పాలనలో కొత్త పుంతలు.. కేసీఆర్‌ దిశానిర్దేశం  | CM KCR Meeting With Collectors Over Administration | Sakshi
Sakshi News home page

పాలనపై తీన్‌మార్క్

Published Tue, Feb 11 2020 2:58 AM | Last Updated on Mon, Feb 17 2020 5:30 PM

CM KCR Meeting With Collectors Over Administration - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జిల్లాల పాలనలో కొత్త అధ్యాయానికి తెర లేచింది. పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం జిల్లా అధికారులకు పని విభజన చేసింది. ప్రస్తుతమున్న జిల్లా కలెక్టర్లకు చేదోడు వాదోడుగా ఉండటంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమ్యాలను పూర్తి చేసేందుకు అదనపు కలెక్టర్లను నియమించింది. ప్రస్తుత జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) పోస్టును రద్దు చేసి దాని స్థానే ఇద్దరు అడిషనల్‌ కలెక్టర్లను నియమించి వారికి వేర్వేరు బాధ్యతలను అప్పగించింది. ముఖ్యంగా కొత్తగా తేవాలనుకుంటున్న రెవెన్యూ చట్టంతోపాటు ఇప్పటికే అమల్లోకి వచ్చిన పంచాయతీరాజ్, పుర చట్టాలను సమర్థంగా అమలు చేయడమే ప్రధాన బాధ్యతగా ఈ పోస్టులను తెరపైకి తెచ్చింది. స్థానిక సంస్థలను గాడిన పెట్టడం, రెవెన్యూ వ్యవహారాలను కొలిక్కి తేవడమే ప్రాతిపదికగా కొత్త సారథులను రంగంలోకి దించింది. మొత్తంమీద జిల్లా స్థాయిలో ఇక నుంచి కలెక్టర్, ఇద్దరు అదనపు కలెక్టర్లతో తీన్‌‘మార్క్‌’పడనుంది.

పల్లె, పట్టణాలకు పెద్దపీట...
ప్రస్తుతం జేసీలుగా పనిచేస్తున్న వారు ఇక నుంచి అదనపు కలెక్టర్‌ (సాధారణ) బాధ్యతలు నిర్వహించనున్నారు. వారు రెవెన్యూ వ్యవహారాలతో పాటు పౌర సరఫరాలు, కొనుగోళ్ల కమిటీ, భూసేకరణ అంశాలను పర్యవేక్షిస్తారు. ఈ పోస్టుకుతోడు అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) పదవిని ప్రభుత్వం సృష్టించింది. పంచాయతీరాజ్, పురపాలనను ఈ అధికారి పరిధిలోకి తేనుంది. దీంతో పట్టణ, పంచాయతీల్లో పాలనను పారదర్శకంగా, అవినీతిరహితంగా మలచాలని భావిస్తోంది. ఇప్పటివరకు మున్సిపాలిటీలపై కలెక్టర్లకు పెద్దగా అధికారాలుండేవి కావు. యాజమాయిషీ అంతా పురపాలకశాఖ డైరెక్టర్‌దే ఉండేది. కమిషనర్లు, ఇతర ఉద్యోగులు తప్పులు చేస్తే చర్యలు తీసుకొనే అధికారం కూడా కలెక్టర్లకు లేదు. కేవలం సిఫారసుకు మాత్రమే పరిమితం కావాల్సిన పరిస్థితి ఉండేది. అయితే మనుగడలోకి వచ్చిన కొత్త పుర చట్టంలో ఈ లోటును అధిగమించేలా సర్కారు సంస్కరణలు చేపట్టింది.

పురపాలికలనూ కలెక్టర్ల పరిధిలోకి తెచ్చి వారికి సంపూర్ణ అధికారాలు కట్టబెట్టింది. ఈ క్రమంలోనే మరో అడుగు ముందుకు వేసింది. పురపాలన పర్యవేక్షణకు ఏకంగా అదనపు కలెక్టర్లను నియమించి పరిపాలనలో సంస్కరణలకు కొత్త బీజం వేసింది. అయితే అదనపు కలెక్టర్‌ను కేవలం మున్సిపల్‌ వ్యవహారాలకే పరిమితం చేయకుండా పంచాయతీరాజ్‌ పగ్గాలను కూడా అప్పగించనుంది. తద్వారా స్థానిక సంస్థలపై పట్టుబిగించేలా జిల్లా పాలనలో కీలక సంస్కరణ తీసుకొచ్చింది. పల్లె ప్రగతి కార్యక్రమాల పర్యవేక్షణ, హరితహారం, నర్సరీల నిర్వహణ వ్యవహారాలను వారు పర్యవేక్షించాల్సి ఉంటుంది. పురపాలనలో పట్టణ æప్రగతి, లే అవుట్ల మంజూరు, బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులిచ్చే కమిటీలో వారే ప్రధాన పాత్ర పోషించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
 
నాడు ఏజేసీ.. నేడు జేసీ పోస్టుకు మంగళం
గతంలో రంగారెడ్డి జిల్లా మినహా అన్ని జిల్లాల్లో అడిషనల్‌ జాయింట్‌ కలెక్టర్‌ (ఏజేసీ) పోస్టు ఉండేది. ఏజేసీకి కూడా కొన్ని శాఖలను కేటాయించడం ద్వారా పని విభజన చేశారు. రంగారెడ్డి జిల్లాకు మాత్రం ఇద్దరు జేసీలు ఉండేవారు. వారికి జిల్లాలోని మండలాలను దాదాపు చెరిసగం పంచారు. అలాగే సంక్షేమం, పౌర సరఫరాలు తదితర శాఖలతో సర్దుబాటు చేశారు. అయితే విధానపరమైన నిర్ణయాల్లో అంతిమ నిర్ణయం మాత్రం జిల్లా కలెక్టర్‌కే ఉండేది. 2016లో జిల్లాల పునర్విభజన అనంతరం ఏజేసీ పోస్టులు సహా రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌–2 పోస్టును కూడా రద్దు చేసి ఒకరితోనే సరిపెట్టారు. తాజాగా అన్ని జిల్లాల్లో జేసీ పోస్టును ఎత్తేసి ఇద్దరేసి అదనపు కలెక్టర్లను నియమించడం ద్వారా పాలనను కొత్త పుంతలు తొక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ శాఖను సంస్కరించాలని భావిస్తున్న సీఎం... మరిన్ని కొత్త నిర్ణయాలు, పాలనాపరమైన అధికార వికేంద్రీకరణ జరిపే అవకాశం లేకపోలేదు. మరిన్ని అధికార కేంద్రాలను సృష్టించే ఆస్కారమూ లేకపోలేదనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. అయితే రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారని, అందులో భాగంగానే జిల్లా పాలనా కేంద్రాల్లో మార్పులు జరిగి కొత్త పోస్టును సృష్టించారనే ప్రచారాన్ని ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ప్రజల దైనందిన వ్యవహారాల్లో కీలకమైన రెవెన్యూ వ్యవస్థను పకడ్బందీగా నడిపించే బాధ్యతను అదనపు కలెక్టర్లు చూస్తారని, మిగతా రెవెన్యూ శాఖ స్వరూపంలో ఎలాంటి మార్పులూ ఉండకపోవచ్చని తెలుస్తోంది. గ్రామస్థాయి పోస్టుల్లో కొన్నింటిని మార్చడంతోపాటు భూ రికార్డుల సవరణలు, రిజిస్ట్రేషన్‌ చట్టాల అమలు బాధ్యతలను ఆర్డీవో, ఆపై స్థాయి అధికారులకు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నేడు కలెక్టర్ల సదస్సులో దిశానిర్దేశం...
జిల్లా కలెక్టర్లతోపాటు కొత్తగా నియమితులైన అదనపు కలెక్టర్లకు సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో జరగనున్న కలెక్టర్ల సదస్సులో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి మొత్తం 8 అంశాలతో ఎజెండా తయారు చేశారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో కలెక్టర్ల పాత్ర, ప్రక్షాళన చేసిన భూ రికార్డుల ఫ్రీజింగ్, అదనపు కలెక్టర్ల జాబ్‌చార్ట్, కీలక ప్రగతి సూచికలు, మత్స్య సంపద, మాంస ఉత్పత్తుల పెంపుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రగతిలో భాగంగా కీలక మానవాభివృద్ధి సూచికలపై సీఎం కేసీఆర్‌ ఫోకస్‌ చేయనున్నారని, ఈ విషయంలోనే జిల్లా అధికారులు చేపట్టాల్సిన కీలక చర్యల గురించి వివరిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు కొత్త రెవెన్యూ చట్టం అమలుపైనా ఈ భేటీలో కీలక చర్చ జరగనున్నట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement