తెలంగాణ రెవెన్యూ కోడ్‌..! | CM KCR May Introduce Revenue Code In Telangana | Sakshi
Sakshi News home page

చట్టాలన్నీ ఒకే గొడుగు కిందకు

Published Thu, Feb 13 2020 2:16 AM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM

CM KCR May Introduce Revenue Code In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భూ పరిపాలన, హక్కులపై ఉన్న గందరగోళాలకు తెరదించుతూ, దీనికి సంబంధించిన అన్ని చట్టాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ఉత్తరప్రదేశ్‌ తరహాలో తెలంగాణ రెవెన్యూ కోడ్‌ను తేవాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు యూపీ సర్కారు 2016లో అమల్లోకి తెచ్చిన రెవెన్యూ కోడ్‌ను సమగ్రంగా అధ్యయనం చేసి రాష్ట్రం కోసం కొత్త రెవెన్యూ కోడ్‌కు రూపకల్పన చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ యూపీ కోడ్‌ అధ్యయనం చేసే పనిలో పడినట్లు సమాచారం. వాస్తవానికి, నిజాం రాష్ట్రంలో ‘ఫస్లీ–1317’చట్టాన్ని రూపొందించారు. ఈ ఫస్లీయే ఇప్పటివరకు అమల్లోకి వచ్చిన అన్ని రెవెన్యూ చట్టాలకు భూమికగా వస్తోంది. భూ పరిపాలనకు సంబంధించిన అన్ని చట్టాలు, భాగాలు, అధ్యాయాలు, సెక్షన్లు అన్నీ ఈ చట్టంలో సమగ్రంగా ఉండేవి.

అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత భూపాలన, హక్కులకు సంబంధించిన ఒక్కో అంశంపై ఒక్కో చట్టం చేశారు. లేదంటే చట్టంలోనే సబ్‌ సెక్షన్లుగా నియమ నిబంధనలను విడగొట్టారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 124 రెవెన్యూ చట్టాలు/రూల్స్‌ అమల్లో ఉన్నాయి. ఇబ్బడిముబ్బడిగా ఉన్న వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి యూపీ తరహాలో తెలంగాణ రెవెన్యూ కోడ్‌ అమల్లోకి తేవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అదే తరహాలో కాలంచెల్లిన చట్టాలకు చరమగీతం పాడాలని యోచిస్తోంది. మరోవైపు పాశ్చాత్య దేశాలే కాకుండా, పొరుగు రాష్ట్రంలోనూ అమలు చేస్తున్న టైటిల్‌ గ్యారంటీ చట్టాన్ని ఇక్కడ కూడా ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నా, ఇది అమల్లో కష్టసాధ్యమని, న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయనే మీమాంసలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘తెలంగాణ రెవెన్యూ కోడ్‌ లేదా తెలంగాణ భూచట్టం’వైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కోడ్‌కు తుదిరూపు ఇచ్చేముందుకు ప్రత్యేకంగా కలెక్టర్ల సమావేశం నిర్వహించి కోడ్‌పై విస్తృతంగా చర్చించాలని కూడా ఆయన నిర్ణయించినట్లు సమాచారం.

యూపీ చట్టం ఇది...
దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కూడా రెవెన్యూ వ్యవస్థ గందరగోళంగా ఉండేది. భూ చట్టాల అమల్లో ఉన్న ఇబ్బందులకు పరిష్కారంగా రెవెన్యూ కోడ్‌ రూపొందించాలని ఆ రాష్ట్ర లా కమిషన్‌ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ సిఫారసు మేరకు 2006 సంవత్సంలో యూపీ రెవెన్యూ కోడ్‌కు అక్కడి ప్రభుత్వం రూపకల్పన చేసింది. 2012లో దీన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఆ తర్వాత 2016 నుంచి ఈ కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఈ కోడ్‌లో మొత్తం 16 అధ్యాయాలు, 234 సెక్షన్లు ఉన్నాయి. భూపరిపాలన, భూహక్కులకు సంబంధించిన అన్ని చట్టపరమైన అంశాలు ఈ కోడ్‌లోనే పొందుపరిచారు. అంతకుముందు మనుగడలో ఉన్న 32 చట్టాలను కోడ్‌ రాకతో అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. ఇదే తరహాలో 1999లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ కోడ్‌ రూపొందించారు. అప్పటికే ఉన్న 191 చట్టాలను క్రోడీకరించి ఆంధ్రప్రదేశ్‌ భూమి రెవెన్యూ కోడ్‌–1999 పేరుతో తయారు చేశారు. ఇందులో 17 భాగాలు, 47 అధ్యాయాలు, 260 సెక్షన్లను పొందుపరిచారు. భూపాలనకు సంబంధించిన చట్టాలన్నింటినీ ఒకే చోటకు తెచ్చే ప్రయత్నానికి కేంద్రం మోకాలడ్డింది. శాసనసభ ఆమోదముద్ర వేసిన బిల్లును కేంద్రానికి పంపగా 146 ప్రశ్నలతో తిప్పి పంపింది. దీంతో కోడ్‌ అటకెక్కింది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో తెలంగాణ రెవెన్యూ కోడ్‌ను యూపీ కోడ్‌ ఆధారంగా తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. 

మా దోస్త్‌ను కూడా వదలలేదు?
కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ మరోసారి రెవెన్యూశాఖపై అసహనం వ్యక్తం చేశారు. డబ్బులివ్వందే పనులు కావడం లేదని మండిపడ్డారు. ‘పాస్‌ పుస్తకం కోసం మా దోస్తు పోతే వీఆర్వో పైసలు అడిగిండు. అసలేం జరుగుతోంది. విజయారెడ్డిని అన్యాయంగా పోగొట్టుకున్నం. చిన్న పిల్లలు అన్యాయమైపోయారు. ఇలాంటి సంఘటనల తర్వాత కూడా రెవెన్యూ వాళ్లు మారరా? కనువిప్పు కలగాలి. ఇప్పటికే రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. భూ రికార్డుల ప్రక్షాళనను లోపభూయిష్టంగా చేశారు. భూ రికార్డులు సరిగ్గా ఉన్న ప్రాంతాల్లో 3 శాతం జీడీపీ అదనంగా వస్తోందని రుజువైంది. ఇప్పటికైనా మార్పు రావాలి’అని సీఎం కేసీఆర్‌ కలెక్టర్ల సమావేశంలో వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement