కొండవీటి వాగు ముంపు నివారణతోపాటు కొత్త రాజధాని ప్రాంతంలో తాగునీటి అవసరాలను తీర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
సాక్షి ప్రతినిధి, గుంటూరు : కొండవీటి వాగు ముంపు నివారణతోపాటు కొత్త రాజధాని ప్రాంతంలో తాగునీటి అవసరాలను తీర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపే దిశలో ఇంజనీర్లు ప్రాథమికంగా కొన్ని ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.
డెల్టా ఆధునీకరణకు నియమించిన నిపుణుల కమిటీ అక్టోబరు నెలలో ఈ ప్రాంతంలో పర్యటించింది. కొండ వీటి వాగు ముంపు కారణంగా పంటలు, పరిసర గ్రామాలు నష్టపోతున్న విధానాన్ని పూర్తిగా అధ్యయనం చేసింది. ఈ మేరకు తయారు చేసిన నివేదిక ఆధారంగా హైదరాబాద్‌లో ఇరిగేషన్ శాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది.
మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని 20 వేల హెక్టార్లలో పంటలను కొండవీటి వాగు వరద నుంచి కాపాడటమే కాకుండా, రాజధాని తాగునీటి అవసరాలను తీర్చాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా గుంటూరు సర్కిల్ ఇంజనీర్లకు కొన్ని సూచనలు చేయడంతో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి ఆ మేరకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు.
కొండవీటి వాగు నుంచి వచ్చే వరద నీటిని రెండు చెరువుల్లో నిల్వచేసి, ప్రజల అవసరాల కోసం మళ్లించేం దుకు వీలుగా అంచనాలు తయారు చేస్తున్నారు.
ఈ చెరువుల్లో దాదాపు రెండు టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
రెండు చెరువుల నిర్మాణాలకు 1200 ఎకరాల భూమి అవసరం కాగలదని ప్రాథమికంగా అంచనా వేశారు.
అనంతవరం కొండల నుంచి వాగుకు ఎక్కువగా వరద వస్తుండటంతో అక్కడకు సమీపంలోని వడ్డమాను చెరువుకు అనుకుని ఒక రిజర్వాయరు నిర్మించాలని, మరో రిజర్వాయరును దీనికి 18 కిలోమీటర్ల దూరంలో నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు.
కొండవీటివాగు నుంచి వచ్చే నీటిని రెండో చెరువులో నిల్వ చేసేందుకు అనుగుణంగా అంచనాలు తయారు చేస్తున్నారు.
ఈ రెండు చెరువుల నిర్మాణాలకు అవసరమైన 1200 ఎకరాలను రైతుల నుంచి ఏ విధంగా తీసుకుంటారో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఇంజనీర్లు చెబుతున్నారు.