వికేంద్రీకరణతోనే ప్రగతి బాట | Relay Strikes Started to Support Three Capitals | Sakshi
Sakshi News home page

వికేంద్రీకరణతోనే ప్రగతి బాట

Published Wed, Feb 5 2020 5:45 AM | Last Updated on Wed, Feb 5 2020 5:45 AM

Relay Strikes Started to Support Three Capitals - Sakshi

గుంటూరు జిల్లా పొన్నూరులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య

పాలన వికేంద్రీకరణకు మద్దతుగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షలు చేపట్టారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టి ప్రాంతీయ విభేదాలను సృష్టించేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై విద్యార్థులు, యువత, మహిళలు మండిపడ్డారు. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని ముక్తకంఠంతో నినదించారు. 
– సాక్షి నెట్‌వర్క్‌ 

వికేంద్రీకరణతో అభివృద్ధి 
ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు అంటూ గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో వివిధ ప్రజాసంఘాలు రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి. కార్యక్రమానికి ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య హాజరై సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ అమరావతిలో కార్పొరేట్‌ సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి సొమ్ములు దండుకున్న చంద్రబాబు కృత్రిమ ఉద్యమం నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో చేపట్టిన దీక్షలో ప్రజాసంఘాల నాయకులు వికేంద్రీకరణ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు.  

టీడీపీ తీరు దారుణం 
వికేంద్రీకరణకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లా రాజాంలోని అంబేడ్కర్‌ జంక్షన్‌ వద్ద విశ్రాంత ఉద్యోగులు రిలే దీక్షలు చేపట్టారు. కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. ఇదే జిల్లాలోని నరసన్నపేట, టెక్కలిలోనూ మూడు రాజధానులకు మద్దతుగా రిలే దీక్షలు ప్రారంభమయ్యాయి. విజయనగరం జిల్లా సాలూరులో చేపట్టిన దీక్షకు ఎమ్మెల్యే రాజన్నదొర మద్దతు పలికారు. విజయనగరంలో చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి సందర్శించి సంఘీభావం తెలిపారు. పార్వతీపురంలో మేధావులు, విద్యావేత్తలు మూడు రాజధానులకు మద్దతుగా రిలే దీక్షలు చేపట్టారు. ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొని సంఘీభావం తెలిపారు. కురుపాంలో వైఎస్సార్‌సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు ఆధ్వర్యంలో మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ర్యాలీ నిర్వహించారు.

గోదావరి జిల్లాల్లో..
పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ప్రగతి బాట పడతాయని వివిధ వర్గాల ప్రజలు పేర్కొన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, దేవరపల్లిలో దీక్షలు చేపట్టారు. ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, జి.శ్రీనివాసనాయుడు, తలారి వెంకట్రావు హాజరై సంఘీభావం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం, పి.గన్నవరం, ప్రత్తిపాడు తదితర ప్రాంతాల్లో రిలే దీక్షలు చేపట్టారు. ఎమ్మెల్యేలు కొండేటి చిట్టిబాబు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ హాజరై మద్దతు ప్రకటించారు. 

అందుకే.. చంద్రబాబు నాటకాలు
వికేంద్రీకరణకు మద్దతుగా కడప బస్టాండ్‌ సమీపంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లో రిలే దీక్షలు చేపట్టారు. దీక్షలో కూర్చున్న వారికి కమలాపురం ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు మద్దతు తెలిపారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ‘అమరావతి వద్దు–మూడు రాజధానులే ముద్దు’ అంటూ రిలే దీక్షలు చేపట్టారు. దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అమరావతి ముసుగులో చంద్రబాబు వర్గం వారు చేసిన భూకబ్జాలను కాపాడుకునేందుకే వికేంద్రీకరణను వ్యతిరేకిస్తూ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. చిత్తూరులో గాంధీ సర్కిల్‌ వద్ద స్థానిక ప్రజలు రిలే దీక్ష చేపట్టారు. వారికి సంఘీభావంగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ మూడు రాజధానులు ఏర్పాటు వల్ల అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. చిత్తూరు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పురుషోత్తంరెడ్డి తదితరులు దీక్షలో పాల్గొన్నారు.
కడపలో రిలే దీక్షలకు సంఘీభావం ప్రకటిస్తున్న ఎమ్మెల్యే పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement