ఆకలిదప్పులతో అలమటిస్తున్న లంక గ్రామాల ప్రజలు
అందుతున్న కొద్దిపాటి సాయం కూడా అయిన వాళ్లకే..
ఎస్సీ కాలనీల పరిస్థితి మరీ దారుణం
అధ్వాన పారిశుధ్యం.. పీక్కుతింటున్న దోమలు
కళ్ల ముందు నీళ్లు పారుతున్నాయి.. కానీ గొంతు తుడుపుకొనేందుకు గుక్కెడు మంచి నీరు లేని పరిస్థితి. పేదలకు పట్టెడన్నం దొరకని దుస్థితి. అడుగు పడనీయని అంధకారం.. విష పురుగులు విలయతాండవం.. ఇళ్లు, వీధుల్లో నీళ్లు పారుతుండటంతో అధ్వాన పారిశుధ్యం.. పట్టపగలే పీక్కుతింటున్న దోమలు. ఇదీ.. వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లోని లంక గ్రామాల ప్రజల దీన స్థితి.
సాక్షి ప్రతినిధి, బాపట్ల : బాపట్ల జిల్లా కొల్లూరు మండలం తోకలవారిపాలెం, తురకపాలెం తదితర గ్రామాలను మంగళవారం ‘సాక్షి’ బృందం పరిశీలించింది. వరద సహాయ కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అందుతున్న కొద్దిపాటి సాయం కూడా ఒకవర్గం వారికే చేరుతోంది. బాధితులకు అధికారుల ద్వారా పంపిస్తున్నట్లు చెబుతున్న ఆహారం, తాగునీటి ప్యాకెట్లను ఆయా గ్రామాల్లోని అధికార పార్టీ నేతల ఇళ్ల వద్దకు చేరుతున్నాయి.
దీంతో ఒక వర్గం వారికే సాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికీ చాలామంది పేదలు అన్నంతో పాటు తాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. కొద్దిపాటి నీరు, ఆహారం వచ్చిందంటే చాలు.. వాటి మీదికి జనం ఎగబడుతున్నారంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కనీసం మంచి నీళ్లిచ్చినా తాగి ప్రాణాలు దక్కించుకుంటామని పలువురు బాధితులు ‘సాక్షి’తో చెప్పారు.
అంధకారంలో గ్రామాలు
మూడు రోజులుగా 27 లంక గ్రామాలను వరద చుట్టుముట్టగా గత రెండు రోజులుగా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. లంక గ్రామాల పరిధిలో ఉన్న రెండు విద్యుత్ సబ్‌స్టేషన్లు నీటిలో మునగడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యుత్ లైన్లు, స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచి పోయి గ్రామాల్లో అంధకారం అలుముకుంది. కొన్ని పూరిళ్లతో పాటు వీధుల్లోనూ నీరు అలానే ఉంది. విషపురుగులు బెడద పెరిగింది. దోమలు పట్టపగలే పీక్కుతింటున్నాయి. దీనికి తోడు పారిశుధ్యం అధ్వానంగా మారడంతో జ్వరాలు పెరుగుతున్నాయి. బయట ఆస్పత్రులకు వెళదామంటే బోట్లు లేని దుస్థితి. నీరు, భోజనం సరఫరా చేయడానికి వచ్చిన బోట్లలో కొంతమందిని బయటకు తరలించి అక్కడి నుంచి తెనాలి, గుంటూరులోని ఆస్పత్రులకు పంపారు.
బోట్లు లేక.. ఊరు దాటలేక...
లంక గ్రామాల నుంచి బయటకు వచ్చేందుకు బోట్లు అందుబాటులో లేక ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. బయటకు వచ్చి సొంతంగా తాగునీరు, ఆహారం, ఇతర వస్తువులు తెచ్చుకుందామన్నా ప్రభుత్వం తగినన్ని బోట్లను ఏర్పాటు చేయలేదు. అలాగే పశువులకు తినేందుకు మేత లేక అవి దీనంగా అరుస్తున్నాయి. వేలాది ఎకరాల్లోని అరటి, తమలపాకు, కంద, పసుపు వంటి వాణిజ్య పంటలు మొత్తం నీటి పాలయ్యాయి. ఒక్కో ఎకరానికి రెండు నుంచి రూ. 3 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఎకరం రూ.50 వేలకు కౌలుకు తీసుకుని పంటలను సాగు చేశారు. వరద రాకతో ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కష్టాలు తీర్చాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
బోటు లేదు.. ఓటి మాటలే
సీఎం చంద్రబాబు దగ్గరుండి మూడు రోజులుగా హెలికాప్టర్లు, డ్రోన్లు, బోట్లతో వరద బాధితులకు సాయం చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ.. కనీసం బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బోట్లు కూడా ఏర్పాటుచేయలేదనేందుకు నిదర్శనం ఈ చిత్రం. విజయవాడలో వరద నీటిలో థర్మాకోల్ షీట్‌పై వెళుతున్న దివ్యాంగురాలిని చంద్రబాబు పరామర్శిస్తున్న దృశ్యమిది.
Comments
Please login to add a commentAdd a comment