భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి వరద ప్రవాహం
సాక్షి, ఖమ్మం(చర్ల) : వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరికి వరద ఉధృతి కూడా తగ్గింది. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురవడంతో గోదావరికి వరదలు వచ్చాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో గోదావరికి ఎగువన ఉన్న తాలిపేరు, గుండ్లవాగు, పాలెంవాగు, చీకుపల్లివాగు, గుబ్బలమంగి తదితర వాగుల నుంచి వరదనీరు గోదావరిలో చేరడంతో నది ఉగ్రరూపం దాల్చింది. చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్ నుంచి కూడా మూడు రోజుల పాటు వరదనీటిని గోదావరిలోకి విడుదల చేశారు. గురువారం 1.53 లక్షలు, శుక్రవారం 1.93 లక్షలు.
శనివారం 1.15 లక్షల క్యూసెక్కుల చొప్పున దిగువకు విడుదల చేయగా.. ఆ నీరంతా గోదావరిలోకే చేరింది. దీంతో నది ఉధృతి మరింతగా పెరిగింది. శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆ తర్వాత కూడా భారీగా పెరుగుతూ వచ్చింది. రాత్రి 10 గంటలకు 46.60 అడుగులకు చేరుకుంది. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే అప్పటి నుంచే క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు 42.05 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించారు.
అధికారుల అప్రమత్తం...
గోదావరికి శనివారం భారీగా వరద రావడంతో కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ భద్రాచలం చేరుకుని అధికారులతో సమీక్షించారు. గోదావరి తీర ప్రాంతంలో పర్యటించి వరద ఉధృతిని పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. దీంతో సబ్ కలెక్టర్ భవేష్‌మిశ్రా, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వీపీ గౌతమ్ చర్ల, దుమ్ముగూడెం మండలాల సెక్టోరియల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలను అప్రమత్తం చేశారు. కాగా శనివారం రాత్రి నుంచి గోదావరికి వరద ఉధృతి తగ్గుతుండడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం వరకు చర్ల మండలం దండుపేట –కొత్తపల్లి రోడ్డు, చర్ల – లింగాపురం మధ్యలో లింగాపురంపాడు వద్ద రోడ్డు వరద నీటితో మునిగిపోయింది. దీంతో ఏడు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి, కాగా ఆదివారం వరదనీరు తగ్గడంతో ఈ రోడ్లపై యథావిధిగా రాకపోకలు సాగించారు.
వరద ప్రవాహం ఇలా..
మూడు దశాబ్దాల కాలంలో భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 8 సార్లు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి (43 అడుగులు), ఐదు సార్లు రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి (48 అడుగులు), తొమ్మిది సార్లు మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి(53 అడుగులు) దాటింది. 1979, 1980, 1992, 1995, 2002, 2011, 2012, 2019 (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరాలలో మొదటి ప్రమాద హెచ్చరికను దాటగా, 1981, 2001, 2007, 2008, 2016, సంవత్సరాలో రెండో ప్రమాద హెచ్చరిక దాటింది. ఇక 1983, 1986, 1988, 1990, 2000, 2005, 2006, 2010, 2013 సంవత్సరాలలో మూడో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ఉగ్రరూపం ప్రదర్శించింది.
సూపర్‌బజార్(కొత్తగూడెం): భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం ఆదివారం సాయంత్రం 5 గంటలకు 42.80 అడుగులకు చేరుకున్నందున మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించినట్లు కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఒక ప్రకటనలో తెలిపారు. వరద ఉధృతి వలన గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్లు, పశువులు, ప్రభుత్వ ఆస్తులు తదితర వివరాల నివేదికలు అందజేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ముందుజాగ్రత్త చర్యగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీడీఓలకు సూచించారు.
ప్రజల ప్రయాణాలకు వీలుగా, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా రహదారులను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు అధికారులు కార్యస్థానం విడిచి వెళ్లవద్దని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలించిన ఫొటోలు ఎప్పటికప్పుడు వాట్సప్ ద్వారా తీసుకుంటూ వారికి తగిన సలహాలు, సూచనలు అందజేశామని పేర్కొన్నారు. భద్రాచలం పట్టణంలోకి వరదనీరు ప్రవేశించకుండా విస్తా కాంప్లెక్స్ వద్ద విద్యుత్ మోటార్లు ఏర్పాటుచేసి నీటిని తొలగిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment