ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ప్రధాన రహదారిపై వెంకటాపురం–వాజేడు ఏరియా కమిటీ పేరుతో బ్యానర్
సాక్షి, కొత్తగూడెం: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్య ప్రాంతం నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాల్లోని ప్రధాన పట్టణాల వరకు కార్యకలాపాలు విస్తరించేందుకు మావోయిస్టులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. గత ఏడాది కాలంగా తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎడతెగని పోరు నడుస్తోంది. భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టులు పేల్చిన మందుపాతరల కారణంగా పలువురు భద్రతా బలగాల సిబ్బంది మరణించారు. కొందరు ప్రజాప్రతినిధులను, కాంట్రాక్టర్లను మావోలు హత్య చేశారు. ఈ క్రమంలో గత డిసెంబర్‌లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలు జరిగాయి.
ఆ ఎన్నికల సందర్భంగా మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల పరిధిలోనూ అనేక విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడ్డారు. సరిహద్దుకు అవతల వైపు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్, కాంకేర్ జిల్లాల్లో నిరంతరం పోలీసులు మావోయలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. దండకారణ్యం దద్దరిల్లుతోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి తెలంగాణలోని భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్, కాంకేర్, ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఒడిశాలోని మల్కనగిరి, కోరాపుట్), ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాల వరకు మావోలు విధ్వంస కార్యకలాపాలకు మావోలు పాల్పడుతున్నారు. మూడు నెలల క్రితం విశాఖపట్టణం జిల్లా అరకు సమీపంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు హత్య చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఐదు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో ముందుకు వెళుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మావోయిస్టులు తమ కార్యకలాపాలను మరింత ఉధృతం చేసేందుకు, సరిహద్దు అటవీ ప్రాంతాలు, ఏజెన్సీ నుంచి దాటి వివిధ జిల్లాల్లోని మైదాన ప్రాంతాలకు చొచ్చుకుని వచ్చేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
పట్టణ ప్రాంతాల్లోనూ బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాలు...
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందు నుంచే మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించాలంటూ తమ కార్యకలాపాలను మరింత ముమ్మరం చేస్తున్నారు. ఈ నెల మొదటి వారం నుంచి మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఆంధ్రా–ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో వరుసగా ప్రకటనలు వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ మండలాల్లో పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లను మంగళవారం వదిలారు.
- బూర్గంపాడు మండలంలోని పారిశ్రామిక పట్టణమైన సారపాకలోని గాంధీనగర్, సినిమాహాల్ సెంటర్‌లోని బల్లలపై పోస్టర్లు వదిలారు.
- ములకలపల్లి మండలంలోని సీతారాంపురంలో కరపత్రాలు, పోస్టర్లు కనిపించాయి.
- పాల్వంచ మండలంలోని జగన్నాధపురం, కేశవాపురం గ్రామాల వద్ద పోస్టర్లు వేశారు.
- చర్ల మండలంలోని ఆంజనేయపురం, ఆర్.కొత్తగూడెం, లక్ష్మి కాలనీ గ్రామాల్లో కరపత్రాలు వేశారు.
- ములుగు జిల్లాలోని భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని వెంకటాపురం–వాజేడు ప్రధాన రహదారిపై మావోయిస్టు పార్టీ వెంకటాపురం–వాజేడు ఏరియా కమిటీ పేరుతో బ్యానర్ వదిలారు.
- ఇప్పటివరకు ఈ ప్రాంతంలో చర్ల–శబరి ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టుల కార్యకలాపాలు సాగుతున్నాయి. కొత్తగా వెంకటాపురం–వాజేడు ఏరియా కమిటీ పేరుతో బ్యానర్ వేయడం గమనార్హం. మావోయిస్టులు కొరియర్ వ్యవస్థను పెంచుకుంటున్నట్టు సమాచారం.
- ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ నెల 19వ తేదీన సుదీర్ఘ లేఖ విడుదలైంది.
- ఆంధ్రా–ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి జగబంధు పేరుతో మరో లేఖ విడుదలైంది.
- దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి వికాస్ పేరుతో ఈ నెల మొదటి వారంలో ప్రకటన వెలువడింది.
- ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో ప్రకటన వెలువడింది.
- మావోయిస్టు పార్టీ పేరుతో మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని పద్మగూడెం, కమలాపురం గ్రామాల వద్ద పోస్టర్లు పడ్డాయి.
- ఆంధ్రా–ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో విడుదలైన ప్రకటనలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య ప్రస్తావన ఉంది.
ఎన్‌కౌంటర్
తాజాగా, మంగళవారం భద్రాచలం ఏజెన్సీ సరిహద్దులోని సుక్మా జిల్లా చింతల్‌నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. కొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు తమ కార్యకలాపాలను పెంచేందుకు ప్రయత్నిస్తుండడంతో పోలీసు యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు సరిహద్దు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమవుతూ సమన్వయంతో ముందుకు వెళుతున్నారు. దండకారణ్యంలో నిరంతరం కూంబింగ్ సాగిస్తున్నారు. నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment