బహిరంగసభకు హాజరైన విద్యార్థులు, మేధావులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, మహిళలు
యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): గతంలో జరిగిన తప్పుల వల్ల తీవ్రంగా నష్టపోయామని, భవిష్యత్‌లో అలాంటి వాటికి అవకాశం లేకుండా పరిపాలన వికేంద్రీకరణ జరగాలని రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక డిమాండ్ చేసింది. వేదిక ఆధ్వర్యంలో శనివారం తిరుపతిలోని ఇందిరా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మూడు ప్రాంతాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, అభ్యుదయవాదులు, ప్రజా సంఘాలు పరిపాలన వికేంద్రీకరణ ఆవశ్యకతను చాటి చెప్పారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేస్తూ సమానంగా అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. స్వీయ ప్రయోజనాలు, 29 గ్రామాల కోసం ప్రతిపక్ష టీడీపీ రాష్ట్రాన్ని బలి కోరుతోందని మండిపడ్డారు. కేవలం అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే సరిపోదని 13 జిల్లాలు పురోగమించాలని స్పష్టం చేశారు.
వికేంద్రీకరణ కోసం తిరుపతి వేదికగా రిలే నిరాహార దీక్షలు చేపడతామని, మహా పాదయాత్ర చేపట్టేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న పరిపాలన వికేంద్రీకరణ బిల్లులో రాయలసీమకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. రాజధానిలో సింహభాగం ఇవ్వాలని, సీమలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ అవసరాలు, ఆకాంక్షలను తెలియజేసేందుకే సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఎస్‌డీహెచ్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ డీవీఎస్ చక్రవర్తిరెడ్డి, అంబేడ్కర్ న్యాయ కళాశాల చైర్మన్ తిప్పారెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, ప్రముఖ రచయిత్రి మస్తానమ్మ, వేణుగోపాల్‌రెడ్డి, హరికృష్ణ తదితరులు ఇందులో పాల్గొన్నారు.
సభలో అభివాదం చేస్తున్న రాయలసీమ అభివృద్ధి సంఘల సమన్వయ వేదిక నాయకులు
రియల్ ఎస్టేట్ సమస్యగా అమరావతి
మూడు రాజధానుల ప్రకటన వల్ల వివాదం ప్రారంభం కాలేదు. గత సర్కారు రాజధాని కోసం అమరావతి రైతుల భూములు లాక్కోవడంతోనే సమస్య మొదలైంది. రాజధాని అంశం ప్రస్తుతం రైతుల సమస్య కాకుండా రియల్ ఎస్టేట్ సమస్యగా మారింది. 29 గ్రామాల ప్రజలు అమరావతిని ఏకైక రాజధానిగా డిమాండ్ చేయడమంటే మిగిలిన నాలుగు కోట్ల మందిని అవమానించడమే. వికేంద్రీకరణ కొత్తది కాదు. 1953లో శ్రీభాగ్ ఒప్పందంలోనే ఆ విషయం ఉంది. 2019లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన వికేంద్రీకరణ బిల్లులో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖలో మరో రాజధానిని చేర్చడం మినహా కొత్త అంశం లేదు. పరిపాలన వికేంద్రీకరణ కోసం రాయలసీమ, ఉత్తరాంధ్ర కలసి పనిచేయాలి. అమరావతి రైతులు రాజధాని కోసం కాకుండా తమ భూముల పరిహారం కోసం అడగాలి. వారికి రాజధానిని అడిగే నైతిక హక్కు లేదు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలి. అమరావతి ఏకైక రాజధాని డిమాండ్‌ను విడనాడకుంటే తిరుపతి నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడతాం. వికేంద్రీకరణ కోసం పాదయాత్రలు చేస్తాం.
– భూమన్, రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షుడు
కొత్త నగరం అనవసరం
రాయలసీమ ప్రాంతం కృష్ణ, తుంగభద్ర నదులకు ముఖద్వారం అయినప్పటికీ నీటి ప్రయోజనాలను పొందలేకపోతున్నాం. ఏటా 600 నుంచి 700 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. దీన్ని వినియోగించుకుంటే సీమ సస్యశ్యామలవుతుంది. రాష్ట్రంలో అనేక నగరాలు ఉండగా అమరావతి పేరిట కొత్త నగరాన్ని అభివృద్ధి చేయడం అనవసరం. ప్రపంచంలో కొత్త నగరాల ప్రాజెక్టులు విఫలమయ్యాయి. అమరావతి కోసం వెచ్చించే నిధులతో ఇతర నగరాలను అభివృద్ధి చేయాలి. సీమలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి నీటిని సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక రూపొందించాలి. సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రా«ధాన్యం ఇవ్వాలి. కొందరు రాజకీయ నాయకులు ఉత్తరాంధ్ర, రాయలసీమ మధ్య విబేధాలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారు. వికేంద్రీకరణ బిల్లులో రాయలసీమకు ప్రాధాన్యం ఇవ్వాలి.
– మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి, రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త
చరిత్రను వక్రీకరించొద్దు
రాయలసీమ ప్రజలు అనాదిగా చేసిన త్యాగాలను చరిత్ర మరువదు. చరిత్రను వక్రీకరించడం దుర్మార్గం. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు రాయలసీమ చేసిన త్యాగాన్ని గుర్తించాలి. విశాలాంధ్ర కోసం రాజధానిగా ఉన్న కర్నూలును వదులుకున్నాం. శ్రీశైలం ప్రాజెక్టు కోసం రైతులు ఎన్నో త్యాగాలు చేశారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. దీనికి ప్రజల మద్దతు ఉంది.
– సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, రాయలసీమ కార్మిక, కర్షక సంఘ నాయకుడు
వెంకన్ననూ వదలరు..
అమరావతి ఒక సామాజిక వర్గానికి చెందిన రాజధానే. దీని వెనుక వ్యక్తిగత అజెండా దాగి ఉంది. మూడు రాజధానుల్లో ఒకటి రాయలసీమలో ఏర్పాటు చేయాలి. అమరావతి వాసుల కోరికలు తీరుస్తూపోతే తిరుమల వెంకన్నను కూడా తమ ప్రాంతానికి తరలించుకెళ్తారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన మాదిరిగా కొందరు నాయకులు రాయలసీమకు ద్రోహం తలపెట్టడం దుర్మార్గం.
– శాంతి నారాయణ, రాయలసీమ మహాసభ అధ్యక్షుడు
ఆస్తి అంతా ఒక్కరికే ఇవ్వమంటున్నారు..
మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి. ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలకు ఆస్తిని సమానంగా పంచకుండా ఒకరికే ఇవ్వాలనే మాదిరిగా అమరావతి వాసుల కోర్కెలు ఉన్నాయి. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి. అమరావతిని సమర్థించే కొందరు సీమ నాయకులు తమ మనసు మార్చుకోవాలి.
– బండి నారాయణస్వామి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
అన్నీ అమరావతికే తరలించారు..
హెచ్‌సీఎల్ సంస్థ తిరుపతిలో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే మాజీ సీఎం చంద్రబాబు అమరావతికి తరలించారు. అనంతపురానికి కేటాయించిన ఎయిమ్స్‌ను కూడా అమరావతికే తరలించారు. జీవో 120 ద్వారా పద్మావతి మెడికల్ కళాశాల సీట్లను రాయలసీమ వాసులకు దక్కకుండా చేశారు. సీమ వెనుకబాటుతనం పోవాలంటే మూడు రాజధానులను అభివృద్ధి చేయాలి.
– శ్రీకంఠరెడ్డి, రాయలసీమ అధ్యయన వేదిక నాయకుడు
పెద్దన్న పాత్ర పోషించండి..
రాయలసీమ, ఉత్తరాంధ్రకి ప్రాధాన్యం ఇవ్వాలి. సీమ నాయకులు పెద్దన్న పాత్ర పోషించి ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలి.
– ఎంఆర్‌ఎన్ వర్మ, ఉత్తరాంధ్ర జర్నలిస్టుల ఫ్రంట్ అధ్యక్షుడు
న్యాయవాదులకు తిప్పలు..
అమరావతి ప్రాంతంలో హైకోర్టు ఆవరణలో నీరు, ఆహారం, ఇళ్లు లేక న్యాయవాదులు అవస్థలు పడుతున్నారు.
– శివారెడ్డి, హైకోర్టు న్యాయవాది
చరిత్రలో నిలుస్తుంది...
ఎన్నో ఏళ్లుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు నష్టపోతున్నారు. సీఎం జగన్ తీసుకున్న పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం చరిత్రలో నిలుస్తుంది.
– సురేష్, డ్రీమ్స్ ఆర్గనైజేషన్ చైర్మన్
మూడుకే మా మద్దతు
మేం అమరావతి ప్రాంతంలో ఉన్నప్పటికీ మా మద్దతు మూడు రాజధానులకే.
– రాబర్ట్ సునీల్, ఫాస్టర్స్ ఫెడరేషన్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment