చిత్తూరు జిల్లా నిమ్మనపల్లెలో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు
పాలన వికేంద్రీకరణ.. మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల ర్యాలీలు, ప్రదర్శనలు సాగాయి. ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుపడుతున్న ప్రతిపక్షాల తీరును ఈ సందర్భంగా ప్రజలు నిరసించారు. ప్రాంతీయ విభేదాలను సృష్టిస్తూ.. ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు దిగటం చంద్రబాబుకు తగదని హితవు పలికారు.
– సాక్షి నెట్‌వర్క్
వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం
చిత్తూరు జిల్లా నిమ్మనపల్లెలో విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
బుర్రిపాలెంలో రిలే దీక్షలు
పాలన వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో సోమవారం రిలే దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు మాట్లాడుతూ.. 2 వేల జనాభాకో సచివాలయం, 50 కుటుంబాలకో గ్రామ/వార్డు వలంటీర్‌ను ఏర్పాటు చేసి ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. టీడీపీ నేతలు అమరావతి రాజధాని పేరుతో ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని, ప్రజలను రెచ్చగొట్టే చర్యలకు దిగటం శోచనీయమని అన్నారు.
విశాఖలో ర్యాలీ
మూడు రాజధానులకు మద్దతుగా విశాఖలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. దళిత, గిరిజన, ముస్లిం, క్రైస్తవ, మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ‘థ్యాంక్యూ సీఎం సార్’ పేరిట ఈ కార్యక్రమం జరిగింది. దీనికి హాజరైన ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ మాట్లాడుతూ.. రాజధానికి కావాల్సిన వనరులు విశాఖలో సమృద్ధిగా ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment