నగర ప్రజలకు ఇబ్బందులు రానీయొద్దు
- వర్షాకాల సమస్యలపై అప్రమత్తం
- సీజన్ ముగిసే వరకు సిబ్బంది సెలవులు రద్దు
- వివిధ విభాగాల అధికారులతో కేటీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: నగరంలో గత వర్షా కాలంలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా తగిన ప్రణాళికలతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని మునిసిపల్ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ముగిసే వరకు జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖల్లో అధికారులు, సిబ్బందికి సెలవుల్ని రద్దు చేయాలని ఆదేశించారు. వర్షాకాలం రానున్న నేపథ్యంలో నగరంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం, ఎస్‌ఆర్‌డీపీ (వ్యూహాత్మక రహదారుల ప్రణాళిక) పనులపై వివిధ శాఖల అధికారులతో శనివారం మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... వర్షా కాలంలో డ్రైనేజీ, నాలాల్లో పడి మరణించే ఘటనలు జరగడానికి ఇక వీల్లేదని, వాటిని అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈసారి ఎలాంటి ప్రాణనష్టం జరిగినా అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
రోడ్లపై గుంత కనపడకూడదు...
రోడ్లపై ఎక్కడా గుంతలు కనపడకూడదని సీఎం ఆదేశించారని కేటీఆర్ చెప్పారు. దానికి అనుగుణంగా మూడు వారాల్లో నగర రోడ్లపై గుంత కనపడకుండా చేయాలని అధికారులకు సూచించారు. ఈమేరకు శాఖలన్నీ మరింత సమన్వయంతో పనిచేయాలన్నారు. గత వర్షాకాలంలో ప్రజల నుంచి పెద్దయెత్తున ఫిర్యాదులు వచ్చాయని, ఈసారి వాటికి ఆస్కారం లేకుండా నాలుగు నెలలుగా ఉమ్మడి సమన్వయ గ్రూప్ ఏర్పాటు చేసి, ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
విపత్తు నివారణ సెల్...
నగరంలో 2010 శిథిల భవనాలను గుర్తించగా, వాటిల్లో 1089 భవనాలను కూల్చివేసినట్లు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. మిగతా వాటికి కూడా నోటీసులిచ్చి కూల్చివేతలు పూర్తిచేయాలని మంత్రి సూచించారు. నాలాలపై ప్రధాన అడ్డంకిగా ఉన్న 887 నిర్మాణాలను కూడా కూల్చివేయాలన్నారు. జీహెచ్‌ఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా విపత్తు నివారణ సెల్‌లను ఏర్పాటు చేయాలన్నారు. నెలకోమారు నిర్వహిస్తున్న సిటీ కన్జర్వెన్స్ సమావేశాలను ఇకపై 15 రోజులకోమారు ఏర్పాటు చేయాలన్నారు.
40 వేల ఇళ్ల టెండర్లు పూర్తి...
జీహెచ్‌ఎంసీ పరిధిలో 40 వేల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, మరో 20 వేల ఇళ్ల టెండర్ల ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. నగరంలో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి తీరతామని పునరుద్ఘాటించారు. ఎస్సార్‌డీపీ పనుల వేగాన్ని పెంచాలన్నారు.
ఇది ‘ఎగ్జిక్యూషన్’ సంవత్సరం...
నగరంలో పెద్దయెత్తున ఎస్సార్‌డీపీ, ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం, ఇతర భారీ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయన్న మంత్రి... ఈ ఏడాదిని ‘ఇయర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్’గా అభివర్ణించారు. రెవెన్యూ వసూళ్లలో జీహెచ్‌ఎంసీ దేశంలోనే ప్రశంసనీయమైన అభివృద్ధి సాధించడంపై అభినందించారు. సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, మునిసిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, జలమండలి ఎండీ దానకిశోర్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
అన్ని ఫిర్యాదులకూ ‘100’
నగర పరిధిలో ఎలాంటి ఫిర్యాదులకైనా ప్రస్తుతం ఉన్న వివిధ నంబర్ల స్థానంలో ప్రజలకు సౌకర్యంగా ఉండేలా 100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామని కేటీఆర్ చెప్పారు. రోడ్లు, సివరేజీ ఇంజినీరింగ్ మరమ్మతుల్లో పాల్గొనే కార్మికులకు చేతి గ్లౌజులు, బూట్లు తదితర రక్షణ పరికరాలను విధిగా అందజేయాలని స్పష్టం చేశారు. నీరు నిలిచే 220 ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు మంత్రి దృష్టికి తేగా, ట్రాఫిక్ పోలీసులతో కలిసి మరోమారు సర్వే చేసి వాటి పరిష్కారానికి మంగళవారం లోగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.