శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రతిభావంతులకే జిల్లా జట్లలో స్థానం కల్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షులు డి.దేవానందరెడ్డి కోరారు. జిల్లా పాఠశాలల క్రీడల సమాఖ్య(స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియంలో మూడు రోజులపాటు జరగనున్న ప్రతిష్టాత్మక జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్ ఎంపిక పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఎంపికలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. జిల్లా జట్లకు ఎంపికయ్యే క్రీడాకారులకు రాష్ట్ర పోటీలకు వెళ్లేముందు శిక్షణా శిబిరాలను నిర్వహించేందుకు కలెక్టర్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు చెప్పారు. త్వరలో కామన్ ఎగ్జామినేషన్ ఫీజు కింద హైస్కూల్ విద్యార్థుల నుంచి వసూలు చేసే (రూ.80, రూ.100) మొత్తంలో 3 రూపాయలను క్రీడలకు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం డివిజన్ డిప్యూటీ ఈఓ వి.సుబ్బారావు, ఆర్‌ఎంఎస్‌ఏ డిప్యూటీ ఈఓ ఎ.ప్రభాకరరావు మాట్లాడుతూ పాఠశాలల క్రీడలు విద్యార్థి జీవితంలో చాలా కీలకమని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్ మాట్లాడుతూ స్కూల్‌గేమ్స్ ఎంపిక పోటీలకు హాజరయ్యే విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచైనా భోజనాలు కల్పించాలన్నారు.
కార్యక్రమంలో క్రీడల సమాఖ్య కార్యనిర్వహణ కార్యదర్శి ఎమ్మెస్సీ శేఖర్, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందరరావు, పీఈటీ సంఘ సలహాదారు కె.రాజారావు, జిల్లా పీఈటీ సంఘం అధ్యక్షులు ఎం.వి.రమణ, కార్యదర్శి ఎం.సాంబమూర్తి, పాఠశాల క్రీడల సంఘం సంయుక్తకార్యదర్శి ఎస్.శ్రీనివాసరావు, సంపతిరావు సూరిబాబు, పోలినాయుడు, కామయ్య, తవిటయ్య, ఆర్సీ రెడ్డి జగదీష్, వాసు, రాజశేఖర్, వెంకటరమణ, రవి, సుజాత, మాధురి, ఉష, విజయ, పీడీలు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా..
జిల్లాస్థాయి పాఠశాలల క్రీడల సమాఖ్య ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా నలుమూలల నుంచి రికార్డుస్థాయిలో 3వేల మంది వరకు క్రీడాకారులు హాజరయ్యారు. కోడిరామ్మూర్తి స్టేడియంతోపాటు.. హాకీ, ఫుట్‌బాల్ ఎంపికలను సమీపంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించారు. రంగురంగుల దుస్తుల ధరించి హాజరైన బాలబాలికలతో క్రీడాప్రాంగణం కళకళలాడింది. అయితే మండే ఎండతో క్రీడాకారులు ఇక్కట్లకు గురయ్యారు. అయితే సాయంత్రం వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటంతో క్రీడాకారులు రెట్టించిన ఉత్సాహంతో ఎంపికల్లో పాల్గొన్నారు. అంతకుముందు డీఈఓ దేవానందరెడ్డి వాలీబాల్ ఆడి ఎంపికలను ప్రారంభించారు.
తొలిరోజు ఇలా..
వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, ఆర్చరీ క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహించారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాంశాలకు క్రీడాకారులు పోటెత్తారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, క్రికెట్ క్రీడాంశాల్లో ప్రాథమికంగా ఎంపికలు జరిపారు. మిగిలిన తుది ఎంపికలను బుధవారం నిర్వహించనున్నారు. మూడు రోజుల ఎంపికలన్నీ ముగిసిన తర్వాత జిల్లా జట్లకు ఎంపికైన క్రీడాకారులు జాబితాలను ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. భోజన ఏర్పాట్ల లేమితో బాలబాలికలకు అవస్థలు పడ్డారు. దీనిపై సమాచారం లేకపోవడంతో అగచాట్లు పడ్డారు.
నేడు జరగనున్న ఎంపికలు ఇవే..
అండర్–14, 17 వయస్సుల్లో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్ తుది ఎంపికలతోపాటు బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, సాఫ్ట్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్, తైక్వాండో, స్విమ్మింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, చెస్, లాన్‌టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బాల్ బ్యాడ్మింటన్, కరాటే, యోగ ఎంపికలను నిర్వహించనున్నారు.