సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎట్టకేలకు శుక్రవారం రాత్రి అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. ఉమ్మడి వరంగల్‌లోని ఏడు నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ నెల 15న తొలి జాబితాలో నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, ములుగు, భూపాలపల్లి అభ్యర్థులను ప్రకటించిన టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ.. రెండో జాబితాలో మరో ఏడు స్థానాలకు ఖరారు చేసింది. ఇదిలా ఉండగా డోర్నకల్ స్థానానికి ఎవరి పేరునూ ప్రకటించలేదు.
12 రోజుల తర్వాత..
అభ్యర్థుల తొలి జాబితాను ఈనెల 15న ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం.. 12 రోజుల తర్వాత రెండో జాబితాను వెల్లడించింది. తొలి జాబితాలో దొంతి మాధవరెడ్డి (నర్సంపేట), ధనసరి సీతక్క (ములుగు), గండ్ర సత్యనారాయణరావు (భూపాలపల్లి), సింగపురం ఇందిర (స్టేషన్‌ఘన్‌పూర్) పేర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రెండో జాబితాలో ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత రేవూరి ప్రకాష్‌రెడ్డికి పరకాల నుంచి టికెట్ లభించింది. ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి, కొండా మురళీధర్‌రావుకు సర్దిచెప్పినట్లు పార్టీవర్గాల సమాచారం.
కాగా వరంగల్ తూర్పు నుంచి మాజీ మంత్రి కొండా సురేఖకు అవకాశం దక్కింది. వరంగల్ పశ్చిమ నుంచి డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పోటీ చేయనున్నారు. పాలకుర్తి నుంచి ప్రయత్నించిన ఎన్‌ఆర్‌ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి పౌరసత్వ సమస్యతో తప్పుకుని ఆమె కోడలు యశస్వినిరెడ్డికి టికెట్ ఇప్పించుకోగా.. జనగామ నుంచి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి పార్టీ అవకాశం కల్పించింది. మహబూబాబాద్ (ఎస్టీ)నుంచి మురళీనాయక్, వర్ధన్నపేట (ఎస్సీ)నుంచి మాజీ పోలీసు అధికారి, ఎన్నికల నేపథ్యంలోనే పార్టీలో చేరిన కేఆర్ నాగరాజు పేర్లు ఖరారయ్యాయి.
డోర్నకల్‌పై సస్పెన్స్.. సీనియర్లకు ఆశాభంగం..
ఉమ్మడి జిల్లాలోని 11నియోజకవర్గాలకు మొదటి, రెండు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం.. డోర్నకల్‌ను మాత్రం సస్పెన్స్‌లో పెట్టింది. ఇక్కడి నుంచి ఎనిమిది మంది వరకు దరఖాస్తు చేసుకున్నా.. ప్రధానంగా రామచంద్రునాయక్, నెహ్రూనాయక్, భూపాల్‌నాయక్ పోటీ పడుతుండడంతో టికెట్ ఎవరికి దక్కుతుందో అనే ఉత్కంఠకు మాత్రం తెరపడలేదు. ఇదిలా ఉండగా పలు స్థానాల నుంచి టికెట్ కోసం పోటీపడ్డ కొందరు సీనియర్లకు ఆశాభంగం కలిగింది.
మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్, బెల్లయ్యనాయక్, వర్ధన్నపేట నుంచి నమిండ్ల శ్రీనివాస్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య టికెట్ ఆశించినా భంగపాటు తప్పలేదు. వరంగల్ పశ్చిమ నుంచి దరఖాస్తు చేసుకున్న జనగామ డీసీసీ మాజీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, వరంగల్ తూర్పు నుంచి ప్రయత్నం చేసిన ఎర్రబెల్లి స్వర్ణ, పరకాలను ఆశించిన ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి, కొండా మురళీధర్‌రావుకు కూడా టికెట్ దక్కలేదు. కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అభ్యర్థిత్వంపై ముందే లీక్ కావడంతో అక్కడ ఆశించిన మాజీ మంత్రి, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్‌ను వీడి ఈ నెల 16న జనగామలో కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.
ఇవి చదవండి: ఎన్నికల్లో ఒక్క రూపాయి పంచం.. : ఎంపీ అర్వింద్
Comments
Please login to add a commentAdd a comment