బోధన్: భారీ వర్షాలతో గోదావరి, మంజీర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రెండు రోజులుగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కురిసిన వానలతో భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. బుధవారం కందకుర్తి వద్ద వంతెన పైనుం చి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతాల మధ్య రాకపోకలు, నిలిచిపోయాయి. గోదావరి నది ఒడ్డున ఉన్న సీతారామ ఆశ్రమం చుట్టూ వరద నీరు చేరింది. కందకుర్తి గోదావరి నదికి దిగువ ప్రాంతంలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వల్ల రెంజల్ మండలంలోని కందకుర్తి, నీలా, బోర్గాం, తాడ్‌బిలోలి గ్రామాల శివారులోని సుమారు 4 వేల ఎకరాలకుపైగా సోయా, ఇతర పంటలు నీటి మునిగాయని స్థానిక రైతులు అంటున్నారు.
పోటెత్తిన మంజీర..: మంజీర నదిలో వరదనీరు పోటెత్తి ప్రవహిస్తోంది. కౌలాస్‌నాలా, నిజాంసాగర్ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన వరద నీరు, వాగుల నుంచి చేరిన నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. సాలూర, తగ్గెల్లి, కల్దుర్కి, సిద్దాపూర్, ఖండ్‌గావ్ గ్రామాల శివారులోని వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. హంగర్గ చుట్టూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ చేరింది. సుమారు వెయ్యి ఎకరాల పంట వరద నీటిలో మునిగి ఉందని రైతులు తెలిపారు. ఆర్డీవో రాజేశ్వర్ గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
వరద ప్రమాద హెచ్చరిక జారీ
ఏటూరునాగారం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద బుధవారం గోదావరి నీటి మట్టం 8.54 మీటర్లకు చేరడంతో కేంద్ర జలవనరుల అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదిలో నీరు గంటకు పది పాయింట్లు పెరుగుతూ వస్తోంది. రెండో ప్రమాద హెచ్చరిక 9.54 మీటర్ల వద్ద జారీ చేస్తారు. మూడో ప్రమాద హెచ్చరిక డేంజర్ లెవల్ 11.04కు చేరితే లోతట్టు గ్రామాలను ఖాళీ చేయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment