సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రం తడిసి ముద్దయింది. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలదిగ్భందమయ్యాయి. అనేక చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని పరిస్థితిని సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లాల వారీగా సమాచారం తెలుసుకొని తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు, సూచనలు జారీ చేస్తున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. (సైదాపూర్‌లో తృటిలో తప్పిన ప్రమాదం)
జిల్లాలవారిగా వర్షాభావ పరిస్థితులను కేసీఆర్ సమీక్షించారు. పంట, ఇతర నష్టాలపై వివరాలు పంపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరో మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ నేపథ్యంలో కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే చేసే అవకాశం ఉంది. (11 రాష్టాల్లో వరదలు.. 868 మంది మృతి)
సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. 20 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయన్నారు. అసెంబ్లీలో చాలా అంశాలపై చర్చించాలని, కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
వరంగల్‌ను ముంచెత్తిన వానలు
అయిదు రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలు వరంగల్ నగరాన్ని ముంచెతుతున్నాయి. స్థానిక పరిస్థితిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్షించారు. అక్కడ చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్ నగరంలో స్వయంగా పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం ఉదయం హెలికాప్టర్లో వరంగల్ వెళ్లనున్నారు.
జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కూడా వీరితో కలవనున్నారు. మంత్రుల బృందం నగరంలో పర్యటించి, పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. వరంగల్ ఎంజిఎంను సందర్శించనున్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహిస్తారు. వానలు, వరదలు, కరోనా పరిస్థితిని, తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment