చర్ల : మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు ఈసారి ఏజెన్సీ ఆదివాసీల్లో వణుకు పుట్టించాయి. తుపాకుల మోతలు ఓవైపు, బాంబు పేలుళ్ల శబ్దాలు మరోవైపు భయాందోళనలు కలిగించాయి. ఇక సరిహద్దు ప్రాంతాల్లోని ఆదివాసీలైతే ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే తీవ్రంగా భయపడ్డారు. ఇటీవల కాలంలో మావోయిస్టుల కార్యకలాపాలు ఉధృతం కావడం, మరో వైపు పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ పార్టీ సభ్యులు మృత్యువాత పడడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు వణికిపోయారు. ఈనెల 21 నుంచి 27 వరకు మావోయిస్టు పార్టీ 16వ ఆవిర్భావ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని చర్ల–శబరి ఏరియా కమిటీ, భదాద్రి కొత్తగూడెం – తూర్పుగోదావరి జిల్లా కమిటీలు, తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చాయి. అయితే వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టుల కోసం పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు.
వరుస ఘటనలతో బెంబేలు..
చర్ల మండలం చెన్నాపురం అడవుల్లో ఈనెల 23న రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అంతకు ముందు 19న చర్ల మండలం తేగడ – కలివేరు గ్రామాల మధ్య రాష్ట్రీయ రహదారి పక్కన మావో యిస్టులు ఏర్పాటు చేసిన 3 శక్తివంతమైన మందుపాతర్లను గుర్తించిన పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈనెల 6న పెదమిడిసిలేరు–తిప్పాపురం మార్గంలో గల ప్రధాన రహదారి పై మావోయిస్టులు మందుపాతరలు పేల్చారు. ఆ తెల్లవారి వద్దిపేట – పూసుగుప్ప అడవుల్లో ఎదురుకాల్పులు జరగగా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
ఇక ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల వివిధ గ్రామాలకు చెందిన పలువురు ఆదివాసీలను ఇన్‌ఫార్మర్లుగా భావిస్తూ మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ప్రజాకోర్టులు నిర్వహించి వారం రోజుల వ్యవధిలో 16 మందిని హతమార్చారు. ఇలా ఇటు మావోయిస్టులు, అటు పోలీసుల చర్యలతో ఆదివాసీ గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. మావోయిస్టు పార్టీ వారోత్సవాల నిర్వహణలో గతం కంటే ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉండడంతో ఆదివాసీ గ్రామాలతో పాటు మైదాన ప్రాంతాల్లోనూ సామాన్య ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా భయాందోళన చెందారు.
Comments
Please login to add a commentAdd a comment