రాజధాని ప్రాంతం ఉద్దండరాయునిపాలెంలో గురువారం ర్యాలీ నిర్వహిస్తున్న దళితులు (ఫైల్)
సాక్షి, అమరావతి బ్యూరో/తాడికొండ: ఒక ప్రాంతం, ఒక వర్గం వారికే మేలు జరిగేలా.. దళిత, పేద వర్గాలను అన్యాయానికి గురిచేసేలా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారంటూ రాజధాని ప్రాంత దళితులు, పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకైక రాజధానితో లబ్ధి పొందాలని చూస్తూ ఇతర ప్రాంతాలకు ద్రోహం చేయాలనుకోవడం తగదని మండిపడుతున్నారు. తమకు ఇళ్ల స్థలాలు చేతికొచ్చే సమయంలో అడ్డుకోవడంపైనా ఆగ్రహోదగ్రులవుతున్నారు. అందుకే వారు టీడీపీ నేతల వైఖరిపై కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు.
పేదల భూములను కొట్టేసిన ‘పచ్చ’ రాబందులు
తరతరాలుగా వస్తున్న అసైన్డ్, లంక భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇంతలో రాజధాని అమరావతి రూపంలో వచ్చిన ‘పచ్చ’ రాబందులు ఆ భూములపై కన్నేశారు. రాజధానికి ప్రభుత్వం ఆ భూములను ఉచితంగా తీసేసుకుంటుందని, తమకు విక్రయిస్తే ఎకరాకు రూ.లక్షల్లో ఇస్తామని ప్రలోభపెట్టారు.. బెదిరించారు. ఇలా గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లోని దళితులు, పేదల భూములను టీడీపీ నేతలు కారుచౌకగా కొట్టేశారు. వాటిని టీడీపీ ప్రభుత్వానికి పూలింగ్‌కు ఇచ్చేసి ఎకరానికి రూ.కోట్ల చొప్పున దండుకున్నారు.
దళితుల ఆగ్రహానికి కారణాలివీ..
కాగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు 30 లక్షల ఇళ్ల స్థలాలు, రాజధాని అమరావతి ప్రాంతంలో 60 వేల మందికి ఇవ్వనున్న తరుణంలో టీడీపీ నేతలు కోర్టుల ద్వారా అడ్డుకున్నారు. అంతేకాకుండా ప్రైవేటు విద్యాసంస్థల్లో పిల్లలను చదివించుకోలేని తమలాంటి వారి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే దానిపైనా కోర్టుకెక్కడంపై ఆవేదన చెందుతున్నారు. ఇలా తమ భూములను అతి తక్కువ ధరకే లాక్కోవడంతోపాటు తమ అభ్యున్నతికి అడ్డుపడుతున్న టీడీపీ నేతల తీరుకు నిరసనగా దళిత సంఘాలు.. బహుజన పరిరక్షణ సమితి పేరిట మూడు రాజధానులకు మద్దతుగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో 24 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాల నుంచి భారీ మద్దతు లభిస్తోంది.
దళిత సంఘాలు ఏమంటున్నాయంటే..
► పేదలకు ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల స్థలాలకు అడ్డుపడుతూ, ఇంగ్లిష్ మాధ్యమానికి అడ్డుపడుతూ టీడీపీ కోర్టుల్లో వేసిన కేసులను ఉపసంహరించుకోవాలి.
► పేదలు, దళితులకు రాజధానిలో ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపుపై వామపక్షాలు, జనసేన పార్టీలు ద్వంద్వ వైఖరిని వీడాలి.
► పరిపాలన వికేంద్రీకరణతోనే అన్ని వర్గాల అభివృద్ధి. ఒక సామాజికవర్గం కోసం అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలంటూ చంద్రబాబు చేస్తున్నది కృత్రిమ ఉద్యమం.
కోర్టులకెక్కడం దుర్మార్గం
రాజధానిలో మాలాంటి పేదలకు ఇవ్వడానికి వీల్లేదంటూ టీడీపీ వాళ్లు కోర్టులకెళ్లడం దుర్మార్గం. మాలాంటి వారికి సెంటు భూమి కూడా ఇవ్వడానికి వీల్లేదన్నారంటే కులవివక్ష కొనసాగుతున్నట్టే. పెద్దలు తప్ప పేదలు గూడు కట్టుకుని బతకడానికి వీల్లేదా?
–రెడ్డిబోయిన మరియకుమారి, దళిత మహిళ
దళితులను అణగదొక్కుతున్నారు
చంద్రబాబు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని దళితులను అణగదొక్కుతున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా, ఇంగ్లిష్ మీడియం చదువులు అందకుండా కోర్టుల ద్వారా అడ్డుపడడం దుర్మార్గం.
– కోడి సుజ్ఞాన్, దళిత వర్గాల ఫెడరేషన్, పశ్చిమ గోదావరి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment