
పాయకరావుపేట బీసీ బాలికల కళాశాల హాస్టల్‌లో మంత్రి అనిత భోజనంలో బొద్దింక
ఇదీ రాష్ట్రంలో విద్యార్థుల భోజనం పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ అని మండిపడుతున్న నెటిజన్లు
హోంమంత్రి తిన్న భోజనమే ఇలా ఉంటే లక్షలాది మంది విద్యార్థుల పరిస్థితి ఏమిటంటూ విస్మయం
తాను తినే అన్నంలో వచ్చిన బొద్దింకను చూపిస్తున్న మంత్రి వీడియో వైరల్
విమర్శలు రావడంతో బొద్దింక కాదు.. తల వెంట్రుక అంటూ ఖండించిన అనిత.. హాస్టల్ వార్డెన్ గంగా భవానిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
సాక్షి, అనకాపల్లి: ప్రభుత్వ వసతి గృహాల తనిఖీల్లో భాగంగా తన సొంత నియోజకవర్గంలోని పాయకరావుపేట బీసీ బాలికల గురుకుల కళాశాల హాస్టల్‌ను హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం సందర్శించారు. విద్యార్థులతో పాటు తనూ కూర్చొని భోజనం పెట్టమన్నారు. ఇక అంతే.. ఆమె తినే భోజనం ప్లేటులో బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో అనిత ఒక్కసారిగా షాక్ అయ్యారు. తేరుకుని గురుకుల హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తినే ఆహారంలోనే ఇలా బొద్దింకలు వస్తున్నాయంటే ఇంకా బాలికలకు ఏం పెడుతున్నారంటూ అధికారులపై నిప్పులు చెరిగారు.
‘ఏంటి భోజనం ఇలా ఉంటుందా? ప్రభుత్వ వసతి గృహాల్లో ఇంత నిర్లక్ష్యమా?’ అంటూ మీడియా ముందు కొన్ని డైలాగులు కొట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హోంమంత్రి అక్కడి సిబ్బందిని హెచ్చరించారు. ఈ క్రమంలో వసతి గృహంలో సరైన వసతులు లేవని, ఆహార మెనూ సరిగ్గా అమలు కావడం లేదని విద్యార్థులు అనితకు ఫిర్యాదు చేశారు.
బొద్దింక కాదు తలవెంట్రుక..
తన వీడియో వైరల్ అయి తీవ్ర విమర్శలు రావడంతో మంగళవారం నక్కపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి అనిత మీడియా సమావేశం పెట్టి.. తాను తిన్న భోజనంలో బొద్దింక రాలేదని, చిన్న తల వెంట్రుక వచి్చందని ఖండించారు. కానీ అది బొద్దింక అంటూ వైఎస్సార్‌సీపీ వారు ప్రచారం చేస్తున్నారంటూ బుకాయించారు. విద్యార్థులకు మంచి వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే అన్ని హాస్టళ్లను తనీఖీలు చేయాలని అధికారులను ఆదేశించామని వెల్లడించారు.
హాస్టల్ వార్డెన్‌పై సస్పెన్షన్ వేటు..
హోంమంత్రి అనిత సందర్శించిన పాయకరావుపేట బీసీ గురుకుల ఉమెన్స్ కళాశాల హాస్టల్లో్ల వార్డెన్ గంగా భవాని తన విధుల పట్ల నిర్లక్ష్యం, విద్యార్థులకు మెనూ పాటించకపోవడం, భోజనంలో నాణ్యత కొరవడడం, విధులు సరిగ్గా నిర్వహించకపోవడం వంటి కారణాలతో మంగళవారం ఆమెను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.