రాజధాని ప్రాంతంలోకి ఎగదన్నిన కృష్ణా వరద | Krishna Floods That Hit The Capital Amaravati Region | Sakshi
Sakshi News home page

రాజధాని ప్రాంతంలోకి ఎగదన్నిన కృష్ణా వరద

Published Tue, Sep 29 2020 5:32 AM | Last Updated on Tue, Sep 29 2020 3:46 PM

Krishna Floods That Hit The Capital Amaravati Region - Sakshi

కృష్ణానదికి నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ లీకేజీల ద్వారా విజయవాడ రామలింగేశ్వరనగర్‌ను ముంచెత్తిన నీరు

సాక్షి,అమరావతి/తాడేపల్లిరూరల్‌/పటమట(విజయవాడ తూర్పు): కృష్ణా నదిలో వరద ప్రవాహం ఆరు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువైతే రాజధాని ప్రాంతాన్ని వరద ముంచెత్తుతుందన్న విషయం మరోసారి రుజువైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పది గంటల వరకూ ప్రకాశం బ్యారేజీలోకి గరిష్టంగా 7.03 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం రావడంతో ఉండవల్లి అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌ గుండా కృష్ణా వరద నీరు కొండవీటివాగులోకి ఎగదన్నింది. ఈ వరద నీరు రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాకల్లోని పొలాలను ముంచెత్తింది. కొండవీటివాగు వరద 5 వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోయడానికి గతంలో టీడీపీ సర్కార్‌ రూ. 237 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పథకం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 2009, అక్టోబర్‌ 5న ప్రకాశం బ్యారేజీకి గరిష్టంగా 11,10,404 క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ తరహాలో ఇప్పుడు వరద వచ్చి ఉంటే.. రాజధానిలోని 29 గ్రామాల్లో 71 శాతానికిపైగా ముంపునకు గురయ్యేవని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకునే తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో రాజధాని నిర్మాణం ఏమాత్రం అనుకూలమైనది కాదంటూ అప్పట్లో శివరామకృష్ణన్‌ కమిటీ, పర్యావరణవేత్తలు, చెన్నై–ఐఐటీ, జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) స్పష్టం చేశాయని ఆ నిపుణులు గుర్తు చేస్తున్నారు.

దేవినేని ఉమా హడావుడి  
కొండవీటివాగు ఎత్తిపోతల వద్ద టీడీపీ నేత దేవినేని ఉమా హడావుడి చేశారు. ఇరిగేషన్‌ అధికారులు మోటార్లను ఆఫ్‌ చేసిన తర్వాత అక్కడకి చేరుకున్న ఆయన రాజధాని మునిగిపోతుంటే ఇంజన్‌లు ఆఫ్‌ చేస్తారా అంటూ హంగామా సృష్టించారు. మోటార్లు ఆన్‌ చేస్తే కృష్ణానదిలో నుంచి వరదనీరు ఉధృతంగా వస్తోందని అక్కడి సిబ్బంది చెప్పినా వినకుండా మళ్లీ మోటార్లు ఆన్‌చేయించారు. చేసిన తప్పు కప్పిపుచ్చుకునేందుకు దేవినేని ఉమా హడావుడి చేస్తున్నారని అక్కడ ఉన్న వారు విమర్శించారు. 

ఇదో అవినీతి గోడ..
విజయవాడ ప్రకాశం బ్యారేజీ దిగువున సుమారు 10 వేల కుటుంబాలు నివాసాలుండే ప్రాంతాన్ని వరద ముప్పు నుంచి రక్షించడానికి రిటైనింగ్‌ వాల్‌ నిర్మించడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అనుమతి ఇచ్చారు. ఆయన మరణానంతరం ఈ ప్రతిపాదన అటకెక్కింది. గత ప్రభుత్వం హయాంలో ఈ వాల్‌ నిర్మాణం జరిగింది. 11.5 మీటర్ల ఎత్తున 2.3 కిలోమీటర్ల పరిధిలో రూ. 164 కోట్ల అంచనాతో తమకు అనుకూలమైన కాంట్రాక్టర్‌తో పనులు చేయించారు. లెవలింగ్‌ లేకుండా నిర్మాణం, నాసిరకమైన మెటీరియల్‌ వల్ల ఆ గోడకు చిల్లుపడింది. ఇప్పుడు వరద నీరు నివాసాలను ముంచెత్తింది.  

కొండవీటివాగుకు వరద వచ్చి ఉంటే..
► ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా గరిష్ట వరద నీటిమట్టం 21.50 మీటర్లు. కొండవీటివాగు గరిష్ట వరద నీటిమట్టం 17.50 మీటర్లు. అంటే.. కృష్ణా నది గరిష్ట వరద నీటిమట్టం కంటే కొండవీటివాగు వరద నీటిమట్టం దిగువన ఉంటుంది.
► సోమవారం కృష్ణా నదిలో వరద పెరగడంతో దిగువన ఉన్న కొండవీటివాగులోకి నీరు ఎగదన్నింది. 
► కొండవీటివాగు వరద ప్రవాహాన్ని ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసి, రాజధానికి ముంపు ముప్పును తప్పించడానికి టీడీపీ సర్కార్‌ నిర్మించిన ఎత్తిపోతల ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. 
► సోమవారం ఆరు మోటార్ల ద్వారా రెండు వేల క్యూసెక్కులను ఎత్తిపోసినా.. కృష్ణా నదిలోని నీరు స్లూయిజ్‌ ద్వారా కొండవీటివాగులోకి మళ్లీ వచ్చింది. 
► రాజధాని గ్రామాల్లో ప్రవహించే కొండవీటివాగు పరీవాహక ప్రాంతంలో వర్షాలు లేకపోవడం వల్ల సోమవారం ఆవాగులో వరద ఉధృతి లేదు. ఒకవేళ వరద ప్రవాహం ఉంటే.. వాగు పరివాహక ప్రాంతం 221.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో ముంపు ముప్పు తీవ్రంగా ఉండేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement