
సింగపూర్ కంపెనీలు ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్
రెండేళ్లుగా తేలని ప్రభుత్వ కాంప్లెక్స్ డిజైన్ల వ్యవహారం
టెండర్లు ఖరారైనా మొదలుకాని సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు
హడావుడి నిర్ణయాలు, ప్రణాళికా లోపమే కారణం
పూర్తిస్థాయి డిజైన్లు సిద్ధమయ్యేదెన్నడో?
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరిట రెండున్నరేళ్లుగా హడావుడి కొనసాగుతున్నా ఇంతవరకూ ఒక్క ప్రాజెక్టయినా పురుడు పోసుకోలేదు. శాశ్వత నిర్మాణాలకు ఇంకా డిజైన్లే ఖరారు కాలేదు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ భవన సముదాయం సైతం ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. తొందరపాటు నిర్ణయాలు, ప్రణాళికా లోపం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. 2014 సెప్టెంబర్ 3న రాజధాని ప్రాంతాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత మూడు నెలలకు సీఆర్‌డీఏ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించింది.
2015 జనవరిలో భూ సమీకరణ తంతును ప్రారంభించింది. 33 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించినట్లు ప్రకటించింది. అదే సంవత్సరం అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోదీlచేతుల మీదుగా గుంటూరు జిల్లా ఉద్ధండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరగ్గా డిసెంబర్ 26న రాజధాని మాస్టర్ ప్లాన్లను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, తాత్కాలిక సచివాలయం మినహా క్షేత్రస్థాయిలో ఇంతవరకూ ఒక్క అడుగూ ముందుకు పడలేదు.
హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ భవనాలుండే అత్యంత కీలకమైన ప్రభుత్వ కాంప్లెక్స్ డిజైన్లు ఖరారు చేయడానికి ప్రభుత్వం సంవత్సరం నుంచి ఆపసోపాలు పడుతోంది. విదేశీ ఆర్కిటెక్ట్‌లతోపాటు ఇక్కడి విద్యార్థులను కూడా డిజైన్ల రూపకల్పనలో భాగస్వాముల్ని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా నిర్ణయించారు. ఈ డిజైన్లు ఖరారైతే వాటిని పూర్తిస్థాయిలో రూపొందించేందుకు కనీసం సంవత్సరం పడుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. పూర్తిస్థాయి డిజైన్లు ఎప్పటికి సిద్ధమవుతాయి? అసలు ఈ కాంప్లెక్స్ నిర్మాణం మొదలయ్యేది ఎప్పుడో అంతుబట్టడం లేదు.
సీడ్ యాక్సెస్ రోడ్డుకు బ్రేక్
అమరావతిని బయటి ప్రపంచానికి అనుసంధానించే కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి టెండర్లు ఖరారైనా ఇంతవరకూ ప్రారంభం కాలేదు. ఐదో నంబరు జాతీయ రహదారిపై కనకదుర్గ వారధి నుంచి సీడ్ రాజధాని వరకూ 22 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన ఈ రోడ్డు మొదటి ప్యాకేజీ పనుల్ని రూ.250 కోట్లకు రెండు నెలల క్రితం ఎన్‌సీసీ సంస్థ దక్కించుకుంది. త్వరలో పనులు ప్రారంభమవుతాయనగా నాలుగు లైన్ల ఈ రహదారిని ఎనిమిది లైన్లుగా మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించడంతో ఈ ప్రాజెక్టుకు బ్రేకు పడింది.
ఏడు రోడ్ల డిజైన్లూ అంతే..
కీలకమైన ఏడు రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలుస్తామని ఆరు నెలల నుంచి చెబుతున్నా అది ఆచరణలోకి రాలేదు. ఆ రోడ్ల డిజైన్లను తరచూ మారుస్తుండడంతో టెండర్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు సైతం అతీగతీ లేకుండా పోయాయి. కొండవీటి వాగు వరద నియంత్రణ, జల మార్గాల అభివృద్ధికి సంబంధించిన డిజైన్ల రూపకల్పన బాధ్యతను నెదర్లాండ్స్ కన్సల్టెన్సీకి అప్పగించినా అవి ఇంకా రాలేదు. కీలకమైన గ్రామాల్లో లేఔట్ల అభివృద్ధి కాగితాలకే పరిమితమైంది. ప్లాట్ల పంపిణీ పేరుతో రైతులకు పత్రాలు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో భూమిని చదును చేసే పనే ఇంకా పూర్తి కాలేదు.