గెలుపోటములు సాధారణం | School Games Federation of India | Sakshi
Sakshi News home page

గెలుపోటములు సాధారణం

Published Sat, Sep 21 2013 3:09 AM | Last Updated on Sat, Sep 15 2018 5:21 PM

School Games Federation of India

భూపాలపల్లి, న్యూస్‌లైన్ :  క్రీడల్లో గెలుపోటములు సాధారణమని, ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహపడకుండా మరోసారి గెలుపునకు కృషిచేయాలని ప్రభుత్వ చీఫ్‌విప్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి అన్నారు. భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో పరకాల జోన్ పాఠశాలల క్రీడోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.

భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ అధ్యక్షతన జరిగిన ఈ క్రీడోత్సవాలకు ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్యఅతిథిగా, పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్ గండ్ర మాట్లాడుతూ పరకాల ప్రాంతంలో అనేక మంది జాతీయస్థాయి క్రీడాకారులు ఉన్నారన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పన కు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది స్పోర్ట్స్ బడ్జెట్‌ను రూ. 200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

అనంతరం పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి మాట్లాడుతూ క్రీడలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని నిధులు కేటాయించలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన అనంతరం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. అనంతరం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులు, పీఈటీలుగా ఎంపికైన వారిని ఘనంగా సన్మానించారు. ఈ క్రీడల్లో పరకాల జోన్‌లోని భూపాలపల్లి, రేగొండ, శాయంపేట, చిట్యాల, మొగుళ్లపల్లి, పరకాల మండలాలకు చెందిన సుమారు 700 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

అండర్-14, 17 బాల, బాలికల విభాగాల్లో జరుగనున్న కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. కార్యక్రమంలో డీఎస్పీసంజీవరావు, డిప్యుటీ డీఈఓ క్రిష్ణమూర్తి, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చెర్మైన్ యార మల్లారెడ్డి, భూపాలపల్లి నగర పంచాయతీ కమిషనర్ నోముల రవీందర్‌యాదవ్, ఎంఈఓ సాల్మన్, తహసీల్దార్ రాజమహేందర్‌రెడ్డి, ఎంపీడీఓ బ్రహ్మచారి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.విజయ్‌కుమార్, ప్రైవేటు కళాశాలల సంఘం మండలాధ్యక్షుడు బిల్ల రాజిరెడ్డి, భూపాలపల్లి క్రీడా కమిటీ నాయకులు జోగుల సమ్మయ్య, కె.రాజయ్య, సెగ్గెం సిద్ధు, సంజీవరావు, చిట్యాల, గణపురం ఎంఈఓలు జి.సారంగపాణి, కె.సురేందర్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement