ఎగువ నుంచి వచ్చి చేరుతున్న వరద నీటితో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వైఎస్సార్ జిల్లాలో ఉన్న యోగివేమన విశ్వవిద్యాలయంలో అరుదైన సప్తవర్ణశోభిత సాలీడు దర్శనమిచ్చింది. వాటర్ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా హైదరాబాదీలకు అధికారులు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. కాగా, అధికార కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల పండుగ సందర్భంగా చైనాలో వేడుకలు ఘనంగా జరిగాయి. మరిన్ని ‘చిత్ర’ విశేషాల కోసం ఇక్కడ చూడండి.
1/11
రైల్వే గేట్ వేస్తే ఈ వాహనాదారులు ఇలా రోడ్డుపై నిల్చున్నారు అనుకుంటున్నారా..? అలా అనుకుంటే పొరబడినట్లే. మహబూబాబాద్ జిల్లా గూడూరు నుంచి నెక్కొండ వైపు వెళ్లే రోడ్డులో పోలీసులు శుక్రవారం వాహనాల తనిఖీలు చేపట్టారు. అన్ని పత్రాలు పరిశీలించి ఏదీ లేకున్నా జరిమానా విధించడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న అటుగా వచ్చే వాహనదారులు పోలీసులు తనిఖీలు ముగించాకే అక్కడి నుంచి వెళ్లాలని ఇలా రోడ్డుపై వాహనాలను నిలిపి రోడ్డుపై వేచి ఉండటం గమనార్హం.
2/11
నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన పెండపు కృష్ణమూర్తి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పత్తి పంటలో కలుపు తీసేందుకు కూలీల కొరత ఏర్పడింది. ఆ సమయంలో దుక్కిదున్నే యంత్రాల తయారీని సోషల్ మీడియాలో చూశాడు. అంతే తన వద్ద ఉన్న పల్సర్ మోటార్‌సైకిల్‌తో యంత్రాన్ని తయారు చేసి పత్తి సాగులో వినియోగిస్తున్నాడు. కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ యంత్రం తయారీకి రూ.90 వేలు ఖర్చు అయిందని వివరించాడు.
3/11
మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తడంతో వరద నీరు గోదావరి నదిలో ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం బాసర వద్ద నది నిండుగా కనిపించింది. మంజీర, గోదావరితోపాటు ఉప నదుల నీరంతా నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద కలుస్తుంది. ఈ నీరంతా గోదావరిలో కలవడంతో ఉధృతి మరింత పెరిగింది. శుక్రవారం బాసర వద్ద నదిలోని కొత్తనీటిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. – భైంసా (ముధోల్
4/11
అప్పుడెప్పుడో 1868 సంవత్సరానికి ముందు జీవించి, అంతరించిపోయిందనుకున్న అరుదైన సాలెపురుగు జాతి కీటకం మళ్లీ కనిపించింది. ఇంద్రధనస్సు వలే సప్తవర్ణశోభితంగా కనువిందు చేసింది. దీనికి వైఎస్సార్ జిల్లాలో ఉన్న యోగివేమన విశ్వవిద్యాలయంలోని బొటానికల్ గార్డెన్ వేదికైంది. ఒకటిన్నర శతాబ్ధం తర్వాత 2018లో కేరళలో ఈ కీటకాల ఉనికిని కనుగొనగా.. ఇప్పుడు వైఎస్సార్ జిల్లాలో దీని ఆచూకీ బయట పడింది.దీంతో ఈ కీటకం గురించి పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు.
5/11
నెక్లెస్ రోడ్... నిత్యం వేలాది మంది నగర వాసులు, పర్యాటకులతో కళకళలాడుతూ ఉండే మార్గం. ఇక్కడికి వచ్చే పర్యాటకులు తాము తాగే వాటర్ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. దీంతో ఖాళీ బాటిళ్లను డస్ట్‌బిన్‌లో మాత్రమే వేయాలని చైతన్య పరిచే విధంగా జీహెచ్‌ఎంసీ అధికారులు వాటర్ బాటిల్ మాదిరిగా ఐరన్‌తో చేసిన పెద్ద బాటిల్ నమూనాను నెక్లెస్ రోడ్‌లో ఏర్పాటు చేశారు.
6/11
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా కుద్రీ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టుల డంప్ లభ్యమైంది. ప్రత్యేక పోలీస్ బలగాలతో గురువారం రాత్రి కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ డంపు దొరికిందని ఎస్పీ అంకిత్‌గోయల్ తెలిపారు. అందులో రూ.15.96 లక్షల నగదు, మూడు డిటోనేటర్లతో పాటు వైర్ బండిళ్లు, వాకీటాకీ, బ్యానర్లు, కిట్‌బ్యాగులు ఉన్నాయని ఆయన శుక్రవారం విలేకరులకు వివరించారు.
7/11
మహారాష్ట్ర యావత్మల్ జిల్లాలోని షిబ్లా–పార్డి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు నిర్వహిస్తుండగా దాదాపు ఆరు కోట్ల ఏళ్ల క్రితం నాటి అరుదైన స్తంభాలతో కూడిన బసాల్ట్ శిలలు బయల్పడ్డాయి. అగ్నిపర్వతాలు విస్ఫోటం ద్వారా వెలువడిన లావా నుంచి ఈ శిలలు ఏర్పడతాయి.
8/11
డీఆర్‌డీవో తయారు చేసిన 10 మీటర్ల పొడవైన షార్ట్ స్పాన్ బ్రిడ్జింగ్ సిస్టమ్(ఎస్‌ఎస్‌బీఎస్) ఇది. దీనిని శుక్రవారం మొదటి విడతగా 12 ఎస్‌ఎస్‌బీఎస్‌లను ఢిల్లీలోని కరియప్పపరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆర్మీకి అందజేశారు.
9/11
చైనా కమ్యూనిస్టు పార్టీ 100వ వార్షికోత్సవం సందర్భంగా దక్షిణ గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని షెన్‌జెన్‌లో డ్రోన్లతో ఏర్పడిన పక్షి ఆకృతిని ఫోన్లలో బందిస్తున్న జనం
10/11
వెనెజులా రాజధాని కారకాస్‌లోని తెరెసా కరెనో థియేటర్ కరోనా ఆంక్షలతో మూతబడి దాదాపు 16 నెలల అనంతరం తిరిగి తెరుచుకుంటోంది. ప్రేక్షకుల మధ్య భౌతికదూరాన్ని సూచిస్తూ సీట్లలో ఉంచిన కార్డుబోర్టు కటౌట్ల పక్కన కూర్చున్న ఓ మహిళ
11/11
రెండు దశాబ్దాల అనంతరం అఫ్ఘన్‌లోని కీలక బగ్రామ్ ఎయిర్‌ఫీల్డ్‌ను అమెరికా మిలటరీ ఖాళీ చేసింది. అమెరికా తాలిబన్ల వేటకు ఈ ఎయిర్‌ఫీల్డే కేంద్ర స్థానంగా ఉండేది. తాజాగా దీన్ని అఫ్ఘన్ నేషనల్‌సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ ఫోర్స్‌కు పూర్తిగా స్వాధీనం చేసినట్లు మిలటరీ అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment