అధికారుల నిర్లక్ష్యంతోనే పేలుడు
నగరం(మామిడికుదురు) :గ్యాస్ లీకేజికి నీటి పైపులైన్ తరహాలో సిమెంట్ పూస్తే ఆగుతుందా అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ ప్రశ్నించారు. ‘అధికారుల నిర్లక్ష్యం వల్లే గ్యాస్ పైపులైన్ పేలిపోయింది. ఈ పేలుడు ఘటనకు ముమ్మాటికీ అధికారుల అసమర్థతే కారణం. దీనిపై పార్టీ తరఫున ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తాం’ అని పేర్కొన్నారు. మంగళవారం ఆయన పైపులైన్ పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కాలిపోయిన గృహాలను, కొబ్బరి చెట్లను పరిశీలించి, మృతుల కుటుంబాలను పరామర్శించారు. గెయిల్ అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించగా, అక్కడెవరూ అందుబాటులో లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
గ్యాస్ లీకేజిపై స్థానికులు ఎంతగా మొత్తుకున్నా పట్టించుకోలేదంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అవగతమవుతోందన్నారు. హై పవర్ కమిటీ విచారణ వల్ల ప్రయోజనం లేదని, సీబీఐతో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఓఎన్‌జీసీ, గెయిల్ కార్యాలయాలను జనావాసాలకు దూరంగా సముద్ర తీరానికి తరలించాలని డిమాండ్ చేశారు. నిప్పుల కుంపటిపై బతుకీడుస్తున్నట్టుగా కోనసీమ ప్రజల పరిస్థితి తయారైందన్నారు. దీనిపై ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తామని పునరుద్ఘాటించారు. ఆయన వెంట రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్‌పీఐ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ రత్నాకర్, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, సీపీఐ నాయకులు మీసాల సత్యనారాయణ, మధు, పి.హరినాథరెడ్డి, కిర్ల కృష్ణారావు, దేవ రాజేంద్రప్రసాద్, చెల్లుబోయిన కేశవశెట్టి, పిచ్చుక గంగాధర్ ఉన్నారు.
‘విస్ఫోటం’పై సీబీఐ విచారణ జరపాలి
గ్యాస్ పైపులైన్ పేలుడు సంఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మంగళవారం నగరం గ్రామంలో రాస్తారోకో చేశారు. స్థానిక గ్యాస్ కలెక్టింగ్ స్టేషన్ (జీసీఎస్) ఎదురుగా 216 జాతీయ రహదారిపై పార్టీ నాయకులు బైఠాయించి గెయిల్, ఓఎన్‌జీసీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, ప్ర మాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు, క్షతగాత్రులకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేలు డు దుర్ఘటనపై సీబీఐ విచారణ జరపాలన్నారు. గెయిల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. అధికారుల సస్పెన్షన్‌తో ఆగిపోకుండా వెంటనే వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కిమ్స్‌లో క్షతగాత్రులకు పరామర్శ
అమలాపురం రూరల్ : గెయిల్ పైపులైన్ ఏర్పాటులో ప్రమాణాలు పాటించకపోవడం వల్లే నగరం ఘటన జరిగిందని సీపీఐ నేత నారాయణ ఆరోపించారు. నగరం ఘటనలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై కిమ్స్ వైద్యులను ఆరా తీశారు.