సాక్షి, అమరావతి: మూడు ప్రాంతాల ప్రజలూ ఒకేమాటపై నిలబడ్డారు. ఒకే తీర్పు ఇచ్చారు. ప్రాంతాలు వేరైనా తమ అభిమతం ఒకటేనని మరోసారి చాటారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలనను వికేంద్రీకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ ప్రజలు మరోసారి సంపూర్ణంగా ఆమోదించారు. శ్రీకాకుళం జిల్లా మొదలుకొని అనంతపురం జిల్లా వరకూ ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రజలు మూడు రాజధానులకు సంపూర్ణ మద్దతును పునరుద్ఘాటిస్తూ ఇచ్చిన తీర్పే ఇందుకు తార్కాణం. ప్రాంతీయ విద్వేషాల్ని రగిల్చి.. ఉనికి చాటుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సాగిస్తున్న కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పార్టీని తిరస్కరించారు. శాసన రాజధాని ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ.. కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం జిల్లాలోనూ.. న్యాయ రాజధాని కర్నూలు జిల్లాలోనూ టీడీపీ ఘోర పరాజయం పాలవడమే ఇందుకు నిదర్శనం. పంచాయతీ, పురపాలక ఎన్నికల్లోనూ ఓటర్లు ఇదే తరహాలో తీర్పు ఇవ్వడం గమనార్హం.
సమగ్రాభివృద్ధికే ఓటు
పరిపాలనను వికేంద్రీకరించడం ద్వారా రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం సీఎం వైఎస్ జగన్ ప్రణాళిక రచించారు. అందులో భాగంగానే అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించారు. ఆ మేరకు శాసనసభలో బిల్లును ఆమోదించారు. మూడు రాజధానుల వల్ల పరిపాలనతోపాటూ అభివృద్ధిని వికేంద్రీకరించడం ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని మేధావులు ప్రశంసించారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీని రక్షించుకునేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తనదైన రీతిలో కుట్రలకు తెరలేపారు.
ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి.. రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని భావించారు. కానీ.. పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు ఆటలను ఓటర్లు సాగనివ్వలేదు. శాసన రాజధాని ఉన్న గుంటూరు–కృష్ణా జిల్లాల్లో రెండు జిల్లా పరిషత్‌లను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 99 శాతానికి పైగా మండల పరిషత్‌లను దక్కించుకుంది. న్యాయ రాజధాని రాయలసీమలో టీడీపీ ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా వైఎస్సార్‌సీపీకి ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టారు. కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం ఉన్న ఉత్తరాంధ్రలో టీడీపీని ప్రజలు ఛీకొట్టి.. వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టారు. ప్రాంతాలకు అతీతంగా ఇదే తీర్పు ఇచ్చారు. 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడం.. 99.95 శాతం మండల పరిషత్‌లను దక్కించుకోవడమే ఇందుకు నిదర్శనం.
పంచాయతీ, పురపాలక ఎన్నికల్లోనూ వికేంద్రీకరణకే మద్దతు
పంచాయతీ, పురపాలక ఎన్నికల్లో ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా చంద్రబాబు ప్రసంగాలు చేశారు. కానీ.. మూడు ప్రాంతాల ప్రజలు ఆ ఆటలను సాగనివ్వలేదు. పంచాయతీ ఎన్నికల్లో 3 ప్రాంతాల్లో 13,081 పంచాయతీలకుగానూ 10,536 (80.51%) పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను గెలిపించారు. టీడీపీ మద్దతుదారులను 16.06% (2,100) పంచాయతీలకే పరిమితం చేశారు. మిగిలిన పక్షాలను 445 పంచాయతీల్లో గెలిపించారు.
పురపాలక ఎన్నికల్లో 75కు 74 మునిసిపాలిటీలను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంది. ఎన్నికలు జరిగిన 12 నగరపాలక సంస్థల్లోనూ వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది. శాసన రాజధాని ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం నగరపాలక సంస్థలతోపాటూ అన్ని మునిసిపాలిటీలను వైఎస్సార్‌సీపీకి కట్టబెట్టడం ద్వారా ప్రజలు వికేంద్రీకరణకు మద్దతు పలికారు. కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం ఉన్న ఉత్తరాంధ్రతోపాటూ న్యాయ రాజధాని కర్నూలు ఉన్న రాయలసీమలోనూ మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో వైఎస్సార్‌సీపీకి విజయాన్ని కట్టబెట్టడం ద్వారా మూడు రాజధానులకు మద్దతు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment