అల్లర్లపై ఐదు కేసులు నమోదు
అత్తాపూర్, న్యూస్‌లైన్: సిక్ చావ్నీ అల్లర్ల ఘటనలో ఇరువర్గాలపై సైబరాబాద్ పోలీసులు ఐదు కేసులు నమోదు చేశారు. మరోపక్క ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాలకు అల్లర్లు విస్తరించకుండా.. ముఖ్యంగా పాతబస్తీలో అదనపు బలగాలను రంగంలోకి దింపారు. శుక్రవారం ప్రార్ధనలు, ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అధికారులు సిక్ చావ్నీపై ప్రత్యేక దృష్టి సారిం చారు. ప్రజల వెసులుబాటు కోసం గురువారం ఉదయం గంట పాటు కర్ఫ్యూను సడలించారు. ఈ సమయం లో ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ అత్యవసర పనులు చక్కబెట్టుకున్నారు.
ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. కిషన్‌బాగ్ నుంచి ఎంఎం పహాడీ వరకు చెక్‌పోస్టులను ఏర్పాటుచేశారు. కిషన్‌బాగ్, చింతల్‌మెట్, నందిముస్లాయిగూడ ప్రాంతాల నుంచి సిక్ చావ్నీ హర్షమహల్ వైపు వాహనాల రాకపోకలను నిషేధించారు. కాగా, కర్ఫ్యూ కారణంగా ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం సాహసించడంలేదు. జనం సంచారం లేకపోవడంతో రహదారులన్నీ ఖాళీగా కనిపిం చాయి. పోలీసులు ఎక్కడికక్కడ నిషేధాజ్ఞలు విధించడంతో పాటు పెట్రోలింగ్ నిర్వహిస్తుండటంతో ప్రశాంత వాతావరణం నెలకొంది. ముందస్తు చర్యగా దక్షిణ మండల పరిధిలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో శుక్రవారం 144 సెక్షన్‌ను విధించారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆన ంద్, జాయింట్ పోలీసు కమిషనర్ గం గాధర్, శంషాబాద్, మాదాపూర్ డీసీపీ లు రమేష్‌నాయుడు, క్రాంతిరాణా టా టా బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
అల్లరి మూకల కోసం గాలింపు...
అల్లర్లకు కారణమైన వారిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. చిన్న చిన్న ఆనవాళ్లను సైతం విడిచి పెట్టడంలేదు. రాళ్లు రువ్విన వారిని పోలీసులు వీడియో ఆధారంగా గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇరువర్గాలకు చెందిన అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
ప్రార్ధనలకు గట్టిబందోబస్తు...
శుక్రవారం ప్రత్యేక ప్రార్ధనల సందర్భంగా ఆయా ప్రాంతాలలో గట్టిబందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ కుశాల్కర్ తెలిపారు. ప్రార్ధనలు జరిగే హర్షమహల్, అత్తాపూర్ బడీమసీద్, చోటామసీద్, నౌనెంబర్, ఎంఎం పహాడీ, మహ్మదాబాద్, వాదియా మహ్మద్, చింతల్‌మెట్, జలాల్‌బాబానగర్, బాసిత్‌బాబానగర్ ప్రాంతాలలో పికెట్‌లను ఏర్పాటు చేశామన్నారు. అలాగే రాంబాగ్, చింతల్‌మెట్, నందిముస్లాయిగూడ ప్రాంతాలలోని ఆలయాల వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతుందన్నారు. ఎక్కడైన అనుమానిత వ్యక్తులు కనిపించినా, అవాంఛనీయ సంఘటనలు జరిగినా.. వెంటనే 100 నెంబర్‌కు సమాచారం అందించాలని ఇన్‌స్పెక్టర్ కుషాల్కర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.