శారదా నీటి పంపింగ్‌ను అడ్డుకునే యత్నం
యల్లయ్య గ్రోయిన్ వద్ద వైఎస్సాఆర్‌సీపీ, సీపీఐ, రైతుల రాస్తారోకో
పోలీస్‌స్టేషన్‌కు నాయకుల తరలింపు
అనకాపల్లి: యల్లయ్య గ్రోయిన్ అనుసంధాన కాలువ నుంచి ఏలేరు కాలువలోకి నీటిని పంపింగ్ చేస్తున్న అంశం ఉద్రిక్తతకు దారితీసింది. కొద్దిరోజులుగా వైఎస్సాఆర్‌సీపీతోపాటు వివిధ పక్షాల నేతలు ఏలేరు కాలువలోకి ఎల్లయ్య గ్రోయిన్ నీటిని పంపింగ్ చేయడం కుదరదని ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మంగళవారం వైఎస్సాఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆధ్వర్యంలో అఖిలపక్షాల నేతలు ఆందోళన చేసిన సమయంలో పంపింగ్ యంత్రాలను తొలగించిన ట్లు నటించి బుధవారం యథావిధిగా నీటిని పంపింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలియడంతో వైఎస్సాఆర్‌సీపీ, సీపీఎం నేతలు యల్లయ్య కాలువ గ్రోయిన్ వద్దకు తరలివెళ్లారు. అక్కడి విశాఖపట్నం ఇండస్ట్రీస్ వాటర్ సప్లయ్ కంపెనీ ఏజీఎం అప్పలనాయుడు నేతృత్వంలో కొందరు వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో పోలీసులు సైతం రంగప్రవేశం చేశారు. నీటిని తరలించేందుకు తాము అంగీకరించబోమని వైఎస్సాఆర్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు, సీపీఐ నేత వై.ఎన్.భద్రంలు హెచ్చరించినప్పటికీ విస్కో ప్రతినిధులు తమకు నీటిని తరలించేందుకు అనుమతి ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు చర్చలు జరిగిన అనంతరం నాయకులు యంత్రాలు ఉన్న చోట బైఠాయించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తీరును విమర్శిస్తూ నినాదాలు చేశారు. అప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్న పట్టణ సీఐ చంద్ర ఆధ్వర్యంలో పోలీసులు వైఎస్సాఆర్‌సీపీ, సీపీఐ నాయకులను అదుపులోకి తీసుకొని జీపులో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
పోలీస్‌స్టేషన్‌లో నినాదాలు
అనకాపల్లి పరిధిలో శారదా నది నుంచి యల్లయ్య గ్రోయిన్ లోని నీటిని పంపింగ్ చేయడాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన తమను అరెస్టు చేయడంపై వైఎస్సాఆర్‌సీపీ, సీపీఐ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ పోలీస్‌స్టేషన్‌లో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మందపాటి జానకిరామరాజు మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు, వరదలు లేనప్పుడు శారదా నది నీటిని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఇందులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇదే స్థాయిలో నీటిని తోడేస్తే అనకాపల్లి పట్టణ, మండలాలకు తాగు, సాగునీరు దక్కడం గగనమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. జిల్లాలో దశాబ్దాల పాటు రాజకీయాలు చేసిన మాజీ మంత్రులు అనకాపల్లి నీటిని తరలిస్తున్నా ఎందుకు మిన్నకుండిపోయారని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి చెందిన నీటిని దోపిడీ చేస్తున్నప్పటికీ నేతలు స్పందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సాఆర్‌సీపీ పట్టణ కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు, యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, మండల పార్టీ కార్యదర్శి భీశెట్టి జగన్, అధికార ప్రతినిధి ఒమ్మి రాముయాదవ్, ఆహార కమిటీ సభ్యుడు ఏడువాకల నారాయణరావు, దళిత సోషితసంఘ సభ్యుడు మామిడి నూకరాజు, సీపీఐ నాయకుడు భద్రం,, శంకరరావు, కుండలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.