సాక్షి, హైదరాబాద్ : నగరంలో బీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక ఏసీ బస్ షెల్టర్స్ ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. నేడు ఖైరతాబాద్, కూకట్ పల్లిలో ఏర్పాటు చేసిన ఏసీ బస్టాప్‌లను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ఈ ఆధునిక బస్ షెల్టర్లలో ఏసీ, వైఫై, ఏటీఎం, టీవీ, మొబైల్ చార్జింగ్ పాయింట్స్, ఫ్యాన్లు, టాయిలెట్, టికెట్ కౌంటర్లులతో పాటు ఎమర్జెన్సీ హారన్ వంటి సౌకర్యాలు కల్పించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏసీ బస్‌షెల్టర్ల నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ చేపడుతుంది.
గ్రేటర్‌లో మొత్తం 826 ఆధునిక బస్‌షెల్టర్లను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేస్తుంది. పాశ్చత్య దేశాలలోని ప్రముఖ నగరాల్లో మాత్రమే ఈ విధమైన బస్ షెల్టర్లు ఉన్నాయి. ప్రస్తుతం శిల్పారామం, ఖైరతాబాద్ ఆర్‌టీసీ ఆఫీస్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో ఏసీ బస్ షెల్టర్స్ అందుబాటులోకి వచ్చాయి. దేశంలో తొలిసారిగా ఏసీ బస్టాప్‌ను ఏర్పాటు చేసిన ఘనతను జీహెచ్‌ఎంసీ సాధించింది.
సోమాజిగూడలో నిర్మించిన అత్యాధునిక ఏసీ బస్టాప్‌లను మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి గురువారం ప్రారంభంచారు. జీహెచ్‌ఎంసీ, యూనియాడ్స్ సంయుక్త ఆధ్వర్యంలో రూ. 60 లక్షల వ్యయంతో ప్రయోగాత్మకంగా ఏసీ బస్టాప్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో బస్టాప్ దాదాపుగా 25మంది ప్రయాణికులకు చోటివ్వనుంది. ఈ సందర్భంగా యూనియాడ్స్ ప్రతినిథులు ప్రవీన్ రామారావు, ఎంఎన్ రాజులు మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు రెడ్ బటన్ ప్రేస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం చేరుతుందన్నారు. తొలుత రెండు ఏసీ, మరో రెండు నాన్‌ఏసీ బస్టాప్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, ప్రత్యేక కారణాలతో నాలుగు బస్ షెల్టర్లకు ఏసీలను అమర్చామని తెలిపారు.
ఈ బస్టాప్‌లకు అధునాతన టఫ్పెల్ గ్లాస్‌లను అమర్చినట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ డాక్టర్ జనార్దన్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమవరపు సత్యనారాయణ, ఆర్టీసీ ఈడీ రమణారావు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, జోనల్ కమిషనర్ భారతి హోలికేరి, డిప్యూటీ కమిషనర్ అద్వైత్ కుమార్ సింగ్, డాక్టర్ భార్గవ్ నారాయణ, సర్కిల్ 18 డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment