Telangana News: ‘కాశిబుగ్గ’లో కలెక్షన్‌ కింగ్‌..! పైసలిస్తేనే ఫైళ్లు క్లియర్‌..!!
Sakshi News home page

‘కాశిబుగ్గ’లో కలెక్షన్‌ కింగ్‌..! పైసలిస్తేనే ఫైళ్లు క్లియర్‌..!!

Oct 4 2023 1:02 AM | Updated on Oct 4 2023 9:13 AM

- - Sakshi

వరంగల్‌: ‘మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. మీ వసూళ్ల విషయం నాకు తెలియంది కాదు. అన్నీ నాకు తెలుసు. కొత్త ఇంటి నంబర్‌కు రూ.2వేలు, నూతన భవన నిర్మాణ ధ్రువీకరణ పత్రానికి మినిమమ్‌ రూ.3వేల చొప్పున ముట్టజెప్పాల్సిందే. లేదంటే ఫైల్‌ విచారణ పేరిట పెండింగ్‌లో ఉంటుంది. క్షేత్రస్థాయిలో మీరు ఎంత తీసుకుంటున్నారో నా వద్ద ఆధారాలున్నాయి. నేను ఫైల్‌ పెడితే సస్పెండ్‌ అవుతారు.. జాగ్రత్త’ అంటూ గ్రేటర్‌ వరంగల్‌ కాశిబుగ్గ సర్కిల్‌ కార్యాలయంలో ఇటీవల వచ్చిన ఓ అధికారి.. టౌన్‌ ప్లానింగ్‌, పన్నుల విభాగం ఉద్యోగులపై కర్ర పెత్తనం చేస్తున్న వైనం కలకలం రేపుతోంది.

పేరుకు సిన్సియర్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తూ.. అడ్డదారిలో అందినకాడికి దోచుకునేందుకు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేస్తుండడంతో ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. రూ.లక్షల్లో జీతం తీసుకుంటూ ఆదర్శంగా నిలవాల్సిన ఆ అధికారి క్షేత్రస్థాయి సిబ్బందిని అక్రమ వసూళ్లకు ప్రోత్సహిస్తుండడం కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది. ఎంతైనా ఫర్వాలేదు. ప్రతీ ఫైల్‌కు పైసలు తీసుకోండి.. తన వాటా తనకు సమర్పించుకోండంటూ నేరుగా చెప్పడం చూస్తుంటే ఇదేం చోద్యం అని ఉద్యోగులు ముక్కున వేలేసుకుంటున్నారు.

సిన్సియర్‌ అధికారిగా..
నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని ఓ మున్సిపాలిటీనుంచి మూడు నెలల కిందట బదిలీపై కాశిబుగ్గ సర్కిల్‌కు వచ్చారు. కాశిబుగ్గ కార్యాలయంలో విధులు నిర్వరిస్తున్నారు.

విధుల్లో చేరిన కొత్తలో ప్రతీ విషయం రూల్‌ అంటే రూల్‌ అని, నిర్లక్ష్యం చేసినా, అవినీతికి పాల్పడినా.. శాఖాపరమైన చర్యలు తప్పవని ఉద్యోగులకు, అధికారులను ఘాటుగా హెచ్చరించాడు. అంతేకాకుండా ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ఓ ఈఈ, టౌన్‌ ప్లానింగ్‌కు చెందిన ఏసీపీకి విధుల నిర్లక్ష్యంపై మెమోలు కూడా జారీ చేశాడు. దీంతో ఆఫీస్‌ సబార్డినేటర్‌ నుంచి ఈఈ, ఏసీపీ స్థాయి అధికారి వరకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఆ తర్వాత వసూళ్లకు తెగబడడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

పైసలిస్తేనే పైళ్లు క్లియర్‌..
‘కొత్త ఇంటినంబర్‌ కేటాయిస్తే రూ. 2వేలు ఇవ్వాలి. పేరు మార్పిడికి కనీసం రూ.1,000 చెల్లించాలి’.. ఇదీ పన్నుల విభాగం సిబ్బందికి విధించిన కండీషన్‌. ఇటీవల టౌన్‌ ప్లానింగ్‌కు సంబంధించిన బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లను సమావేశ పర్చి, తాను క్లియరెన్స్‌ ఇవ్వాలంటే ప్రతీ ఫైల్‌కు రూ.3వేల చొప్పున చెల్లించాల్సిందేనని నిబంధన పెట్టినట్లు తెలుస్తోంది.

ఆమాట విన్న బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు అవాక్కయ్యారని సమాచారం. సర్వేయర్లు, మధ్యవర్తులు తనకు అవసరం లేదని బాహాటంగా హెచ్చరించడంతో ఉద్యోగులు హైరానా పడుతున్నారు. ఈ అధికారి వసూళ్లపై తాజాగా ఓ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌.. బల్దియా ద్వితీయ శ్రేణి అధికారికి సమాచారం ఇచ్చారు. ‘నా మాటే ఖాతరు చేయడం లేదు. నీ మాట ఎంత ’అని ఆయన వదిలేసినట్లు కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.

సదరు అధికారి అక్రమ వసూళ్ల వ్యవహారం శృతి మించడంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకవర్గ పెద్దలు, ఉన్నతాధికారుల అండ ఉందని బహిరంగంగా చెబుతున్న ఆయన వసూళ్ల వ్యవహరంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై ఓ ద్వితీయ శ్రేణి అధికారిని వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని, కమిషనర్‌కు సమాచారం ఇస్తానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement