ఆమె ఏమైంది!
మామిడికుదురు :తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పామాపురానికి చెందిన అంతటి శిరీష(25) అదృశ్యంపై ఆమె అన్నయ్య ధనుంజయ్‌గౌడ్ నగరం పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. ఆమెను ప్రేమ వివాహం చేసుకున్న మామిడికుదురు మండలం పాశర్లపూడికి చెందిన గెడ్డం జగదీష్.. భార్యను హతమార్చి, మృతదేహాన్ని తోటలో ఖననం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మూడు నెలల నుంచి తన చెల్లెలు కనిపించడం లేదని, దీనిపై ఆరా తీయగా.. జగదీష్ ఆమెను హతమార్చి తన సొంత పొలంలోనే మృతదేహాన్ని ఖననం చేసినట్లు నిర్ధారణ అయిందన్నాడు. దీనిపై విచారణ జరిపి, న్యాయం చేయాలని కోరాడు.
ఈ సంఘటనపై ధనుంజయ్‌గౌడ్ ఇక్కడి విలేకరులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శిరీష బీఏ చదివింది. చిన్నతనంలోనే తల్లి పుష్ప చనిపోవడంతో అమ్మమ్మ చంద్రమ్మ ఆమెను పోషించింది. శిరీషకు, జగదీష్‌తో ఏర్పడిన పరిచయం వారి పెళ్లికి దారితీసింది. 2012 డిసెంబర్ 9న రాజోలులో వీరు వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 4న వారికి బాబు పుట్టాడు. ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిందన్న కోపంతో శిరీష కుటుంబ సభ్యులు వారి గురించి పట్టించుకోలేదు. తర్వాత ఫోన్‌లో ఆమె తన పుట్టింటి వారితో మాట్లాడేది. ఒకసారి పుట్టింటికి వెళ్లింది. మూడు నెలల నుంచి ఆమె ఫోన్ రాకపోవడంతో అనుమానం వచ్చిన ధనుంజయ్‌గౌడ్ ఇక్కడకు వచ్చి ఆరా తీశాడు.
స్థానికులు చెప్పిన సమాచారంతో అతడికి కొన్ని వివరాలు తెలిశాయి. మంగళవారం అతడు జగదీష్ ఇంటికి వె ళ్లి ఆరాతీయగా, జగదీష్ రాశాడంటూ అతడి తల్లి ఓ లెటర్ చూపించింది. కడుపులో కణితి వల్ల నొప్పి భరించలేక శిరీష ఉరివేసుకుందని, మృతదేహాన్ని రాజోలు నుంచి పాశర్లపూడికి తీసుకొచ్చి ఖననం చేసినట్టు, కుమారుడితో తాను ముంబై వెళ్లిపోతున్నట్టు లేఖలో రాసి ఉంది. కాగా శిరీషను హతమార్చి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకే జగదీష్ ఈ లేఖ రాశాడని ధనుంజయ్‌గౌడ్ ఆరోపించాడు. దీనిపై విచారణ జరిపించి, జగదీష్‌పై చర్యలు తీసుకోవాలని అతడు ఫిర్యాదులో కోరాడు. దీనిపై నగరం ఎస్సై బి.సంపత్‌కుమార్‌ను వివరణ కోరగా, ఇంకా తమకు ఫిర్యాదు అందలేదన్నారు.