Kondaveeti Vagu
-
పోటెత్తిన కొండవీటి వాగు
గత మూడు రోజులుగా గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మంగళగిరి మండలంలోని నీరుకొండ, కురగల్లు గ్రామాల మధ్య ఉన్న కొండవీటి వాగు పోటెత్తింది. ఆదివారం ఉదయానికి కొండవీటి వాగు వరద నీటితో కురగల్లు నీరుకొండ గ్రామాల మధ్య రోడ్డు మునిగిపోయింది. రెండు గ్రామాల మధ్య ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చుట్టూ వరదనీరు చేరింది. మంగళగిరి నుంచి నీరుకొండ మీదుగా పెదపరిమి, తాడికొండ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ప్రవాహం అంచనా వేయక కొందరు ద్విచక్ర వాహనదారులు కురగల్లు నీరుకొండ రోడ్డులో ప్రయాణించడంతో వాహనాలు పూర్తిగా మునిగిపోయాయి. స్థానిక యువకుల సాయంతో వాహనాలను బయటకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో రెండు రోజులు ఇదే వర్షం కొనసాగితే మరింత ప్రమాదం ముంచుకువచ్చే అవకాశముందని నీరుకొండ, కురగల్లు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. – మంగళగిరి -
రాజధాని ప్రాంతంలోకి ఎగదన్నిన కృష్ణా వరద
సాక్షి,అమరావతి/తాడేపల్లిరూరల్/పటమట(విజయవాడ తూర్పు): కృష్ణా నదిలో వరద ప్రవాహం ఆరు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువైతే రాజధాని ప్రాంతాన్ని వరద ముంచెత్తుతుందన్న విషయం మరోసారి రుజువైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పది గంటల వరకూ ప్రకాశం బ్యారేజీలోకి గరిష్టంగా 7.03 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం రావడంతో ఉండవల్లి అవుట్‌ఫాల్ స్లూయిజ్ గుండా కృష్ణా వరద నీరు కొండవీటివాగులోకి ఎగదన్నింది. ఈ వరద నీరు రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి, పెనుమాకల్లోని పొలాలను ముంచెత్తింది. కొండవీటివాగు వరద 5 వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోయడానికి గతంలో టీడీపీ సర్కార్ రూ. 237 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పథకం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 2009, అక్టోబర్ 5న ప్రకాశం బ్యారేజీకి గరిష్టంగా 11,10,404 క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ తరహాలో ఇప్పుడు వరద వచ్చి ఉంటే.. రాజధానిలోని 29 గ్రామాల్లో 71 శాతానికిపైగా ముంపునకు గురయ్యేవని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకునే తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల పరిధిలో రాజధాని నిర్మాణం ఏమాత్రం అనుకూలమైనది కాదంటూ అప్పట్లో శివరామకృష్ణన్ కమిటీ, పర్యావరణవేత్తలు, చెన్నై–ఐఐటీ, జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) స్పష్టం చేశాయని ఆ నిపుణులు గుర్తు చేస్తున్నారు. దేవినేని ఉమా హడావుడి కొండవీటివాగు ఎత్తిపోతల వద్ద టీడీపీ నేత దేవినేని ఉమా హడావుడి చేశారు. ఇరిగేషన్ అధికారులు మోటార్లను ఆఫ్ చేసిన తర్వాత అక్కడకి చేరుకున్న ఆయన రాజధాని మునిగిపోతుంటే ఇంజన్లు ఆఫ్ చేస్తారా అంటూ హంగామా సృష్టించారు. మోటార్లు ఆన్ చేస్తే కృష్ణానదిలో నుంచి వరదనీరు ఉధృతంగా వస్తోందని అక్కడి సిబ్బంది చెప్పినా వినకుండా మళ్లీ మోటార్లు ఆన్‌చేయించారు. చేసిన తప్పు కప్పిపుచ్చుకునేందుకు దేవినేని ఉమా హడావుడి చేస్తున్నారని అక్కడ ఉన్న వారు విమర్శించారు. ఇదో అవినీతి గోడ.. విజయవాడ ప్రకాశం బ్యారేజీ దిగువున సుమారు 10 వేల కుటుంబాలు నివాసాలుండే ప్రాంతాన్ని వరద ముప్పు నుంచి రక్షించడానికి రిటైనింగ్ వాల్ నిర్మించడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అనుమతి ఇచ్చారు. ఆయన మరణానంతరం ఈ ప్రతిపాదన అటకెక్కింది. గత ప్రభుత్వం హయాంలో ఈ వాల్ నిర్మాణం జరిగింది. 11.5 మీటర్ల ఎత్తున 2.3 కిలోమీటర్ల పరిధిలో రూ. 164 కోట్ల అంచనాతో తమకు అనుకూలమైన కాంట్రాక్టర్‌తో పనులు చేయించారు. లెవలింగ్ లేకుండా నిర్మాణం, నాసిరకమైన మెటీరియల్ వల్ల ఆ గోడకు చిల్లుపడింది. ఇప్పుడు వరద నీరు నివాసాలను ముంచెత్తింది. కొండవీటివాగుకు వరద వచ్చి ఉంటే.. ► ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా గరిష్ట వరద నీటిమట్టం 21.50 మీటర్లు. కొండవీటివాగు గరిష్ట వరద నీటిమట్టం 17.50 మీటర్లు. అంటే.. కృష్ణా నది గరిష్ట వరద నీటిమట్టం కంటే కొండవీటివాగు వరద నీటిమట్టం దిగువన ఉంటుంది. ► సోమవారం కృష్ణా నదిలో వరద పెరగడంతో దిగువన ఉన్న కొండవీటివాగులోకి నీరు ఎగదన్నింది. ► కొండవీటివాగు వరద ప్రవాహాన్ని ప్రకాశం బ్యారేజీలోకి ఎత్తిపోసి, రాజధానికి ముంపు ముప్పును తప్పించడానికి టీడీపీ సర్కార్ నిర్మించిన ఎత్తిపోతల ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ► సోమవారం ఆరు మోటార్ల ద్వారా రెండు వేల క్యూసెక్కులను ఎత్తిపోసినా.. కృష్ణా నదిలోని నీరు స్లూయిజ్ ద్వారా కొండవీటివాగులోకి మళ్లీ వచ్చింది. ► రాజధాని గ్రామాల్లో ప్రవహించే కొండవీటివాగు పరీవాహక ప్రాంతంలో వర్షాలు లేకపోవడం వల్ల సోమవారం ఆవాగులో వరద ఉధృతి లేదు. ఒకవేళ వరద ప్రవాహం ఉంటే.. వాగు పరివాహక ప్రాంతం 221.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో ముంపు ముప్పు తీవ్రంగా ఉండేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
భయం గుప్పిట్లో రాజధాని గ్రామాలు
సాక్షి, అమరావతి: గత రెండు రోజులుగా కరుస్తున్న వర్షాలకు ఏపీ రాజధాని ప్రాంతం నీట మునిగింది. కొండవీటి వాగులో వరద ఉధృతి గంటగంటకు పెరుగుతుండటంతో హైటెన్షన్ నెలకొంది. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నీరుకొండ వద్ద రాజధానికి ఇచ్చిన భూముల్లో భారీగా వరద నీరు చేరింది. గుంటూరు జిల్లా రాయపూడిలో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరుతుంది. దీంతో ప్రజలు భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో పొలాలు నీట మునిగాయి. పెడపరిమి వద్ద కొటేళ్ల వాగు పొంగి ప్రవహిస్తుంది. గుంటూరు, సచివాలయం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం రాత్రి వర్షం పడితే గ్రామల్లోకి వరద నీరు చేరుతుందని రాజధానివాసులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సచివాలయంలో వాటర్ లీకేజీతో మంత్రుల ఛాంబర్లలోకి నీళ్లు చేరాయి. సీఎం సమీక్ష మరోవైపు అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. వర్షాల కారణంగా రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి పంపుతామన్నారు. -
ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
-
ఏపీ అప్డేట్స్: అమరావతిలో హైటెన్షన్
సాక్షి, అమరావతి : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రమంతటా జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. కుండపోతగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి, ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవి.. అమరావతిలో హైటెన్షన్ కొండవీటి వాగులో గంటగంటకు వరద ఉధృతి పెరుగుతోంది. నీరుకొండ వద్ద రాజధాని భూముల్లోకి భారీగా వరద నీరు చేరింది. పెడపరిమి వద్ద కొటేళ్ల వాగు పొంగి ప్రవహిస్తుండటంతో గుంటూరు- సచివాలయం మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మళ్లీ వర్షం పడితే చాలా గ్రామాలు నీట మునిగిపోతాయని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో పంటపొలాలు నీట మునిగాయి. జల దిగ్బంధంలో దేవిపట్నం తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో దేవిపట్నం, పోచమ్మగండి వద్ద గోదావరి నీటిమట్టం భారీగా పెరిగింది. గిరిజన గ్రామాల ప్రజలు బిక్కు బిక్కు మంటు గడుపుతున్నారు. అంగుళూరు, వీరవరంలంక గ్రామస్తులను పునరావాస కేంద్రానికి తరలించారు. సీతానగరం మండలం ములకల్లంక గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. దేవిపట్నంలో మొదటి ప్రమాద హెచ్చరికను సబ్ కలక్టర్ వినోద్ కుమార్ జారీ చేశారు. దేవిపట్నంలోని 31 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. తోటపల్లి బ్యారేజీకి వరద.. తోటపల్లి బ్యారేజీకి వరద ఉదృతి పెరుగుతోంది. ఇన్‌ఫ్లో 28 వేల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 23వేల క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు నాగావళి నదిపరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక భారీ వర్షాలతో రాజమండ్రిలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా వరద నీరు వచ్చిచేరడంతో ధవళేశ్వరం బ్యారేజ్ నీటి మట్టం 13.75 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. 13 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దాదాపు 1000 మందికి పునరావాస కేంద్రాలకు తరలించారు. 18 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. రాజధాని ప్రాంతంలో రెడ్ అలర్ట్ భారీ వర్షాలతో అమరావతిలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కొండవీటి వాగు ఉప్పొంగే అవకాశం ఉండటంతో రాష్ట్ర సచివాలయానికి వరదముప్పు పొంచి ఉందని భావిస్తున్నారు. ముంపు ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం ఉండటంతో ఈ విషయంలో ఏం చేయాలనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. కొండవీటి వాగు వరదను ఎటు మళ్లించాలనే దానిపై తర్జనభర్జన అవుతున్నారు. ప్రస్తుతం కొండవీటి వాగు వద్ద తాడికొండ పోలీసులు పహరా కాస్తున్నారు. ఉభయ గోదావరి ,కృష్ణా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్టా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో సోమవారం మూడు జిల్లాల్లోనూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాలు నీటమునిగాయి. వర్షాల కారణంగా గోదావరి జిల్లాల్లో ఇద్దరు మృతిచెందారు. కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. విశాఖ అర్బన్‌లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం బ్యారేజీలో గరిష్ట స్థాయి నీటి మట్టం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీ నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. బ్యారేజీ ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు 70 గేట్లను ఎత్తేశారు. 65వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. విజయవాడలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో విజయవాడలో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. అప్రమత్తమైన నగరపాలక సిబ్బంది మోటర్ల సాయంతో వర్షపు నీటిని తోడేస్తున్నారు. విజయ వాడ వన్‌టౌన్‌లో ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు వచ్చిచేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బందర్ రోడ్డు, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం, ఆర్టీసీ కాంప్లెక్స్, జమ్మిచెట్టు సెంటర్ రోడ్లన్ని జలమయమయ్యాయి. అస్తవ్యస్తంగా మారిన గాంధీబొమ్మ సెంటర్ భారీ వర్షం కారణంగా విజయవాడలోని వన్‌టౌన్ గాంధీబొమ్మ సెంటర్ అస్తవ్యస్తంగా మారింది. చేపలమార్కెట్, ఊర్మిళనగర్, చిట్టనగర్ ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. మోకాళ్ల లోతు నీళ్లలో నడవటానికి ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకారులకు హెచ్చరిక వాయవ్య బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిక అల్పపీడనం ఇవాళ మరింత బలపడింది. దీంతో కోస్తాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తీరం అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది. సముద్రపు అలలు సాధారణం కంటే 4మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. కొట్టుకు పోయిన తమ్మిలేరు కాజ్వే కృష్ణా జిల్లా చాట్రాయి మండలం చిన్నంపేట వద్ద తమ్మిలేరు కాజ్‌వేపై వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో చాట్రాయి- చింతలపూడి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముసునూరు మండలం బలివే వద్ద వరద ఉధృతికి తమ్మిలేరు కాజ్వే కొట్టుకుపోయింది. కృష్ణా- పశ్చిమగోదావరి జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చాట్రాయి మండలంలో అత్యధికంగా 19.10సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నూజివీడు 11.50 సెంటిమీటర్లు, ముసునూరు మండలంలో 9.2 సెంటిమీటర్లు, ఆగిరిపల్లి మండలంలో 6సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. -
అమరావతి పర్యవరణ పరిరక్షణకు కమిటీ
-
ఏపీ రాజధాని నిర్మాణంపై ఎన్జీటీ తుదితీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ప్రిన్సిపల్ బెంచ్ శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. రాజధాని నిర్మాణానికి ఎన్జీటీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అయితే పర్యావరణం దెబ్బతినకుండా, నిబంధనలకు లోబడే రాజధాని నిర్మాణాలు చేపట్టాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు సంబంధించి రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని ఎన్జీటీ ఆదేశించింది. అంతేకాకుండా నిర్మాణ పనులపై నెలనెలా సమీక్షించాలని సూచించింది. పర్యావరణ పరిరక్షణకు సూపర్వైజర్, ఇంప్లిమేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్, సభ్యులు జస్టిస్ రఘువేంద్ర రాథోర్, జస్టిస్ బిక్రమ్‌సింగ్ సజ్వాన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. అలాగే కొండవీటి వాగు దిశను మార్చరాదని, కరకట్టలను ముందుకు జరపవద్దని స్పష్టం చేసింది. అలాగే పర్యావరణ శాఖ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని ఎన్జీటీ పేర్కొంది. రాజధాని నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్ట ఉల్లంఘనకు పాల్పడుతుండటంపై పి.శ్రీమన్నారాయణ, మాజీ ఐఏఎస్ అధికారి ఈఎఎస్ శర్మ, బొలిశెట్టి సత్యనారాయణ తదితరులు 2015 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవలే వాదనలు ముగించిన ఎన్జీటీ తీర్పును వాయిదా వేసిన విషయం తెలిసిందే. వాటిపై ఇవాళ ఉదయం తుది తీర్పును వెలువరించింది. ఎన్జీటీ తీర్పును స్వాగతించిన శ్రీమన్నారాయణ ఏపీ రాజధాని నిర్మాణంపై ఎన్జీటీ ఇచ్చిన తీర్పును పిటిషనర్ శ్రీమన్నారాయణ స్వాగతించారు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలను ఆపడంలో తొలిమెట్టు ఎన్జీటీ తీర్పు అన్నారు. కొండవీటి వాగు దిశను మార్చొద్దనడం వల్ల 15వేల ఎకరాలకు ముప్పు తప్పిందన్నారు. రెండు కమిటీల నియామకంతో ప్రభుత్వ ఇష్టారాజ్యం కుదరదని, పంటలు పండే భూములను కాపాడేవరకూ తన పోరాటం ఆగేది లేదని శ్రీమన్నారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబుకు చెంపపెట్టు: ఎమ్మెల్యే ఆర్కే ఎన్జీటీ తీర్పు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెంపపెట్టు లాంటిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్జీటీ తీర్పుతో అయినా సీఎం తన అక్రమ నివాసాన్ని ఖాళీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణానది పరిరక్షణను సీఎం ఇంటి నుంచే ప్రారంభించాలని అన్నారు. కొండవీటి వాగును తమకు అనుకూలంగా మార్చుకోవాలనే టీడీపీ కుట్రలకు ఎన్జీటీ బ్రేక్ వేసిందని ఆర్కే పేర్కొన్నారు. -
అమరావతి ఎలా ఉంటుంది?
