ఏజెన్సీలో నిఘా.. | High Alert In Agency Areas In Khammam District | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో నిఘా..

Published Tue, Jun 18 2019 11:48 AM | Last Updated on Tue, Jun 18 2019 11:48 AM

High Alert In Agency Areas In Khammam District - Sakshi

వెంకటాపురం–వాజేడు ఏరియా కమిటీ పేరుతో మావోలు వేసిన కరపత్రం 

సాక్షి, కొత్తగూడెం: సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో యుద్ధవాతారణం నెలకొంది. పోడు భూముల అంశంపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ మావోయిస్టులు క్షేత్రస్థాయిలో ప్రచార పర్వానికి దిగారు. దీంతో ప్రతిగా పోలీసు బలగాలు గోదావరి  పరీవాహక ప్రాంత జిల్లాల్లో భారీగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని భద్రాచలం, పినపాక, ఇల్లెందు, ములుగు నియోజకవర్గాల్లో వేలాది మంది సాయుధ బలగాలతో జల్లెడ పడుతున్నారు.

పర్యావరణ పరిరక్షణ పేరుతో ఆదివాసీలు తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం  సాగిస్తున్నారని, ఆ భూముల నుంచి వారిని వెళ్లగొట్టేందుకు కోర్టులు, చట్టాల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని మావోయిస్టులు కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు గత మూడు రోజులుగా భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని పూజారిగూడెం, లెనిన్‌కాలనీ, గోగుబాక, ఆర్‌.కొత్తగూడెం, చింతగుప్ప, దుమ్ముగూడెం మండలం బండిరేవు, సీతానగరం ప్రాంతాల్లో చర్ల–శబరి ఏరియా కమిటీ పేరుతో 

ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో వెంకటాపురం–వాజేడు కమిటీ పేరుతో పోస్టర్లు, కరపత్రాలు వేశారు. ఆదివాసీలను అడవుల నుంచి పంపించేందుకు పాలకులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దీనికి తోడు కొన్ని రోజుల క్రితం  మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్‌ అలియాస్‌ యాప నారాయణ అలియాస్‌ లక్ష్మ ఆధ్వర్యంలో భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని సరిహద్దు అటవీ ప్రాంతంలో సమావేశమైనట్లు ఇంటెలిజెన్స్‌ భావిస్తోంది. ఉద్యమాల ద్వారానే తెలంగాణలో పునర్‌ వైభవం సాధించాలని ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం గిరిజనుల పోడు భూముల అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

40 మంది సభ్యుల ప్రచారం..! 
గత 20 రోజులుగా భద్రాద్రి జిల్లాలోని కరకగూడెం, పినపాక, మణుగూరు, గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో హరిభూషణ్, దామోదర్, లచ్చన్న, రీనా, రాజిరెడ్డి అలియాస్‌ వెంకన్న, భద్రు, మంగు, మంగ్లు ఆధ్వర్యంలో సుమారు 40 మంది మావోయిస్టులు పోడు భూముల అంశంపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు  పోలీసులకు సమాచారం అందజేశాయి. దీంతో ఈ మండలాల్లో ఎస్పీ సునీల్‌దత్‌ ఆధ్వర్యంలో సుమారు 3 వేల మంది సాయుధ బలగాలతో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు.

అణువణువూ జల్లెడ పడుతున్నారు. గత వారం రోజులుగా ఏజెన్సీ పరిధిలోని మారుమూల గ్రామాల్లో గ్రేహౌండ్స్, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు శోధిస్తున్నాయి. మరోవైపు ఆయా మారుమూల ప్రాంతాల్లో సైతం మావోయిస్టు నాయకుల ఫొటోలతో కూడిన పోస్టర్లు వేస్తున్నారు. వారి గురించి ఖచ్చితమైన సమాచారం ఇస్తే రూ.5 లక్షల నగదు బహుమతి ఇస్తామని పోలీసు శాఖ ప్రకటించింది. సమాచారం ఇచ్చినవారి వివరాలు రహస్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.

గత కొంతకాలంగా ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో కార్యకలాపాలు పెంచుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తుండగా, తాజాగా పోడు భూముల అంశంపై ఉద్యమాలు చేసేందుకు సిద్ధమవుతుండడంతో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. కూంబింగ్‌ ద్వారా భద్రతా బలగాలు ఏజెన్సీ జల్లెడ పడుతుండడంతో గిరిజన పల్లెల్లో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

కూంబింగ్‌కు వెళుతున్న బలగాలు 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement