
ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ చుట్టూ చేరిన కొండవీటి వాగు వరదనీరు
గత మూడు రోజులుగా గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మంగళగిరి మండలంలోని నీరుకొండ, కురగల్లు గ్రామాల మధ్య ఉన్న కొండవీటి వాగు పోటెత్తింది. ఆదివారం ఉదయానికి కొండవీటి వాగు వరద నీటితో కురగల్లు నీరుకొండ గ్రామాల మధ్య రోడ్డు మునిగిపోయింది. రెండు గ్రామాల మధ్య ఉన్న ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ చుట్టూ వరదనీరు చేరింది.
మంగళగిరి నుంచి నీరుకొండ మీదుగా పెదపరిమి, తాడికొండ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నీటి ప్రవాహం అంచనా వేయక కొందరు ద్విచక్ర వాహనదారులు కురగల్లు నీరుకొండ రోడ్డులో ప్రయాణించడంతో వాహనాలు పూర్తిగా మునిగిపోయాయి. స్థానిక యువకుల సాయంతో వాహనాలను బయటకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో రెండు రోజులు ఇదే వర్షం కొనసాగితే మరింత ప్రమాదం ముంచుకువచ్చే అవకాశముందని నీరుకొండ, కురగల్లు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
– మంగళగిరి