రెండేళ్లుగా తేలని ప్రభుత్వ కాంప్లెక్స్ డిజైన్ల వ్యవహారం టెండర్లు ఖరారైనా మొదలుకాని సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు హడావుడి నిర్ణయాలు, ప్రణాళికా లోపమే కారణం పూర్తిస్థాయి డిజైన్లు సిద్ధమయ్యేదెన్నడో? సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరిట రెండున్నరేళ్లుగా హడావుడి కొనసాగుతున్నా ఇంతవరకూ ఒక్క ప్రాజెక్టయినా పురుడు పోసుకోలేదు. శాశ్వత నిర్మాణాలకు ఇంకా డిజైన్లే ఖరారు కాలేదు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవన సముదాయం సైతం ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. తొందరపాటు నిర్ణయాలు, ప్రణాళికా లోపం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. 2014 సెప్టెంబర్ 3న రాజధాని ప్రాంతాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత మూడు నెలలకు సీఆర్డీఏ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించింది. 2015 జనవరిలో భూ సమీకరణ తంతును ప్రారంభించింది. 33 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించినట్లు ప్రకటించింది. అదే సంవత్సరం అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోదీlచేతుల మీదుగా గుంటూరు జిల్లా ఉద్ధండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరగ్గా డిసెంబర్ 26న రాజధాని మాస్టర్ ప్లాన్లను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, తాత్కాలిక సచివాలయం మినహా క్షేత్రస్థాయిలో ఇంతవరకూ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ భవనాలుండే అత్యంత కీలకమైన ప్రభుత్వ కాంప్లెక్స్ డిజైన్లు ఖరారు చేయడానికి ప్రభుత్వం సంవత్సరం నుంచి ఆపసోపాలు పడుతోంది. విదేశీ ఆర్కిటెక్ట్లతోపాటు ఇక్కడి విద్యార్థులను కూడా డిజైన్ల రూపకల్పనలో భాగస్వాముల్ని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా నిర్ణయించారు. ఈ డిజైన్లు ఖరారైతే వాటిని పూర్తిస్థాయిలో రూపొందించేందుకు కనీసం సంవత్సరం పడుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. పూర్తిస్థాయి డిజైన్లు ఎప్పటికి సిద్ధమవుతాయి? అసలు ఈ కాంప్లెక్స్ నిర్మాణం మొదలయ్యేది ఎప్పుడో అంతుబట్టడం లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు బ్రేక్ అమరావతిని బయటి ప్రపంచానికి అనుసంధానించే కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి టెండర్లు ఖరారైనా ఇంతవరకూ ప్రారంభం కాలేదు. ఐదో నంబరు జాతీయ రహదారిపై కనకదుర్గ వారధి నుంచి సీడ్ రాజధాని వరకూ 22 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన ఈ రోడ్డు మొదటి ప్యాకేజీ పనుల్ని రూ.250 కోట్లకు రెండు నెలల క్రితం ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. త్వరలో పనులు ప్రారంభమవుతాయనగా నాలుగు లైన్ల ఈ రహదారిని ఎనిమిది లైన్లుగా మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించడంతో ఈ ప్రాజెక్టుకు బ్రేకు పడింది. ఏడు రోడ్ల డిజైన్లూ అంతే.. కీలకమైన ఏడు రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని ఆరు నెలల నుంచి చెబుతున్నా అది ఆచరణలోకి రాలేదు. ఆ రోడ్ల డిజైన్లను తరచూ మారుస్తుండడంతో టెండర్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు సైతం అతీగతీ లేకుండా పోయాయి. కొండవీటి వాగు వరద నియంత్రణ, జల మార్గాల అభివృద్ధికి సంబంధించిన డిజైన్ల రూపకల్పన బాధ్యతను నెదర్లాండ్స్ కన్సల్టెన్సీకి అప్పగించినా అవి ఇంకా రాలేదు. కీలకమైన గ్రామాల్లో లేఔట్ల అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది. ప్లాట్ల పంపిణీ పేరుతో రైతులకు పత్రాలు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో భూమిని చదును చేసే పనే ఇంకా పూర్తి కాలేదు. -
పరిపాలన అనుమతులివ్వలేదు
కొండవీటి వాగుపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సాక్షి, విజయవాడ: కొండవీటి వాగు వరద నీటి ఎత్తిపోతల పథకానికి ఇంకా పరిపాలన అనుమతులివ్వలేదని, అందువల్ల అవినీతి జరిగే అవకాశం లేదని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. ఆదివారం విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి ఎస్ఈ, సీఈలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాతే పరిపాలన అనుమతులిస్తామన్నారు. కొండవీటి వాగుకు వచ్చే వరదనీటిని కృష్ణానదికి లేదా బకింగ్‌హామ్ కాలువకు ఎలా పంపాలనే విషయంపై ఇంజనీర్లు ఒక ప్రతిపాదన తయారుచేసి ప్రభుత్వానికి పంపితే.. దీనిపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. -
కొండవీటి వాగులో అవినీతి అనకొండ
టెండర్లు లేకుండా రూ. 400 కోట్ల పనులు! సాక్షి ప్రతినిధి, అమరావతి: టెండర్లు లేవు.. సాధ్యాసాధ్యాలను నిపుణులు పరిశీలించిందీ లేదు.. హైపవర్ కమిటీ అనుమతులు లేవు... కేవలం చినబాబు చెప్పారని రూ. 200 కోట్ల విలువైన కొండవీటివాగు వరద నీటి ఎత్తిపోతల పథకం పనులను ఊరూపేరూలేని కంపెనీకి కట్టబెట్టేశారు. మరో రూ.200 కోట్ల విలువైన పనులు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాజధాని పేరుతో అధికార పార్టీ సాగిస్తున్న అరాచక పాలనకు, అడ్డగోలు నిర్ణయాలకు ఇదో ప్రత్యక్ష నిదర్శనం. గరిష్టంగా రూ. 10 లక్షల విలువైన పనులను టెండర్లు లేకుండా నామినేషన్ మీద కావాల్సినవారికి కట్టబెట్టడానికి వీలుగా ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంతకుమించితే తప్పకుండా టెండర్లు పిలవాలనే నిబంధన ఉంది. రూ.100 కోట్ల కంటే ఎక్కువ విలువైన పనులకు టెండర్లు పిలిస్తే... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైపవర్ కమిటీ అనుమతి తప్పనిసరి. అయితే టెండర్లలో పోటీ పెరిగినా.. అడ్డగోలు వ్యవహారాలకు సీఎస్ అడ్డుకట్ట వేసినా.. అనుకున్న మేరకు ముడుపులు అందే అవకాశంలేదు. అందుకే గుట్టుచప్పుడు కాకుండా అనుకున్నవాడికి అనుకున్న రేటుకు కట్టబెట్టి.. భారీగా కమీషన్లు నొక్కేసేందుకు చినబాబు వ్యూహం రచించగా... సాగునీటి శాఖ అధికారులు అమలు చేసేశారు. రూ.200 కోట్ల పనులను నిబంధనలకు విరుద్ధంగా ‘అక్వాటెక్’ కంపెనీకి అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. టెండర్లు లేకుండా పనికానిచ్చేశారిలా.. కొండవీటి వాగు వరద నీటి ఎత్తిపోతలకు దాదాపు రూ. 200 కోట్ల విలువైన పంపులు, మోటార్లు సరఫరా చేయడానికి కొటేషన్లు ఇవ్వాలంటూ గుంటూరు ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈ కేవీఎల్‌ఎన్‌పీ చౌదరి ఈనెల 15న ఎంపిక చేసిన నాలుగైదు కంపెనీలకు లేఖలు రాశారు. అందులో పని విలువ కాని, సాంకేతికపరమైన పూర్తి వివరాలు కానీ ఇవ్వలేదు. దాదాపు ఆరు వేల క్యూసెక్కుల నీటిని 10-12 మీటర్లు ఎత్తిపోవడానికి వీలుగా పంపులు, మోటార్లు ఏర్పాటుచేయాలని మాత్రమే పేర్కొన్నారు. పంపులు, మోటార్లలో పేరెన్నికగన్న కంపెనీలు.. కిర్లోస్కర్, కేఎస్బీ, విలో, ఫ్లోమోర్ లాంటి కంపెనీలకు లేఖలే రాయకపోవడం గమనార్హం. ఎస్ఈ లేఖకు మూడు కంపెనీలు స్పందించాయి. తమిళనాడుకు చెందిన కంపెనీ ఈ-మెయిల్లో ప్రతిపాదనలు పంపించిందని సాకుగా చూపించి అనర్హత వేటు వేశారు. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీని కూడా ఏదో సాకు చూపించి అనర్హత వేటు వేశారు. ఫైనల్‌గా.. చినబాబుతో ముందస్తు అవగాహన ఉన్న అక్వాటెక్ కంపెనీకి పనులు కట్టబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్వాటెక్తో ముందస్తు ముడుపుల ఒప్పందం కుదిరిందని ఈనెల 8న ‘సాక్షి’లో వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. తాజా వ్యవహారం.. సాక్షి వార్తను ధ్రువీకరించినట్లయింది. ఈ వ్యవహారంలో దాదాపు రూ. 100 కోట్లు ముడుపులు చేతులు మారనున్నట్లు సాగునీటి శాఖలో ప్రచారం జరుగుతోంది. విద్యుత్ సరఫరా లేదు.. డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేస్తారట! దాదాపు ఆరు వేల క్యూసెక్కుల వరద నీటిని తోడటానికి వీలుగా ఏర్పాటుచేయనున్న మోటార్లకు 30 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా. అయితే అత్యవసరంగా అంత విద్యుత్ సరఫరా చేయడానికి అవకాశం లేదు. 220 కేవీ విద్యుత్ లైన్ నుంచి సరఫరా చేస్తే, లోడ్ సరిపోదని విద్యుత్ ఇంజనీర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేసి, విద్యుత్ సరఫరా అందించాలనే నిర్ణయానికి వచ్చారు. నార్లతాతారావు థర్మల్ పవర్ స్టేషన్(ఎన్టీటీపీఎస్) ఒక్కో యూనిట్లో 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అందులో ఏడో వంతు విద్యుత్ ఉత్పత్తిని డీజిల్ జనరేటర్లతో చేయాలని, దాంతో ఎత్తిపోతల మోటార్లు నడిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రాక్టికల్‌గా ఇది సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. భారీగా డీజిల్ వాడటం వల్ల కాలుష్యం భారీగా పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు డీజిల్ జనరేటర్లు సరఫరా చేసే కాంట్రాక్టును కూడా చినబాబు సూచించిన వ్యక్తికి ఇవ్వడానికి పావులు కదులుతున్నాయి. మోటార్లు, పంపులు సిద్ధమైన తర్వాత.. అత్యవసరం పేరిట డీజిల్ మోటార్లు భారీ ధరలకు తెచ్చిపెడతారని అధికార వర్గాలు తెలిపాయి. డీజిల్ జనరేటర్లు, ఇతర సివిల్ పనులు కనీసం రూ. 200 కోట్లుగా నిర్ధారించడానికి రంగం సిద్ధమయిందని ఆ వర్గాల సమాచారం. 45 రోజుల్లో సాధ్యమా? వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మించాలని ఆరు నెలల క్రితమే నిర్ణయం తీసుకున్నారు. దానికి కొండవీటి వాగువల్ల ముప్పు ఉందని ప్రభుత్వానికి అప్పుడే నివేదించారు. వరద నీటి ఎత్తిపోతలకు అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే.. ఇప్పుడు అత్యవసరంగా పనులు చేపట్టాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ అత్యవసరం పేరిట భారీ ధరలకు పనులు కట్టబెట్టి కమీషన్లు కొట్టేయడానికి అలవాటుపడిన పెదబాబు, చినబాబులు.. అదే దోపిడీ మార్గాన్ని ఇప్పుడూ అనుసరించారని సాగునీటి శాఖ అధికారులు చెబుతున్నారు. -
రాజధానికీ తాగునీరు
సాక్షి ప్రతినిధి, గుంటూరు : కొండవీటి వాగు ముంపు నివారణతోపాటు కొత్త రాజధాని ప్రాంతంలో తాగునీటి అవసరాలను తీర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపే దిశలో ఇంజనీర్లు ప్రాథమికంగా కొన్ని ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. డెల్టా ఆధునీకరణకు నియమించిన నిపుణుల కమిటీ అక్టోబరు నెలలో ఈ ప్రాంతంలో పర్యటించింది. కొండ వీటి వాగు ముంపు కారణంగా పంటలు, పరిసర గ్రామాలు నష్టపోతున్న విధానాన్ని పూర్తిగా అధ్యయనం చేసింది. ఈ మేరకు తయారు చేసిన నివేదిక ఆధారంగా హైదరాబాద్‌లో ఇరిగేషన్ శాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని 20 వేల హెక్టార్లలో పంటలను కొండవీటి వాగు వరద నుంచి కాపాడటమే కాకుండా, రాజధాని తాగునీటి అవసరాలను తీర్చాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా గుంటూరు సర్కిల్ ఇంజనీర్లకు కొన్ని సూచనలు చేయడంతో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ఆ మేరకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. కొండవీటి వాగు నుంచి వచ్చే వరద నీటిని రెండు చెరువుల్లో నిల్వచేసి, ప్రజల అవసరాల కోసం మళ్లించేం దుకు వీలుగా అంచనాలు తయారు చేస్తున్నారు. ఈ చెరువుల్లో దాదాపు రెండు టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రెండు చెరువుల నిర్మాణాలకు 1200 ఎకరాల భూమి అవసరం కాగలదని ప్రాథమికంగా అంచనా వేశారు. అనంతవరం కొండల నుంచి వాగుకు ఎక్కువగా వరద వస్తుండటంతో అక్కడకు సమీపంలోని వడ్డమాను చెరువుకు అనుకుని ఒక రిజర్వాయరు నిర్మించాలని, మరో రిజర్వాయరును దీనికి 18 కిలోమీటర్ల దూరంలో నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. కొండవీటివాగు నుంచి వచ్చే నీటిని రెండో చెరువులో నిల్వ చేసేందుకు అనుగుణంగా అంచనాలు తయారు చేస్తున్నారు. ఈ రెండు చెరువుల నిర్మాణాలకు అవసరమైన 1200 ఎకరాలను రైతుల నుంచి ఏ విధంగా తీసుకుంటారో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఇంజనీర్లు చెబుతున్నారు.