రాజధానులపై చంద్రబాబు డ్రామా | Chandrababu Naidu Drama On AP Capital Issue | Sakshi
Sakshi News home page

ఆడలేక.. డెడ్‌లైన్‌

Published Tue, Aug 4 2020 4:23 AM | Last Updated on Tue, Aug 4 2020 7:46 AM

Chandrababu Naidu Drama On AP Capital Issue - Sakshi

ఇదో విచిత్ర వాదన! ఎక్కడైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత ఉంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం రాజకీయ ఆనవాయితీ. గతంలో బోఫోర్స్‌ అంశంపై లోక్‌సభలో ప్రతిపక్ష ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ ఎన్నోసార్లు రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలను ఎదుర్కొన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలే రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధపడాలని డిమాండ్‌ చేయడం విచిత్రంగా ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

సాక్షి, అమరావతి: ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాజకీయ కుట్రలు పన్నడంలో ఆరితేరిన విపక్ష నేత చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో వితండ వాదనకు దిగారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయడం చంద్రబాబుకే చెల్లిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమరావతిలో అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు అండ్‌ కో రాజీనామాలకు టీడీపీ ఎమ్మెల్యేలు ముందుకు రాకపోవడంతో ప్లేటు ఫిరాయించి వైఎస్సార్‌సీపీ శాసనసభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయడం ద్వారా రాజకీయ దివాళాకోరుతనాన్ని ప్రదర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే వికేంద్రీకరణతో సమగ్రాభివృద్ధి కోసం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలంతా సంపూర్ణంగా మద్దతిస్తున్నారు. దీంతో వారు రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నది సుస్పష్టం. తన రాజకీయ జీవితంలో తొలిసారి సవాల్‌ విసిరిన చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారా? ప్రభుత్వానికి  48 గంటల గడువు ఇచ్చిన ఆయన ఆ తరువాత ఏం చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఆయన అంతగా నమ్మితే..
మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చంద్రబాబు అంతగా నమ్మితే తన పార్టీ ఎమ్మెల్యేలతోనే రాజీనామా చేయించాలని పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే చాలు.  ఉప ఎన్నికల ఫలితమే ప్రజాతీర్పు అవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. 
మేనిఫెస్టోలోనే చెప్పిన వైఎస్సార్‌సీపీ..
► ‘వికేంద్రీకరణే’ తమ విధానమని వైఎస్సార్‌సీపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలోనే విస్పష్టంగా పేర్కొంది. ‘రాజధానిని ఫ్రీ జోన్‌ (అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉండే విధంగా)గా గుర్తిస్తూ నిజమైన వికేంద్రీకరణే లక్ష్యంగా రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం’ అని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పార్టీ తెలిపింది. 

ఆమోదించిన అన్ని ప్రాంతాల ప్రజలు
రాష్ట్ర సమగ్రాభివృద్ధి పట్ల తన ప్రణాళికను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందే ప్రజల ముందుంచారు. అందుకు అమరావతితో సహా అన్ని ప్రాంతాల ప్రజలు ఆమోదించి వైఎస్సార్‌సీపీకి అఖండ విజయాన్ని చేకూర్చారు. 

వ్యతిరేకిస్తే రాజకీయ సమాధే!
► మూడు రాజధానులకు వ్యతిరేకంగా తమ పదవులకు రాజీనామా చేయాలన్న ప్రతిపాదనను టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకంగా తానెందుకు రాజీనామా చేస్తానని రాయలసీమలోని ఓ సీనియర్‌ నేత సూటిగానే ప్రశ్నించినట్లు సమాచారం. కార్య నిర్వాహక రాజధానిగా విశాఖపట్నం ఎంపిక నిర్ణయాన్ని వ్యతిరేకించి తమ రాజకీయ జీవితాన్ని సమాధి చేసుకోలేమని నగరానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. మూడు రాజధానుల నిర్ణయం పట్ల తమ జిల్లాల్లో పూర్తి మద్దతు లభిస్తోందని శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు చంద్రబాబు వద్ద  కుండబద్దలు కొట్టారు. ఇక కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పార్టీలో మిగిలిన కొద్దిమంది కూడా చంద్రబాబు ప్రతిపాదనను పట్టించుకోలేదు. 

ఎన్నికల హామీలను విస్మరించిన చరిత్ర బాబుదే
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత తుంగలో తొక్కడం చంద్రబాబు నైజమని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామని, రూ.2కే కిలో బియ్యం పథకాన్ని పునరుద్ధరిస్తామని1994 ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ హామీ ఇచ్చింది. ఎన్టీఆర్‌ ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆ హామీని అమలు చేశారు. అయితే ఆయన్ని కుట్రతో కూలదోసి సీఎం అయిన చంద్రబాబు మాత్రం ఆ రెండు హామీలను తుంగలో తొక్కారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారు. రేషన్‌ దుకాణాల ద్వారా సరఫరా చేసే బియ్యం ధర కిలో రూ.5.50కి పెంచి పేదల నడ్డి విరిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement