ఎంత.. ఏమిటి .. ఎలా?
నగరం,(మామిడికుదురు) :గ్యాస్ పైపులైన్ విస్ఫోటం ఘటనపై రాష్ట్ర హైకోర్టు సూచనల మేరకు రాజోలు సీనియర్ సివిల్ జడ్జి పి.రాజేంద్రప్రసాద్ మంగళవారం విచారణ నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాధితులు, గ్రామస్తులు, గెయిల్, రెవెన్యూ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. పేలుడు వల్ల ఎంత మేర నష్టం జరిగింది, ఎంత మంది చనిపోయారు, ఎంత మంది గాయపడ్డారు, వారి ప్రస్తుత పరిస్థితి, పంట నష్టమెంత? గృహాలకు, పశువులకు జరిగిన నష్టం ఎంత? గెయిల్ అధికారులు అందించిన పరిహారంపై బాధితుల స్పందన ఎలా ఉంది? బాధితులకు పరిహారం అందించడంలో సమస్యలున్నాయా? రిలే నిరాహార దీక్షలు ఎందుకు చేస్తున్నారు? వారి డిమాండ్లు ఏంటి? తదితర అంశాలపై జడ్జి రాజేంద్రప్రసాద్ వివరాలు నమోదు చేసుకున్నారు. బుధవారం సాయంత్రానికి కల్లా నివేదిక ఇవ్వాల్సి ఉందని ఆయన వెల్లడించారు.
న్యాయం జరగలేదని...
కొబ్బరి చెట్లకు పరిహారం అందించే విషయంలో తమకు న్యాయం జరగడం లేదని వానరాశి శంకర్రావు, రాయుడు జనార్దన్, అక్రమ్ అలీ ఫిర్యాదు చేశారు. కొబ్బరి చెట్లు చనిపోవడం వల్ల పదేళ్ల పాటు తమకు నెలనెలా వచ్చే ఆదాయాన్ని కోల్పోవలసి వస్తోందన్నారు. క్షతగాత్రులకు ఇచ్చే మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. దీనిపై గెయిల్ అధికారులు మాట్లాడుతూ జిల్లా అధికారుల సూచన మేరకు పరిహారం చెల్లిస్తున్నామన్నారు. బాధితుల డిమాండ్లను పరిశీలిస్తామని చెప్పారు. పేలుడు వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లింపులో అన్యాయం జరిగితే చైర్మన్, మండల లీగల్ సర్వీసు కమిటీ, రాజోలు పేరిట తమకు దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా న్యాయ సహాయం చేస్తామని జడ్జి రాజేంద్రప్రసాద్ వివరించారు. అనంతరం పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. స్థానిక సర్పంచ్ మొల్లేటి కొండాలమ్మ, గెయిల్ డీజీఎం అనూప్ గుప్తా, చీప్ మేనేజర్లు పీఎన్ రావు, పి.మోహన్‌కొండయ్య, రాజారావు, ఏజీపీ మైఖేల్, ఏపీపీ సుధాకర్, అడ్వకేట్ వి.లక్ష్మీపతి, ఎం.అక్కిరాజు పాల్గొన్నారు.