పాములలంక నుంచి బాలుడిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది
సాక్షి, అమరావతి/కొల్లూరు/సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా నదిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ నదీ తీరంలోని లంక గ్రామాల్లో ఆదివారం కూడా వరద ముప్పు కొనసాగింది. గుంటూరు జిల్లాలో ప్రధానంగా తాడేపల్లి, కొల్లిపర, దుగ్గిరాల, భట్టిప్రోలు, కొల్లూరు, అమరావతి, దాచేపల్లి మండలాల్లో 29,754.75 ఎకరాల్లో ఉద్యాన, వాణిజ్య పంటలు నీట మునిగాయి. మిరప, అరటి, బొప్పాయి, నిమ్మ, మామిడి, కొబ్బరి, జామ, పసుపు, కంద, కూరగాయల తోటలు, పూల తోటలు, పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొల్లిపర, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పడవల ద్వారా వెళ్లి అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. లంక గ్రామాల్లో కొంత నీరు తగ్గినప్పటికీ పంట పొలాల్లో మాత్రం అలానే ఉండటంతో పంటలు కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. అమరావతి– విజయవాడ మధ్య ఇంకా రాకపోకలు సాగడం లేదు.
సహాయక బృందాలకు ప్రశంసలు
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫైర్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగాయి. గత రెండు రోజుల్లో అన్నవరపులంకలో 100 మందిని, జువ్వలపాలెంలో 50 మందిని, పల్లెపాలెంలో 80 మందిని వరద ముప్పు నుంచి ఫైర్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కాపాడాయి. రెండు జిల్లాల్లో 23,551 మందిని సహాయ శిబిరాలకు తరలించాయి. శిబిరాల్లో బాధితులకు భోజనం, వైద్యం, వసతి సౌకర్యాలు కల్పించారు. విజయవాడ రామలింగేశ్వరనగర్‌లో విధులు నిర్వహించిన ఫైర్ సిబ్బంది సేవలకు నెటిజన్లు సైతం ఫిదా అయ్యారు. ముంపు ప్రాంతం నుంచి బోటులో తీసుకొచ్చిన బాలింతను కిందకు దించేందుకు ఓ ఫైర్ ఉద్యోగి తనే స్టూల్‌గా మారి బాలింతకు ఊతమిచ్చాడు. ఆయన వీపుపై కాలు మోపి ఆ బాలింత సురక్షితంగా కిందకు దిగింది. శనివారం జరిగిన ఈ సన్నివేశం ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి సుచరిత
వరదల కారణంగా నష్టపోయినవారిని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వైఎస్ జగన్ విదేశీ పర్యటన నుంచి రాగానే వరదలపై సమీక్ష నిర్వహించి నష్టపరిహారం ప్రకటిస్తామన్నారు. కృష్ణా జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో మరొకరు వరద కారణంగా ప్రాణాలు కోల్పోయారన్నారు. వరదల ప్రభావం గుంటూరు జిల్లాలో 53 గ్రామాలపైనా, కృష్ణా జిల్లాలో 34 గ్రామాలపైనా ఉందన్నారు.
రెండు జిల్లాల్లో 17,491 మంది వరద ముంపు బారిన పడ్డారని వివరించారు. సీఎం ఆదేశాల మేరకు సహాయ చర్యలు చేపడుతున్నామని, ఆహార పొట్లాలు, పెరుగు, పాలు, తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు.వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశం అనంతరం మంత్రి కొల్లూరు, దోనేపూడి గ్రామాల్లో కరకట్ట దిగువన వరద ప్రాంతాలను పరిశీలించారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, జేసీ దిలీప్‌కుమార్, ఆర్డీవో శ్యామ్‌ప్రసాద్, డీఎస్పీ శ్రీలక్ష్మి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా కొల్లిపరలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, కలెక్టర్ శామ్యూల్ వరద పరిస్థితిపై ఆరా తీశారు. కొల్లూరు, పెసర్లంకలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత లేళ్ల అప్పిరెడ్డి పర్యటించారు.
హెచ్చెల్సీ, హంద్రీనీవా కాలువలకు గండ్లు
బొమ్మనహాళ్/ఉరవకొండ: తుంగభద్ర, కృష్ణా నదులు పరవళ్లు తొక్కుతున్నా కాలువలకు అడుగడుగునా గండ్లు పడుతుండటంతో ఆశలు ఆవిరవుతున్నాయి. ఆదివారం హెచ్చెల్సీ కాలువకు, హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీకి గండ్లు పడి నీరు వృథా అయ్యాయి. తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు బొమ్మనహాళ్ మండలంలోని మైలాపురం సమీపంలో 122–200 కిలోమీటరు వద్ద ఆదివారం గండి పడి నీరు వృథాగా పారింది. కాగా, హంద్రీ నీవా 34వ ప్యాకేజీలో భాగంగా నిర్మించిన డీ2 డిస్ట్రిబ్యూటరీ కాలువకు భారీ వర్షంతో మూడు చోట్ల గండి పడింది.
వరద నీటిలో బోటు కార్మికుడి గల్లంతు
భట్టిప్రోలు(వేమూరు):కృష్ణా నది లంక గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్లిన బోటు కార్మికుడు విద్యుదాఘాతానికి గురై వరద నీటిలో మునిగి గల్లంతయ్యాడు. మరొక కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. కొల్లూరు మండలం ఈపూరులంక నుంచి బోటులో పెదపులివర్రు వైపు వస్తుండగా విద్యుత్ తీగలు అడ్డుపడ్డాయి. వాటిని చేతితో పైకెత్తడంతో రేపల్లె మండలం పెనుమూడికి చెందిన వల్లభనేని వెంకట్రాజు (27) షాక్‌కు గురై బోటులోంచి వరద నీటిలో పడిపోయి గల్లంతయ్యాడు. అదే గ్రామానికి చెందిన ఒడుగు ప్రభుదాస్ (37) కూడా షాక్‌కు గురికాగా.. అతడు బోటులో పడిపోయాడు. అతడిని తోటి కార్మికులు వెల్లటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆస్పత్రికి చేరుకుని మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టారు. గల్లంతైన వెంకట్రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment