సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం ఏటిగట్టు వద్ద పడవలపై ప్రజల రాకపోకలు
ఒకటి కాదు.. రెండు కాదు తొమ్మిది రోజులుగా మహోగ్రరూపమెత్తిన గోదావరి క్రమంగా శాంతిస్తోంది. ఇటు గోదావరి, అటు శబరి పోటెత్తడంతో విలవిలలాడిన ఏజెన్సీ వాసులు నెమ్మదిగా తేరుకుంటున్నారు. వరద ఉధృతి తగ్గుతున్నా కోనసీమ లంకలను ఇంకా ముంపు వీడలేదు. దీంతో ఇక్కడి ప్రజలు ఇంకా ఆందోళనలోనే ఉన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఆదివారం రాత్రి ఏడు గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 10.80 అడుగులకు తగ్గింది.
సాక్షి, తూర్పుగోదావరి : ఈ నెల 2న మొదలైన గోదావరి వరద ఉధృతికి ఏజెన్సీ, కోనసీమ లంకల్లోని వందల ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. వరద నీటిలో రోజుల తరబడి ఉండడంతో పలుచోట్ల ఇళ్లు నానిపోయి కుప్పకూలిపోతున్నాయి. ప్రభుత్వం పక్కాగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం, యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టడంతో బాధితులకు సాంత్వన చేకూరింది. ఆర్థిక సహాయం ప్రకటించడంతో సామాన్యులు, నిరుపేదలు, మత్స్యకారులకు, రైతులకు ఊరట కలిగింది. అయినప్పటికీ రోజుల తరబడి ముంపులో ఉండడంతో ఏజెన్సీ, లంక వాసుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. సోమవారం సాయంత్రం తరువాత కానీ ఇక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపించడం లేదు.
ఇంకా ముంపులోనే దేవీపట్నం
ఏజెన్సీలో గోదావరి వరద తగ్గుముఖం పట్టినా కొన్ని ప్రాంతాల్లోని రోడ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి. దీంతో రాకపోకలు పూర్తిస్థాయిలో ఆరంభం కాలేదు. దేవీపట్నం కూడా ఇంకా ముంపులోనే ఉంది. ఇక్కడ వరద ఉధృతి చాలావరకూ తగ్గింది. మండల పరిధిలోని తొయ్యేరు చప్టా, దండంగి, వీరవరం వద్ద రహదారులు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఫలితంగా మండల పరిధిలోని గ్రామాల మధ్య రాకపోకలు పునరుద్ధరణ జరగలేదు. ఇళ్లలో చాలావరకూ నీరు తీసింది. తొమ్మిది రోజులుగా ముంపులో ఉన్న పూరిళ్లు నానిపోయి కూలిపోతున్నాయి. దేవీపట్నం మత్స్యకార కాలనీ, తొయ్యేరు, పూడిపల్లి ఎస్సీ కాలనీలను ముంపు వీడలేదు. చాలామంది పునరావాస కేంద్రాల నుంచి వచ్చి ఇళ్లను శుభ్రం చేసుకుంటూండగా, మరికొంతమంది పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు.
ఇక్కడ సోమవారం సాయంత్రం నుంచి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశముంది. గోదావరి తగ్గుముఖం పడుతూండడం, శబరి సాధారణ స్థితికి చేరడంతో విలీన మండలాల్లో రాకపోకలకు మార్గం సుగమమైంది. శనివారం వరకూ 30, 326 జాతీయ రహదారులపై వరద నీరు ప్రవహించడంతో ఇక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణకు రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ముంపు వీడడంతో చింతూరు నుంచి ఆయా ప్రాంతాలకు ఆదివారం రాకపోకలు ఆరంభమయ్యాయి. రోడ్డు మునిగిపోవడంతో చింతూరు మండలం చట్టి వద్ద సుమారు 150 వరకూ లారీలు, బస్సులు నిలిచిపోయాయి.
ఇది తెలిసి సుదూర ప్రాంతాలవారు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించారు. రహదారుల్లో ముంపు వీడిందని తెలియడంతో రాజమహేంద్రవరం, కాకినాడ, విశాఖపట్నం నుంచి ఆయా రాష్ట్రాలకు వెళ్లే లారీలు, బస్సుల రాకపోకలు నెమ్మదిగా మొదలయ్యాయి. చింతూరు నుంచి వీఆర్ పురం మండలానికి వెళ్లే ప్రధాన రహదారిపై కూడా ముంపు తగ్గడంతో రాకపోకలు ఆరంభమయ్యాయి. అయితే వీఆర్ పురంలో కన్నాయిగూడెం – చింతరేవుపల్లి వద్ద వాగు ఇంకా పొంగుతూండడంతో ఎనిమిది గ్రామాల మధ్య రాకపోకలు ప్రారంభం కాలేదు. కూనవరం మండలంలో వరద ప్రభావం చాలావరకూ తగ్గింది.
జలదిగ్బంధంలోనే కోనసీమ లంకలు
కోనసీమలోని పి.గన్నవరం మండలంలో ఇంకా ఆరు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఐదు గ్రామాల ప్రజలు పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. కె.ఏనుగుపల్లి రహదారిపై రెండడుగుల మేర ప్రవహిస్తున్న వరద నీటిలోనే స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. మామిడికుదురు మండలంలోని మూడు గ్రామాలు ఇప్పటివరకూ బాహ్య ప్రపంచంతో సంబంధాల పునరుద్ధరణకు నోచుకోలేదు. అప్పనపల్లి కాజ్‌వే వద్ద శుక్రవారం గల్లంతైన ఇద్దరు యువకుల్లో కాకినాడ రూరల్ మండల రేపూరుకు చెందిన షేక్ సమీర్ బాషా (23), పెదపట్నం గ్రామానికి చెందిన షేక్ రెహ్మాన్ అలియాస్ నాని (17) మృతదేహాలను ఆదివారం ఉదయం వెలికి తీశారు. మామిడికుదురు మండలంలోని పలు గ్రామాల్లో పడవల ద్వారా, అప్పనపల్లి ఉచ్చులవారిపేట వెళ్లే రహదారిపై వరద నీరు తగ్గడంతో ట్రాక్టర్ ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. అయినవిల్లి మండలం ఎదురుబిడిం కాజ్‌వేపై కూడా ఇంకా పడవల పైనే రాకపోకలు జరుగుతున్నాయి.
మండల పరిధిలోని ఏడు గ్రామాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. అల్లవరం మండలం బోడసకుర్రు కూడా ఇంకా ముంపులోనే ఉంది. ఇక్కడ ఒక అడుగు మాత్రమే వరద తగ్గింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు ఇంకా ముంపులోనే ఉన్నాయి. మట్టితో నిర్మించిన మత్స్యకారుల ఇళ్లు కరిగి, కూలిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. మండల వ్యాప్తంగా 114 ఇళ్లు ముంపు బారిన పడ్డాయి. బోడసకుర్రులో 180 ఎకరాల్లో నారుమళ్లు, వరినాట్లు నీట మునిగాయి. మరో రెండు రోజులు గడిస్తేనే కానీ ఇక్కడ ముంపు తగ్గే అవకాశం లేదు. మలికిపురం మండలం రామరాజులంక లోతట్టు ప్రాంతాలు, సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంకలోను ఇంకా పడవల మీదనే రాకపోకలు సాగిస్తున్నారు. ఆత్రేయపురం, రావులపాలెం, ఆలమూరు, ముమ్మిడివరం మండలాల్లో లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి.
తీవ్రమవుతున్న నదీకోత
గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో నదీకోత తీవ్రత ఎక్కువగా ఉంది. ఆలమూరు, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, పి.గన్నవరం, మామిడికుదురు మండలాల పరిధిలోని లంక గ్రామాల్లో కోత తీవ్రమవుతోంది. వరద పెరిగిన సమయంలోను, తిరిగి తగ్గుతున్న సమయంలోను కోత తీవ్రత అధికంగా ఉందని రైతులు చెబుతున్నారు. వందల సంఖ్యలో కొబ్బరి చెట్లు నదిలో కలిసిపోతున్నాయి. ఆలమూరు మండలం బడుగువానిలంక, ముమ్మిడివరం మండలం సలాదివారిపాలెం, కమిని, గురజాపులంక, లంకాఫ్ ఠాన్నేల్లంక, అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం, పి.గన్నవరం మండలం గంటి పెదపూడి వంటి ప్రాంతాల్లో కోత తీవ్రత అధికంగా ఉంది.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
గోదావరి వరద వీడిన తరువాత రెట్టింపు సమస్యలు ఎదురవుతాయి. బురద పేరుకుపోయిన రోడ్లు, ఎక్కడెక్కడి నుంచో కొట్టుకువచ్చే వ్యర్థాలు.. ఇళ్ల చుట్టూ ముంపునీరు.. కలుషితమయ్యే భూగర్భ జలాల వల్ల ప్రజలు అంటురోగాల బారిన పడే ప్రమాదముంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం పారిశుద్ధ్య చర్యలు పక్కాగా చేపట్టాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment