వాటర్‌బోర్డులో 60 మంది..? | 6o peoples in waterboard | Sakshi
Sakshi News home page

వాటర్‌బోర్డులో 60 మంది..?

Published Sun, May 25 2014 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM

వాటర్‌బోర్డులో 60 మంది..?

వాటర్‌బోర్డులో 60 మంది..?

సాక్షి,సిటీబ్యూరో: జలమండలిలో పలువురు ఉద్యోగులకు ‘స్థానికత’ గుబులు పట్టుకుంది. ఉద్యోగుల సర్వీసు పుస్తకంలో పేర్కొన్న ప్రాంతం ఆధారంగా బదిలీలు జరిగితే సుమారు 60 మంది ఉద్యోగులకు స్థానచలనం తప్పదన్న సంకేతాలు వెలువడుతుండడంతో ప్రస్తుతం బోర్డులో ఇదే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. కాగా కీలకమైన ఫైనాన్స్‌డెరైక్టర్, మెడికల్ ఆఫీసర్, ఎస్టేట్ ఆఫీసర్, చీఫ్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, మేనేజర్,డిప్యూటీ జనరల్ మేనేజర్ క్యాడర్లలో పనిచేస్తున్న ఇంజనీర్లుసహా ఇతర సాంకేతిక సిబ్బంది, ఫైనాన్స్,హెచ్.ఆర్ విభాగంలో దాదాపు 60 మంది వరకు స్థానికేతరులు బోర్డులో పనిచేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.

ఇప్పుడు ఆయా ఉద్యోగులు బదిలీకి స్థానికతే ప్రామాణికమైతే వీరంతా తమ సొంత జిల్లాలకు వెళ్లడం అనివార్యమని బోర్డు వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఉద్యోగ,కార్మిక సంఘాలు సైతం ఇదే అంశంపై వాడీవేడీగా చర్చించుకుంటున్నాయి. డిప్యూటేషన్‌లపై పనిచేస్తున్న అధికారులను మాత్రమే బదిలీకి పరిమితం చేసి వారిని మాతృసంస్థల్లోకి తిరిగి పంపించాలని, దశాబ్దాల క్రితం బోర్డు ఉద్యోగులుగా ఎంపికైన తమకు బదిలీ నుంచి మినహాయింపునివ్వాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు.

 కొత్త ఉద్యోగాల భర్తీ ఎప్పుడో : జలమండలి నీటిసరఫరా,మురుగునీటిపారుదల విభాగంలో సుమారు 670 ఖాళీ పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి,మార్చి నెలల్లో దరఖాస్తులు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికలు,రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో వీటి భర్తీ ప్రక్రియ కూడా పూర్తిగా నిలిచిపోయింది. బోర్డులో ఇప్పటికే హెచ్‌ఆర్ కార్మికులుగా పనిచేస్తున్నవారికి ప్రత్యేక వెయిటేజీ నిచ్చి సుమారు 600 మందిని ఆయాపోస్టుల్లో భర్తీ చేయనున్నారు. బయటి వ్యక్తులకు కేవలం 70 వరకు ఉద్యోగాలు దక్కే అవకాశాలున్నాయి. ఈ 70 పోస్టులకోసమే సుమారు 30 వేలమంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. కాగా ఖాళీ పోస్టుల భర్తీ కొత్త ప్రభుత్వం కొలువుదీరాకనే భర్తీ ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement