వరదలపై పాలసీ | CM KCR Review Meeting On Heavy Rains In Telangana | Sakshi
Sakshi News home page

వరదలపై పాలసీ

Published Tue, Aug 18 2020 2:33 AM | Last Updated on Tue, Aug 18 2020 8:39 AM

CM KCR Review Meeting On Heavy Rains In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వానలు, వరదలు సంభ విస్తే అనుసరించాల్సిన ప్రణాళికను గత పాల కులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకొని రూపొందించి తెలంగాణను పట్టించు కోలేదని సీఎం కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. తెలంగాణలో వానలు, వరదలు, విపత్తులు వచ్చినా పరిగణనలోకి తీసుకోలేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో విప త్తుల నిర్వహణ వ్యూహాన్ని తయారు చేసుకోవా లన్నారు. ‘ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ తెలంగాణ’ పేరిట తయారయ్యే ఈ పాలసీ శాశ్వత ప్రాతిపదికన ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, వరదల మూలంగా తలెత్తిన పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్‌ అలీ, కె. తారక రామారావు, నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (ఉగ్ర గోదావరి..)

మరో 3, 4 రోజులు కీలకం...
‘నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండటంతోపాటు వాగులు, వంకలు, నదులు పొంగుతున్నాయి. ప్రస్తుతం పరిస్తితి అదుపులో ఉన్నా మరో మూడు నాలుగు రోజులు అత్యంత కీలకం. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వల్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీనికితోడు ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, ప్రాణహిత, ఇంద్రావతి పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. (ఇంకా వరద బురదలోనే..)

ఏ ఒక్కరికీ ప్రాణాపాయం లేకుండా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసుకొని నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలి. కంట్రోల్‌ రూమ్‌లలో రెవెన్యూ, పోలీస్, జలవనరులు, విద్యుత్‌ తదితర శాఖల ప్రతినిధులుండాలి. సహాయక చర్యలకు అవసరమైన నిధులు సిద్ధంగా ఉన్నందున ఖర్చుకు వెనకాడకుండా పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి’ అని కేసీఆర్‌ ఆదేశించారు.

జిల్లాలవారీగా పరిస్థితిపై ఆరా..
జిల్లాలవారీగా వర్షాల పరిస్థితిని సమీక్షించిన సీఎం కేసీఆర్‌... వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపై దృష్టి పెట్టాలన్నారు. ‘గోదావరికి భారీ వరద వచ్చే అవకాశం ఉన్నందున ఏటూరునాగారం, మంగపేట మండలాలతోపాటు పరీవాహక ప్రాంతంలోని ముంపు గ్రామాలు, ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. భద్రాచలం పట్టణంలో నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువు కట్టలు పటిష్టంగా తయారు కావడంతో నిలువ సామర్థ్యం పెరగడంతో బుంగలు పడకుండా నివారించగలిగాం. ఇంకా పనులు చేపట్టని కొన్ని చిన్న కుంటలకే నష్టం జరిగింది. చెరువులకు మరింత వరద వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి’ అని సీఎం సూచించారు.

ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు..
‘విపత్తు నిర్వహణలో ప్రాణాలు కాపాడటమే అత్యంత ముఖ్యమనే విషయాన్ని అధికార యంత్రాంగం గుర్తించాలి. ముంపు ప్రమాదంపై అధికార యంత్రాంగానికి ప్రజలు సమాచారం ఇవ్వాలి. కూలిపోయే అవకాశం ఉన్న ఇళ్లు, కాజ్‌వేల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముంపు పొంచి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి భోజనం, ఇతర వసతులు, కోవిడ్‌ రక్షణకు మాస్క్‌లు, శానిటైజర్లు ఇవ్వాలి. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్థానికంగా ఉంటూ సహాయ చర్యలు పర్యక్షించాలి. వానలు, వరదల వల్ల జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ అంచనాలు తయారు చేయాలి. పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖలు పట్టణాలు, గ్రామాల నుంచి నివేదికలు తెప్పించుకొని నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

విపత్తుల నివారణకు శాశ్వత వ్యూహం
‘భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అనుసరించాల్సిన వ్యూహాన్ని అధికార యంత్రాంగం రూపొందించుకోవాలి. ఏ స్థాయిలో వర్షం వస్తే ఎక్కడ ఎంత నీరు వస్తుంది? ఏ నదికి ఎంత వరద వస్తుంది? అప్పుడు ఏ ప్రాంతాలు మునిగే అవకాశం ఉంది వంటి అంశాలను అధ్యయనం చేయాలి. భారీ వర్షాలు పడినా లోతట్టు ప్రాంతాలను ఎలా కాపాడాలి? ఎక్కడెక్కడ రోడ్లపైకి నీరు వచ్చే అవకాశం ఉంది వంటి అంశాలపై విస్తృతంగా అధ్యయనం చేసి వ్యూహం ఖరారు చేయాలి. అన్ని పట్టణాల్లో మున్సిపల్, పోలీసు విభాగాలతో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి వెంటనే రంగంలోకి దిగేలా ప్రణాళిక సిద్ధం చేయాలి. నదుల వద్ద ఫ్లడ్‌ ట్రాక్‌షీట్‌ తయారు చేసి నదులు పొంగినప్పుడు తలెత్తే పరిస్థితులను నమోదు చేయడంతోపాటు భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేయాలి’ అని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అలాగే వర్షాకాలంలో సంభవించే అంటువ్యాధులతోపాటు ఇతర వ్యా«ధులపై వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమై అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు సిద్ధంగా ఉంచాలన్నారు.

విద్యుత్‌ సిబ్బందికి అభినందన...
ప్రకృతి విపత్తు సమయంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా చూడటంతోపాటు గ్రిడ్‌ ఫెయిల్‌ కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, విద్యుత్‌ సిబ్బందిని సీఎం కేసీఆర్‌ అభినందించారు. ‘ఉమ్మడి ఏపీలోనూ లేని రీతిలో ఈ ఏడాది తెలంగాణలో 13,168 మెగావాట్ల గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది. ఇదే ఏడాది ఓ సందర్భంలో 4,200 మెగావాట్ల అత్యంత కనిష్టానికి కూడా విద్యుత్‌ డిమాండ్‌ పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రిడ్‌ కుప్పకూలకుండా తెలంగాణ విద్యుత్‌ సంస్థలు పనిచేశాయి’ అని సీఎం పేర్కొన్నారు. అలాగే మున్సిపల్‌ శాఖ సైతం హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో భారీ నష్టం కలగకుండా చర్యలు తీసుకుందన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement