సాక్షి, అమరావతి: వరద నీటితో ఉరకలెత్తిన కృష్ణా నదిలో ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 5.48 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 70 గేట్లు ఎత్తి 6.16 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. శనివారంతో పోలిస్తే ఆదివారం ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోకి వచ్చే వరద భారీగా తగ్గింది. ఆల్మట్టిలోకి 2.40 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదలుతున్నారు. నారాయణపూర్‌లోకి 2 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 1.48 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
భీమానదిలో ప్రవాహం కొంత పెరిగింది. ఉజ్జయిని జలాశయంలోకి 12,351 క్యూసెక్కులు వస్తుండగా.. 15,590 క్యూసెక్కులను కృష్ణాలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణా, భీమా నదుల నుంచి జూరాల ప్రాజెక్ట్‌లోకి 3.50 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 3.32 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నదిలో వరద స్థిరంగా కొనసాగుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి 5.98 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 4.73 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 4.24 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్ట్‌లోకి 5.13 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. అదేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన వరద తగ్గిన నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలలోకి వచ్చే వరద సోమవారం నుంచి తగ్గుముఖం పట్టనుంది.
తగ్గిన గోదావరి
ప్రాణహిత, ఇంద్రావతి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తెరిపివ్వడంతో ఆదివారం గోదావరిలోకి వచ్చే ప్రవాహం తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సాయంత్రం 6 గంటలకు 4.81 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. అంతే స్థాయిలో నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వంశధారలో వరద స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి 13,129 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment