
నిడదవోలు: గోదావరి ఎగువన భారీ వర్షాలు కురువడంతో గోదావరి వరద ఉధృతి మళ్లీ పెరిగినట్లు విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు తీవ్రతను పర్యవేక్షిస్తున్నట్లు విపత్తుల శాఖ కమిషనర్ పేర్కొన్నారు. ప్రస్తుత ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 11 లక్షల క్యూసెక్కులు ఉన్నట్లు స్పష్టం చేశారు. దాంతో ముంపు ప్రాంత మండలాల అధికారులను, సహాయక బృందాలను అప్రమత్తం చేస్తున్నారు. ముంపు ప్రాంత ప్రజల సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని కమిషనర్ సూచించారు.
వినాయక నిమజ్జానికి నదకి వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వరల నీటీలో ఈతకు వెళ్లడం, స్నానాలకు వెళ్లడం లాంటివి చేయవద్దన్నారు. బోటు, మోటారు బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించవద్దన్నారు. నదీ పరివాహక ప్రాంత ప‍్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. వరద ఉధృతి క్రమేపి పెరుగుతున్న నేపథ్యంలో రేపు దవళేశ్వరం వద్ద రేపు ఉదయానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.