విలువైన స్థలాన్ని క్రీడా శిక్షణ పేరుతో తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. మునిసిపల్ స్థలం చుట్టూ సరిహద్దులు ఏర్పాటు చేశాడు. మట్టిని తరలించి చదును చేసుకొనే పనిలో నిమగ్నమయ్యాడు. నగరపాలక సంస్థ నుంచి అనుమతి రాకపోయినప్పటికీ అధికార పార్టీ అండతో ఆ స్థలంలో తాను అనుకున్న క్రీడా శిక్షణకు తుదిరూపు ఇచ్చాడు. ఇక్కడ శిక్షణ ఇస్తామంటూ ఏకంగా బోర్డు కూడా పెట్టేసుకున్నాడు. దానిని నియంత్రించాల్సిన నగర పాలక సంస్థ అధికారులు ‘జీ హుజూర్’ అన్నట్టు వ్యవహరిçస్తుండటంతో ఆ క్రీడా శిక్షకుడు హద్దులు గీసుకొని కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని తన ఆధీనంలోకి తెచ్చేసుకున్నాడు.
ఆచ్చి బూచ్చి
ఒంగోలు నగరంలోని ఒక వ్యక్తికి ఆచ్చి అనేది నిక్ నేమ్. తన పేరుకు ముందు ఆ పేరుతో పిలిపించుకుంటాడు. షటిల్ ఆటలో తన ప్రావీణ్యాన్ని శిక్షణ రూపంలోకి తీసుకువచ్చి ఆదాయ మార్గంగా మలుచుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ క్రీడా శిక్షకుడు ఎంచుకున్న స్థలాలే వివాదాస్పదం అవుతున్నాయి. కలెక్టరేట్‌లో టెన్నిస్ కోర్టు ఉంది. ఆ టెన్నిస్ కోర్టుకు సంబంధించిన స్థలాన్ని ఆచ్చి పరం చేసేశారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయాలు ఉండే కలెక్టరేట్ ఆవరణలోని స్థలాన్నే అధికార పార్టీని అడ్డం పెట్టుకొని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు. దీనిని మరువకముందే మరో మునిసిపల్ స్థలంపై ఆ శిక్షకుడి కన్ను పడింది. ఒంగోలు నగర నడిబొడ్డున ఊరచెరువులో ఖాళీగా ఉన్న కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని తన అధీనంలోకి తెచ్చుకునేందుకు క్రీడా శిక్షణను తెరపైకి తీసుకువచ్చాడు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి సిఫార్సుతో తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఊర చెరువులోని షాదీఖానాకు వెనుకవైపు ఉన్న నగర పాలక సంస్థ అధీనంలోని స్థలానికి సరిహద్దులు వేసుకొన్నాడు. స్కేటింగ్
- రింక్ పేరుతో బోర్డు ఏర్పాటు చేసి ఆ స్థలాన్ని అనధికారికంగా తన చేతుల్లోకి తెచ్చుకున్నాడు.
- పేదలకో న్యాయం పెద్దలకు మరో న్యాయం..
- ఒంగోలు నగరంలో పేదలు ఇళ్ల స్థలాలు లేక ఎక్కడైనా నగర పాలక సంస్థకు చెందిన స్థలంలో చిన్న గుడిసె వేసుకుంటే నగర పాలక యంత్రాంగం పోలీసు బలగంతో అక్కడకు చేరుకొని దానిని తొలగించే వరకు అక్కడ నుంచి కదిలేదుకాదు. కోట్ల విలువైన స్థలాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని మాత్రం పల్లెత్తు మాట అనే సాహసం నగర పాలక సంస్థ అధికారులు చేయడం లేదు. అందుకు కారణం సదరు వ్యక్తికి అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఆశీస్సులు ఉండటమే.
- పరిశీలనలో ఉంది: కార్పొరేషన్ కమిషనర్
- ఒంగోలు నగరంలోని ఊరచెరువు స్థలంలో క్రీడాశిక్షణకు సంబంధించి అసోసియేషన్ తరపున స్థలం కేటాయించమని తన కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారని కమిషనర్ వెంకటకృష్ణ చెప్పారు. ఆ స్థలాన్ని ఎవరికీ కేటాయించలేదని, పరిశీలనలోనే ఉందన్నారు. ఈ విషయమై విచారించిన తరువాత అనుమతి ఇచ్చేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి అయిన జిల్లా కలెక్టర్‌కు నోట్ ఫైల్ పెడతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment