
విజ్జేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదల చేస్తున్న వరద నీరు
సాక్షి, నిడదవోలు(పశ్చిమగోదావరి) : గోదావరి ఎగువన మహారాష్ట్ర, ఇంద్రావతి, శబరి ప్రాంతాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో మళ్ళీ గోదావరి పెరుగుతోంది. భద్రాచలం వద్ద సోమవారం 21 అడుగులు ఉండగా మంగళవారం రాత్రి 8 గంటలకు 25.10 అడుగులకు పెరిగింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రాత్రి 8 గంటల సమయంలో 10.10 అడుగుల నీటి మట్టం నమోదైంది. గోదావరి విజ్జేశ్వరం నుంచి ధవళేశ్వరం వరకు ఉన్న కాటన్ బ్యారేజీల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బ్యారేజీల 175 గేట్ల ద్వారా మంగళవారం 2,74,241 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి గోదావరిలోకి 5 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోలు చేరతాయని ధవళేశ్వరం హెడ్ వర్క్స్ ఈఈ మోహనరావు తెలిపారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు రైతుల సాగు నీటి అవసరాల కోసం జలవనరుల శాఖాధికారులు నీటి విడుదలను క్రమబద్ధీకరిస్తున్నారు. జిల్లాలో వర్షాలు కురవడంతో కాలువలకు నీటి విడుదలను తగ్గించారు. పశ్చిమ డెల్టాకు 6,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మధ్య డెల్టాకు 2,000 క్యూసెక్కులు, తూర్పు డెల్టాకు 3,800 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పశ్చిమ డెల్టా పరిధిలో ఏలూరు కాలువకు 1,124 క్యూసెక్కులు, తణుకు కాలువకు 632, నరసాపురం కాలువకు 1,704 ,అత్తిలి కాలువకు 5,99 క్యూసెక్కులు, ఉండి కాలువకు 1,809 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment