బుధవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కిందకు దూకుతున్న నీరు
సాక్షి, హైదరాబాద్, నెట్‌వర్క్: మూడురోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా దిగువన కర్ణాటకలోని ప్రాజెక్టుల్లోకి కృష్ణానదీ ప్రవాహాలు ఉధృతమవుతున్నాయి. దీంతో ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఆల్మట్టిలోకి మంగళవారం కేవలం 10 వేల క్యూసెక్కుల ప్రవాహాలు నమోదవగా, బుధవారం సాయంత్రానికి ఏకంగా 56 వేల క్యూసెక్కులకు పెరిగాయి. ఇవి మరింత పెరిగే అవకాశాలున్నాయని కేంద్ర జలసంఘం అంచనా వేస్తోంది.
ఆల్మట్టి నుంచి 20 వేల క్యూసెక్కులను నారాయణపూర్‌కు విడుదల చేస్తుండగా, నారాయణపూర్ నుంచి 24 వేల క్యూసెక్కుల మేర నీరు దిగువ నదిలోకి వదిలేస్తున్నారు. ఈ నీరంతా గురువారం సాయంత్రానికి జూరాలకు చేరే అవకాశం ఉంది. జూరాలకు ప్రస్తుతం కేవలం 3,800 క్యూసెక్కుల ప్రవాహాలు మాత్రమే నమోదవుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు సైతం ప్రస్తుతం ప్రవాహాలు తగ్గినా, రెండ్రోజుల్లో మళ్లీ పుంజుకోనున్నాయి. ఇక గోదావరి పరీవాహకంలో ఉన్న ఎస్సారెస్పీకి మంగళవారం 90 వేల క్యూసెక్కులకుపైగా ప్రవాహాలు రాగా, బుధవారం 52 వేల క్యూసెక్కులకు తగ్గాయి. నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 53.54 టీఎంసీలకు చేరింది.
► ఎగువమానేరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 31 అడుగులు కాగా..పూర్తిస్థాయిలో నీరు చేరింది.
► మూసీ ప్రాజెక్టులో 7 క్రస్టుగేట్లు ఒక అడుగు మేర ఎత్తి 4,600 క్యూసెక్కులను దిగువకు వదిలారు.
► భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం బుధవారం సాయంత్రానికి 15.3 అడుగులకు చేరింది. తాలిపేరు ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి 11,248 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. కిన్నెరసాని జలాశయంలో 400.90 అడుగుల మేర నీరు చేరింది.
► ఎల్లంపల్లి ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి 75 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు.
► కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని సరస్వతీ బ్యారేజీ 66 గేట్లలో 26 గేట్లెత్తి కాళేశ్వరం వైపునకు తరలిస్తున్నారు. కాళేశ్వరం వద్ద పుష్కరఘాట్‌ను తాకుతూ 8 మీటర్ల ఎత్తులో వరద ప్రవహిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు తరలిస్తున్నారు. గోదావరి, ప్రాణహితల ద్వారా లక్ష్మీబ్యారేజీకి ఇన్‌ఫ్లో 96,630 క్యూసెక్కులు వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment